చైనా ఆటకట్టు

0
348
  • పబ్జీ సహా 118 యాప్‌లపై వేటు!
  • అత్యధికం చైనా కంపెనీలకు చెందినవే
  • బైదు, కామ్‌కార్డ్‌, అలీపే ప్రధానమైనవి
  • చైనా తాజా అతిక్రమణ నేపథ్యంలో నిర్ణయం
  • దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించాయి
  • సార్వభౌమాధికారానికి సవాలుగా నిలిచాయి
  • కేంద్ర ఐటీ శాఖ ప్రకటనలో వేటుపై వివరణ  
  • ఇప్పటివరకు 224 యాప్‌లపై నిషేధం
  • ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగమేనా?

భారత్‌ వ్యూహం మార్చింది. సరిహద్దుల్లో దురాక్రమణకు తెగబడుతున్న చైనాపై అదే దూకుడును ప్రదర్శించింది. లద్ధాఖ్‌లో మొన్నటిదాకా బఫర్‌జోన్‌ కింద మనం వదిలేసిన పాంగాంగ్‌ సరస్సు ఫింగర్‌ 4 ప్రాంతం వరకు మన బలగాలు చొచ్చు కెళ్లాయి. దీంతో ఫింగర్‌ 4 పై భారత్‌కు నియంత్రణ వచ్చింది. మరోపక్క చైనాపై డిజిటల్‌ స్ట్రైక్‌ కొనసాగు తోంది. బుధవారం మూడోసారి మరో 118 యాప్‌లను భారత్‌ నిషేధించింది. అందులో ఎక్కువ చైనా దేశానికి చెందినవే. ముఖ్యంగా దేశంలోని యువతకు వ్యసనంగా మారిన పబ్జీ గేమ్‌ను నిషేధించాలని ఎప్పటి నుంచో తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చింది. పబ్జీ పేరుకు దక్షిణ కొరియా కంపెనీ అయినప్పటికీ దీనిలో ప్రధాన వాటాలు చైనా కంపెనీలకే ఉన్నాయి.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: దేశంలోని యువతలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ గేమింగ్‌ యాప్‌ పబ్జీ సహా 118 మొబైల్‌ యాప్‌లను భారత ప్రభుత్వం బుధవారం నిషేధించింది. వాటిలో ఎక్కువ చైనా దేశానికి చెందినవే. రద్దయిన వాటిలో పబ్జీతో పాటు వీచాట్‌ వర్క్‌, బైదు, కామ్‌కార్డ్‌, రైజ్‌ ఆఫ్‌ కింగ్‌డమ్స్‌-లాస్ట్‌ క్రూసేడ్‌, అలీపే వంటి ఆదరణ పొందినవి ఉన్నాయి. ముఖ్యంగా యువతలో పబ్జీ వ్యసనంగా మారింది. ఈ ఆటకు దేశంలో ఐదు కోట్లకు పైగా యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. వారిలో కనీసం 1.3 కోట్ల మంది రోజూ పబ్జీ ఆడతారు. అంటే, దేశ జనాభాలో ఒక శాతం మంది నిత్యం ఈ ఆటలో మునిగి తేలుతున్నారన్న మాట. లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మూడోసారి భారత ప్రభుత్వం చైనా యాప్‌ల భరతం పట్టింది. జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చైనా దురాక్రమణకు దిగిన వారం రోజుల్లోనే 59 చైనా యాప్‌లను భారత్‌ నిషేధించింది. మరో నెల రోజుల తర్వాత టిక్‌టాక్‌ సహా 47 చైనా యాప్‌లపై వేటేసింది. ఈ వరుసలో ఇప్పటివరకు మూడు దఫాలుగా 224 యాప్‌లు నిషేధానికి గురయ్యాయి.

భారత సార్వభౌమాధికారానికి, దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నందుకు ఐటీ చట్ట 69-ఏ నిబంధన కింద ఈ యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సైబర్‌ ప్రపంచంలో భారత్‌ సార్వభౌమాధికారం, దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని వేటు నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కోట్ల మంది భారతీయ మొబైల్‌ యూజర్ల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొన్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ యూజర్లకు సంబంధించిన డేటాను ఈ యాప్‌లు దుర్వినియోగం చేస్తున్నట్లు, వారి డేటాను ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు వెల్లడించింది. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన శక్తులు ఈ సమాచారాన్ని డేటా మైనింగ్‌ ద్వారా విశ్లేషించి, ఉపయోగించుకుంటే దేశ సమగ్రతకే ఆపద వస్తుందని, ఇది చాలా తీవ్రమైన విషయమని పేర్కొంది. పార్లమెంటులో, బయటా పలు వర్గాల నుంచి కూడా నిషేధం డిమాండ్లు వచ్చాయని తెలిపింది. వ్యక్తుల గోప్యతకు కూడా ఈ యాప్‌ల ద్వారా ముప్పు ఉందని వెల్లడించింది. జూన్‌, జూలైల్లో నిషేధించిన చైనా యాప్‌ల్లో ఈకామర్స్‌, గేమింగ్‌, సోషల్‌ మీడియా, బ్రౌజింగ్‌, ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌, ఫైల్‌ షేరింగ్‌ యాప్‌లు ఉన్నాయి. అప్పట్లో వేటుకు గురైన యాప్‌లలో టిక్‌టాక్‌, షేరిట్‌, ఎంఐ వీడియో కాల్‌, క్లబ్‌ ఫ్యాక్టరీ, క్యామ్‌స్కానర్‌ ప్రధానమైనవి. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా భారత ఐటీ కంపెనీలను ప్రోత్సహించేందుకు ఈ యాప్‌ల మీద నిషేధం పెట్టారనే ప్రచారం కూడా జరుగుతోంది. గత జూలైలో నీతి ఆయోగ్‌ ఆత్మ నిర్భర్‌ యాప్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ను ప్రకటించింది.

రద్దయిన కొన్ని యాప్స్‌
ఏపీయూఎస్‌ సెక్యూరిటీ, బైదూ, బైదూ ఎక్స్‌ప్రెస్‌ ఎడిషన్‌, ఫేస్‌యూ(ఇన్‌స్పైర్‌ యువర్‌ బ్యూటీ), షేర్‌ సేవ్‌ బై జియోమీ, కామ్‌కార్డ్‌, ఇన్‌నోట్‌, సూపర్‌క్లీన్‌, వీచాట్‌ వర్క్‌, టెన్సెంట్‌ వియూన్‌, సైబర్‌ హంటర్‌, నైవ్స్‌ అవుట్‌ నోరూల్స్‌, జస్ట్‌ ఫైట్‌, డాన్‌ ఆఫ్‌ ఐల్స్‌, లూడో వరల్డ్‌ లూడో సూపర్‌స్టార్‌, చెస్‌ రష్‌, పబ్‌జీ మొబైల్‌, రైజ్‌ ఆఫ్‌ కింగ్‌డమ్స్‌ లాస్ట్‌ క్రూసేడ్‌, ఆర్ట్‌ ఆఫ్‌ కాంక్వెస్ట్‌ డార్క్‌ హొరైజన్‌, యాప్‌లాక్‌, అలీపే, రోడ్‌ ఆఫ్‌ కింగ్స్‌ ఎండ్‌లెస్‌, వీపీఎన్‌ ఫర్‌ టిక్‌ టాక్‌, లెజెండ్‌ రైజింగ్‌ ఎంపైర్‌ నెట్‌ఈజ్‌ గేమ్స్‌.

Courtesy Andhrajyothi

Leave a Reply