పునర్విభజనపై దుమారం

0
142
  • జమ్మూలో 6, కశ్మీర్‌లో 1
  • అసెంబ్లీ సెగ్మెంట్లు పెంచాలని
  • పునర్విభజన సంఘం ప్రతిపాదన
  • పక్షపాతమంటూ కశ్మీరీ పార్టీల తీవ్ర వ్యతిరేకత

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన అనంతరం జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కసరత్తుపై రాజకీయ దుమారం చెలరేగింది. నియోజకవర్గాల పునర్విభజన సంఘం చేసిన ప్రతిపాదనలపై అక్కడి రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. వీటిలో పక్షపాతం కనిపిస్తోందని ఆరోపించాయి. జమ్మూ ప్రాంతంలో అదనంగా ఆరు నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, కశ్మీర్‌లో అదనంగా కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తొలిసారిగా ఎస్టీలకు 9 సీట్లు, ఎస్సీలకు ఏడు సీట్లను రిజర్వు చేయాలని కూడా ఈ సంఘం ప్రతిపాదించింది. ప్రస్తుతం కశ్మీర్‌ డివిజన్‌లో 46, జమ్మూ డివిజన్‌లో 37 స్థానాలు మొత్తం 83 ఉండడం గమనార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం కశ్మీర్‌లో 68.8 లక్షలు, జమ్మూలో 53.5 లక్షల జనాభా ఉంది. కశ్మీర్‌లో 15 లక్షల జనాభా అధికంగా ఉంది. నూతన ప్రతిపాదనల ప్రకారం కశ్మీర్‌లో 47, జమ్మూలో 43 సీట్లు మొత్తం 90కి పెరుగుతాయి. ఇవి కాకుండా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని మరో 24 స్థానాలు లెక్కలో కొనసాగుతాయి. కశ్మీర్‌లో 1.46 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గం, జమ్ములో 1.25 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌ ఏర్పాటు చేసినట్టు అవుతుంది. దాంతో సీట్ల పెంపుపై శాస్త్రీయ అధ్యయనంతో ప్రతిపాదనలు చేయలేదని, కేవలం భాజపా రాజకీయ అజెండాను అమలు చేస్తున్నారని విపక్షాలు విమర్శించాయి.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా దేశాయి ఆధ్వర్యంలోని ఈ కమిటీ సోమవారం రెండో సారి ఇక్కడి అశోకా హోటల్‌లో భేటీ అయింది. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన అయిదుగురు పార్లమెంటు సభ్యులు అనుబంధ సభ్యులుగా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర పదవిరీత్యా సభ్యునిగా కొనసాగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా తొలిసారిగా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇద్దరు భాజపా ఎంపీలు సభ్యులుగా ఉండగా, అందులో ఒకరు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ కావడం గమనార్హం. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 31లోగా అభిప్రాయాలను చెప్పాలని పునర్విభజన సంఘం అన్ని పార్టీలను కోరింది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో జిల్లాలు 12 నుంచి 20కి, తాలూకాలు 52 నుంచి 207కు పెరిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. జనసాంద్రత, విస్తీర్ణత, భౌగోళిక స్వరూపం తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని వాటిని ఏ, బీ, సీలుగా వర్గీకరించి, నియోజకవర్గాలను విభజించినట్టు తెలిపింది. చదరపు కిలోమీటరుకు కిష్టావర్‌ జిల్లాలో 29 మంది నివసిస్తుండగా, శ్రీనగర్‌లో 3,436 మంది ఉన్నారని ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నట్టు వివరించింది. 1994-95లో చివరిసారిగా పునర్విభజన జరిగినప్పుడు మొత్తం సీట్లను 76 నుంచి 87కు పెంచారు. జమ్మూలో 32 నుంచి 37కు, కశ్మీర్‌లో 42 నుంచి 46కు, లద్దాఖ్‌లో రెండు నుంచి నాలుగుకి పెంచారు. లద్దాఖ్‌ ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని మినహాయించారు.

ఆమోదయోగ్యం కాదు
పునర్విభజన సంఘం ప్రతిపాదనలు తమకు  ఆమోదయోగ్యం కాదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేర్కొంది. ఈ ముసాయిదా ప్రతిపాదనలపై తాము సంతకం చేయబోమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అలీ మహమ్మద్‌ సాగర్‌ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ ప్రజలను మత, ప్రాంతీయ ప్రాతిపదికన విభజించడమే లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు.

Courtesy Eenadu

Leave a Reply