నేటి ప్రధాన వార్తలు

0
261

తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగలడంతో ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మల్లు భట్టివిక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనసూయ, తూర్పు జయప్రకాశ్ రెడ్డి, పోడెం వీరయ్యలను సభ నుంచి సస్పెండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు గందగోళం చేయడంతో ఈ మేరకు చర్య తీసుకున్నారు.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ శనివారం విడుదల చేశారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక దశలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామని తెలిపారు. మార్చి 21న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను 24న వెల్లడిస్తామన్నారు. మార్చి 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరిపి, 27న ఫలితాలను ప్రకటిస్తామన్నారు. మార్చి 27న తొలివిడత పంచాయతీ ఎన్నికలు, 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

ఏపీలో టెన్త్‌ పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పదోతరగతి పరీక్షలకు వాయిదా వేశారు. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8వ వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 31 పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 17 వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

పీఎంబీజేపీ లబ్ధిదారులతో మాట్లాడిన మోదీ
కరోనా వైరస్‌పై వస్తున్న వదంతులను నమ్మొద్దని, డాక్టర్ల సలహాలు పాటించాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జన ఔషధీ కేంద్రాల యజమానులు, ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన(పీఎంబీజేపీ) లబ్ధిదారులతో మాట్లాడారు. పక్షవాతానికి లోనై.. జన ఔషధి పథకం ద్వారా కోలుకున్న దీపా షా అనే మహిళ మాట్లాడిన మాటలు ఆలకించి మోదీ భావోద్వేగానికి లోనయ్యారు.

జయప్రదకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌
సీనియర్‌ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్‌ 20న విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించింది. గతంలో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన జయప్రద.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

కువైట్‌ విమానాలు రద్దు
కరోనా వైరస్ (కోవిడ్ -19) ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కువైట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంతో సహా ఏడు దేశాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేసింది. ఈ ఆదేశాలు ఒక వారం పాటు అమల్లో వుంటాయని కువైట్‌ అధికారులు ప్రకటించారు.

యస్ బ్యాంకు వాటా కొనుగోలుకు ఓకే
సంక్షోభంలో కూరుకుపోయిన యస్‌ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు ఎస్‌బీఐ బోర్డు సూత్ర ప్రాయ ఆమోదం తెలిపినట్టు ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్ కుమార్ వెల్లడించారు. యస్‌ బ్యాంకు సంక్షోభం,ఆర్‌బీఐ డ్రాప్ట్‌ ప్లాన్ల తదితర పరిణామాల నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమ ప్రతిపాదనలకు మార్చి 9వ వరకు సమయం ఉందని ఆ లోపు ఆర్‌బీఐ ముందు ఉంచుతామని వెల్లడించారు. 30 రోజుల గడువు లోపే యస్‌ బ్యాంకును రక్షించే పథకాన్ని సిద్ధం చేస్తామన్నారు. ఇందు కోసం 24 గంటలూ పని చేస్తామని చెప్పారు.

Leave a Reply