నల్లమల గుల్లగుల్ల!

0
308

  • చదరపు కిలోమీటరుకు 50 బోర్లు

  • నాలుగు వేల చోట్ల తవ్వకాలు

  • యురేనియం అన్వేషణకు అణుశక్తి సంస్థ సన్నద్ధం

యురేనియం అన్వేషణ దశలోనే నల్లమల అడవుల్లో పెద్దఎత్తున తవ్వకాలు నిర్వహించేందుకు కేంద్ర అణుశక్తి సంస్థ సిద్ధం అవుతోంది. నిక్షేపాల పరిమాణం, నాణ్యత తెలుసుకునేందుకు సర్వే పేరుతో భారీ యంత్రాలు, పెద్దసంఖ్యలో వాహనాలు, సిబ్బందితో నల్లమల అడవుల్లోకి వెళ్లబోతోంది. దాదాపు మూడు నెలల పాటు అడవిలో బోర్ల పేరుతో తవ్వకాలు సాగుతాయి. బోర్ల తవ్వకాలు, వాహనాల శబ్దాలు, జన సంచారంతో నల్లమల అటవీ ప్రాంతానికి, పెద్దపులులు సహా వన్యప్రాణులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యురేనియం దుష్ప్రభావంతో నల్లమలలో నివసిస్తున్న చెంచుల పై, కృష్ణా జలాల పైనా భారీగా ప్రభావం పడే ప్రమాదం ఉండటం మరింత కలవరానికి గురిచేస్తోంది. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) నుంచి యురేనియం అన్వేషణ పై వచ్చిన వివరాల్ని అటవీశాఖ నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లా అటవీ అధికారులకు పంపించింది. యురేనియం సర్వే ద్వారా పడే ప్రభావాన్ని అంచనావేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అచ్చంపేట, నాగార్జునసాగర్ డివిజన్ల అధికారులు దృష్టిసారించారు.

రెండు రకాల బోర్లు.. ఒకటి 3 అంగుళాల చుట్టుకొలతతో, మరో రకం దాదాపు 8 అంగుళాల చుట్టుకొలతతో బోర్లు ఉంటాయని అటవీశాఖకు అప్లోడ్ చేసిన వివరాల్లో ఏఎండీ పేర్కొంది. అన్వేషణలోనే వేల సంఖ్యలో బోర్లంటే తీవ్ర దుష్పభావం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

వేగంగా అణుశక్తి సంస్థ ప్రయత్నాలు.. యురేనియం అన్వేషణకోసం ఎన్ని వాహనాలు, యంత్రాల్ని అడవిలోకి తీసుకెళ్తారు? బోర్లు వేసే ప్రాంతాలకు వెళ్లేందుకు రహదారులు ఉన్నాయా? అంటూ అటవీశాఖ అడిగిన ప్రశ్నలకు ఏఎండీ వ్యూహాత్మకంగా సమాధానాలు ఇచ్చింది. నాలుగువేల బోర్ పాయింట్లకు వెళ్లాలంటే భారీ సంఖ్యలో చెట్లను తొలిగించాల్సి ఉంటుంది. వాహనాల రాకపోకలకు పెద్ద సంఖ్యలో కొత్త రహదారులు వేయాలి. అలా చేయడం ఓ పెద్ద ప్రక్రియ. అటవీభూములను బదలాయించాలి. అటవీ అనుమతులు తీసుకోవాలి. కానీ ఇవేమీ ప్రస్తావించకుండా నల్లమలలో ప్రస్తుతం ఉన్న రహదారులు సరిపోతాయని ఏఎండీ చెప్పడం వ్యూహాత్మకం. అటవీ అనుమతుల సమస్య ఉత్పన్నం కాకుండా వేసిన ఎత్తుగడ అని అటవీ ఉన్నతాధికారి ఒకరు విశ్లేషించారు.

పెద్దపులి సురక్షితం నల్లమలలోనే తెలంగాణలో పెద్దపులి సురక్షితంగా ఉన్నది నల్లమల అటవీప్రాంతంలోనే. కవ్వాల్ టైగర్ రిజర్వులో పెద్దపులుల కనిపిస్తున్నా ఇది దట్టమైన అటవీప్రాంతం కాదు. జన సంచారంతో మహారాష్ట్రకు తిరిగి వెళ్లిపోతున్నాయి. ఉన్న కొన్ని పులులు వేటగాళ్ల చేతిలో బలవుతున్నాయి. నల్లమలలోని అమ్రాబాద్లోనే దాదాపు 20 వరకు పులులున్నాయి. యురేనియం కోసం సర్వే జరిగే ప్రాంతం టైగర్ రిజర్వులో ప్రధాన ప్రాంతంలో ఉంది. అన్వేషణకు వచ్చే జనం, వాహనాల రణగొణధ్వనులు, బోర్ల శబ్దాలతో పులులు అక్కడి నుంచి కొత్త ప్రాంతాలకు వలసపోయే పరిస్థితులు రావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. యురేనియం నమూనాల సేకరణ కోసం నల్లమలలోని 83 చ.కి.మీ ప్రాంతంలో 4 వేల చోట్ల.. అంటే చ.కి.మీ.కు దాదాపు 50 చొప్పున బోర్లు వేస్తారు. ఒక్కో బోరును 164 నుంచి 328 అడుగుల లోతు వరకు తవ్వుతారు!

  • యురేనియం అన్వేషణకు ప్రతిపాదించిన నాగర్ కర్నూల్ జిల్లా ఉడిమిల్ల, పదర, నల్గొండ జిల్లా అటవీ డివిజన్లోని నారాయణపురం నల్లమల పెద్దపులుల రక్షిత ప్రాంతం పరిధిలోనివి.
  • మొత్తం 83 చ.కి.మీ ప్రాంతంలో, నాలుగువేల చోట్ల బోర్లు వేస్తామని ఏఎండీ పేర్కొంది.
  • ఇందులో 16 చ.కి.మీ అమ్రాబాద్ అటవీ ప్రాంతంలోకి తక్కింది నాగార్జునసాగర్ అటవీ డివిజన్ పరిధికి వస్తుంది.

(COURTECY EENADU)

Leave a Reply