వ్యాక్సిన్ కోసం 1.65 కోట్ల మంది వెయిటింగ్

0
42
  • ఇప్పటిదాకా వేసింది కోటి మందికే
  • 17.02 లక్షల మందికి రెండు డోసులు
  • 82.42 లక్షల మందికి సింగిల్ డోసు

హైదరాబాద్ : రాష్ర్టంలో కరోనా వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోంది. రోజూ 2 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు. 18 ఏండ్ల వయసు దాటినవాళ్లు 2,64,64,870 మంది ఉండగా, ఇందులో 31.14 శాతం మంది సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. 6.43 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. మొత్తంగా 38 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోగా, కనీసం ఒక్క డోసు కూడా అందనివాళ్లు 62 శాతం మంది ఉన్నారు. అర్బన్ ఏరియాల్లో కొంత స్పీడ్‌‌గా వ్యాక్సినేషన్ జరుగుతుండగా, గ్రామీణ జిల్లాల్లో చాలా తక్కువగా జరుగుతోంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 82.22 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోగా, నారాయణపేట్ జిల్లాలో 11.9 శాతం మందికే వ్యాక్సిన్ అందింది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 26.76 లక్షల మంది ఉంటే, అందులో 22.03 లక్షల మందికి టీకా వేశారు. నారాయణపేట్‌‌లో 4,02,033 మంది ఉంటే, అందులో 47,856 మందికి మాత్రమే వేశారు. ఆసిఫాబాద్, గద్వాల్, ములుగు, వనపర్తి జిల్లాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది.

ఇలాగే కొనసాగితే ఐదు నెలలైతది..
రాష్ర్టంలో ఇంకో 1.65 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. ఇప్పటిలాగే వ్యాక్సినేషన్ స్లోగా కొనసాగితే, అందరికీ కనీసం సింగిల్ డోసు వేసేసరికి ఇంకో 5 నెలలు పట్టేలా ఉంది. కానీ, అక్టోబర్‌‌‌‌లోనే థర్డ్ వేవ్‌‌ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆరు, ఏడు జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. అసలు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా, బెడ్ల డ్యాష్ బోర్డును ప్రభుత్వం నిలిపివేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లపై  డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావం తక్కువగా ఉందని, సింగిల్ డోసు తీసుకున్నవాళ్లపై ఎక్కువగా ఉంటోందని డాక్టర్లు చెబుతున్నారు. మన దగ్గర రెండు డోసులు తీసుకున్నవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో డెల్టా వేరియంట్ విస్తరిస్తే చాలా మంది దవాఖాన్ల పాలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, హెల్త్ డిపార్ట్‌‌మెంట్ మాత్రం వారానికి ఐదు రోజులే కరోనా వ్యాక్సిన్  వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై బుధ, ఆదివారాల్లో కరోనా వ్యాక్సినేషన్ ఉండబోదని ప్రకటించింది.

Courtesy V6velugu

Leave a Reply