ప్రహసనంగా ఉద్యోగ నియామకాలు
వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలను రాబోయే ఏడాదిన్నర కాలంలో భర్తీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) జూన్ 14న ట్వీట్ చేసింది. ‘ఇది సముద్రంలో నీటి బొట్టంత…’ అంటూ కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగులు నిరసన తెలిపారు. ఒక్క కేంద్ర ప్రభుత్వంలోనే చాలా ఏళ్లుగా 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా- ప్రభుత్వం వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. 10 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రకటన త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి మోదీ సర్కారు వేసిన పాచికగా ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో భాజపాకు ఎంతో కీలకమైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ కూడా ఉన్నాయి.
పరిస్థితి అధ్వానం
పదేళ్లలో 25 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామనే హామీతో మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది. 2020 మార్చి ఒకటో తేదీ నాటికి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 9.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ సమాచారమే తెలుపుతోంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర ఆర్థిక సాయంతో నడిచే ఇతర విద్యాసంస్థల్లో 41,421 బోధనా ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినా, వాటిలో మూడో వంతు ఇప్పటికీ భర్తీ కాలేదని కేంద్ర విద్యామంత్రి వెల్లడించారు. మంజూరైన 61,624 బోధనేతర ఉద్యోగాల్లో 40 శాతం ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రాల్లో భర్తీ చేయకుండా అట్టిపెట్టిన ఉద్యోగాలు 2019 ప్రారంభానికే 60 లక్షలని అంచనా. విద్యతోపాటు వైద్యం, పోలీసు, న్యాయవ్యవస్థల్లోనూ ఖాళీలను భర్తీ చేయడం లేదు. 2018-19లో భారతీయ పాఠశాలల్లో 11 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని యునెస్కో వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్‌లో 3.2 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు, బిహార్‌లో 2.2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అస్సామ్‌లో 90 శాతం, బిహార్‌లో 89 శాతం, పశ్చిమ్ బెంగాల్‌లో 82 శాతం గ్రామీణ పాఠశాలల్లో ఖాళీలు నెలకొన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 18, 16 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే నడుస్తున్నాయి. ఉన్నత విద్య విషయానికి వస్తే దేశమంతటా ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో రెండు లక్షల బోధన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాల్లో కనీసం ముగ్గురు నలుగురు శాశ్వత బోధన సిబ్బంది కూడా లేని విభాగాలు చాలానే కనిపిస్తాయి. ఆరోగ్య రంగంలో 4.43 లక్షల వైద్యులు, సహాయక సిబ్బంది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కొవిడ్ కాలంలో వైద్యుల కొరత కొట్టొచ్చినట్లు కనిపించింది. విద్య, వైద్య రంగాల్లో భర్తీ కాకుండా మిగిలిపోయిన ఉద్యోగాలను చివరకు రద్దు చేయడం పరిపాటిగా మారింది. పోలీసు, న్యాయ శాఖలనూ ఉద్యోగాల ఖాళీ సమస్య పీడిస్తోంది. పోలీసు శాఖలో 5.40 లక్షల ఖాళీలు ఉండగా, దిగువ కోర్టుల్లో పెద్దసంఖ్యలో జడ్జి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి లక్ష జనాభాకు 195 మంది పోలీసు సిబ్బంది ఉండాలని అధికారిక లెక్కలు సూచిస్తుంటే, వాస్తవంలో ఉన్నది 155 మంది మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో లక్ష జనాభాకు 141 పోలీసు పోస్టులు మంజూరైనా, వాస్తవంలో 113 మందే ఉన్నారు. తెలంగాణలో లక్ష జనాభాకు 209 పోలీసు పోస్టులు మంజూరైనా, కేవలం 130 మందే ఉన్నారు. జడ్జీల పరిస్థితీ ఇంతే. 2020లో చైనాలో ప్రతి 10 లక్షల జనాభాకు 300 మంది, అమెరికాలో 150 మంది ఉండగా భారత్‌లో కేవలం 21 మంది మాత్రమే ఉన్నారు. దీంతో కేసుల విచారణకు, తీర్పు ఇవ్వడానికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. మనదేశంలో జడ్జీల సంఖ్యను 21 వేల నుంచి 40 వేలకు పెంచాలని 2016లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ప్రభుత్వానికి స్పష్టంచేసినా ఫలితం లేకపోయింది.
నిరంతర ప్రక్రియే మేలు
వివిధ శాఖల్లో ఉద్యోగుల పదవీ విరమణను బట్టి ఆయా ఖాళీల భర్తీ ప్రక్రియను నిరంతర ప్రాతిపదికపై చేపట్టాలి. కనీసం ఏడాదికి ఒకసారైనా ఈ ప్రక్రియ జరగాలని ఏపీలో ఆశుతోశ్ ముఖర్జీ కమిటీ సహా అనేక సంఘాలు సిఫార్సు చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో నియామకాలకు కోత పెడుతున్నాయి. ఏడో వేతన సంఘం సిఫార్సు చేసిన స్థాయిలో జీతభత్యాలు ఇవ్వడం భారం కాబట్టి నియామకాలను తగ్గించక తప్పడం లేదని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి. ఫలితంగా తాత్కాలిక ఉద్యోగుల నియామకాలనే చేపడుతున్నాయి. ఏపీలో 20 శాతం ప్రభుత్వ ఉద్యోగులు తాత్కాలిక సిబ్బందే. తెలంగాణలో ఇది 14 శాతంగా ఉంది. చాలామంది భావిస్తున్నట్లుగా భారత్‌లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువేమీ కాదు. అమెరికాలో ప్రతి 10వేల మందికి 600 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, మనదేశంలో కేవలం 139 మంది మాత్రమే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ఉమ్మడి అర్హత పరీక్ష(సెట్)ను నిర్వహించడానికి 2020లో జాతీయ నియామక సంస్థ(ఎన్‌ఆర్‌ఏ)ను ప్రారంభించినా, ఆ సంస్థ ఇంతవరకు పని మొదలు పెట్టలేదు. ప్రస్తుతం రైల్వే, బ్యాంకులు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సొంత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఇక నుంచి ఎన్‌ఆర్‌ఏ సెట్ ఆ పని చేస్తుంది. దేశంలో ప్రతి జిల్లాలో ఒక ఎన్‌ఆర్‌ఏ పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని, అన్ని భారతీయ భాషల్లో లిఖిత పరీక్షలు, మౌఖిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రం, రాష్ట్రాలు జాబ్ క్యాలెండర్లను ప్రకటించి ఆ మేరకు కార్యాచరణకు ఉపక్రమిస్తే నిరుద్యోగులకు కొంతైనా ఉపశమనం దక్కుతుంది.
నిరుద్యోగ భూతం
* భారత్‌లో ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ చేపట్టి 30 ఏళ్లు గడచిపోయినా- దేశాన్ని నిరుద్యోగ భూతం పీడిస్తూనే ఉంది.
* దేశంలో నిరుద్యోగం 2020 ఏప్రిల్ నాటికి 23.5 శాతానికి పెరిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమనేది నిరుద్యోగ యువతకు తీరని కలగానే మిగిలింది.
* పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే… 2019లో 1.27 లక్షల రైల్వే ఉద్యోగాల కోసం 2.4 కోట్లమంది దరఖాస్తు చేసుకొన్నారు.
* మొత్తం ప్రభుత్వ సిబ్బందిలో 2014లో 43శాతం… అంటే 1.23 కోట్లమంది తాత్కాలిక ఉద్యోగులేనని ‘ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్’ అధ్యయనం తేల్చింది.