ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా సియూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంపై ఓ కథనం తెర పైకి వచ్చింది. విద్యార్థులకు నమక్ రోటీ(చపాతీ,ఉప్పు) మాత్రమే ఇస్తున్నారన్న ఆ కథనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చపాతీతో పాటు ఏదైనా కర్రీ ఇవ్వాల్సిందిపోయి.. పిల్లలకు ఇలా ఉప్పు పెట్టడమేంటని చాలామంది విస్తుపోయారు. అయితే ఇదంతా వండి వార్చిన కథనం అని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. చెప్పడమే కాదు.. ఆ కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన పవన్ జైస్వాల్ అనే జర్నలిస్టుపై కేసు కూడా పెట్టింది. ఆ కథనంలో ఎలాంటి నిజాలు లేవని పేర్కొంది.అతనితో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేసింది. పవన్ జైస్వాల్ జనసందేశ్ అనే హిందీ పత్రికలో పనిచేస్తున్నారు.
పవన్ జైస్వాల్ బయటపెట్టిన వీడియోలో దాదాపు 100మంది విద్యార్థులకు నమక్ రోటీ వడ్డించడం కనిపించింది. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటిదేమి లేదని చెబుతోంది. ఈ ఘటనపై స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దానికి బాధ్యులైన ఇద్దరు అధికారులను కూడా మెజిస్ట్రేట్ సస్పెండ్ చేసింది.ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కార్ జర్నలిస్టులను టార్గెట్ చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితం నోయిడాలోని ఓ న్యూస్ పోర్టల్‌కి చెందిన కొంతమంది జర్నలిస్టులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద వారిపై కేసులు నమోదు చేశారు. నోయిడా పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నారన్న ఆరోపణలతో వారిపై కేసులు నమోదయ్యాయి.