అడవి బిడ్డలకు ఆయుషు రెండు నెలలే !

0
121
కాన్పు అయిన వెంటనే కడతేరుతున్న పలువురు చిన్నారులు
  • 30 రోజుల్లో 12 మంది చెంచుబిడ్డల మృతి
  • బాలింత రోగాలతో తల్లడిల్లుతున్న తల్లులు 
  • చెంచుల బతుకులు దయనీయం 

నల్లమల చెంచుపెంటల్లో కాన్పు అయిన నెలకే బిడ్డలు ఎంతో మంది ప్రాణం కోల్పోతున్నారు. 30 రోజుల్లో 12 మంది చిన్నారులు మృతిచెందారు. సకాలంలో వైద్యం అందక బాలింత రోగంతో తల్లులు కూనరిల్లుతున్నారు. గర్బిణీలకు ఎటువంటి వైద్యం అందకపోవడంతో బిడలు రక్తహీనతతో పుట్టి చనిపోతున్నారు. సరియైన మంచినీరు, ఆహారమూ వారికి అందడం లేదు. వైద్యం అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లాలంటే చేతిలో చిల్లిగవ్వ లేని దయనీయ పరిస్థితి. దీంతో రోగమొచ్చినా.. నొప్పులు వచ్చినా.. పసరు మందు వేసుకుంటున్నారు. పుట్టిన 10 మందిలో 8 మంది చనిపోతున్నారని చెంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆ ప్రాంతాన్ని ‘నవతెలంగాణ’ సందర్శించింది. తమ బాధలను కన్నీటితో వివరించారు.

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్, పదర, లింగాల, కొల్లాపూర్, బల్మూరు మండలాల పరిధిలో చెంచు పెంటలు ఉన్నాయి. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం అయిన అప్పాపూర్, మేడిమల్కర, సంగడి గుండాల తదితర చెంచు పెంటలకు రవాణా సదుపాయం లేదు. ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తే….రూ. 1000 పెట్టి ప్రయివేటు వాహనాల్లో పోవాలి. ప్రభుత్వం వీరికి ఎటువంటి వైద్య సదుపాయమూ కల్పించలేదు. దీంతో సకాలంలో వైద్యమందక 30 రోజుల వ్యవధిలోనే 12 పసిబిడ్డలు మృతిచెందారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అప్పాపూర్ పెంటకు చెందిన సలేశ్వరి నెల రోజుల కిందట మగబిడ్డకు జన్మనిచ్చింది. వైద్యుల పర్యవేక్షణలో గాకుండా స్థానికంగా కాన్పు అయింది. దీంతో బిడ్డ పాలు తాగకుండా ఉండి చనిపోయింది. మేడిమల్కల పెంటలో లింగమ్మ- బయ్యన్నకు కూతురు పుట్టింది. ఆరోగ్యంగానే ఉంది. రాత్రి పూట పాలు తాగి నిద్రపోయింది. తెల్లారేసరికి బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. అదేవిధంగా సంగడి గుండాలకు చెందిన రామలింగేశ్వరి – కృష్ణల కూతురు చనిపోయింది. ఊపిరి ఆడక చనిపోయినట్టు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాంపూర్‌ పెంటకు చెందిన లింగమ్మగురువయ్యకు పుట్టిన మగబిడ్డ, అదే పెంటకు చెందిన లక్ష్మి-బాలగురువయ్యకు పుట్టిన మగబిడ్డ చనిపోయారు. బైరాపూర్ పెంటకు చెందిన బౌరమ్మ- లింగయ్యల బాబు నెల రోజులు తిరగక ముందే చనిపోయాడు. రాత్రంతా బాగానే ఉన్నాడని ఉదయం అయ్యేసరికి చనిపోయాడని బోరున విలపించారు. ఇలాంటి ఘటనలు చెంచు పెంటల్లో సర్వసాధారణం అయ్యాయని అక్కడివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లమలలో సుమారు 70 చెంచు పెంటలు ఉన్నాయి. ప్రతి రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. బాలింతలు సైతం వైద్యం అందక మరణిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా.. పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. బాలింతలు, చిన్నారులే కాదు యుక్తవయసు ఉన్నవారు సైతం మంచాన పడుతున్నారు. భర్త లేనివారు.. భార్య లేని వారే అధికంగా ఉన్నారు ఈ చెంచు పెంటల్లో.

వైద్యం అందక.. పౌష్టికాహారం లేక బక్కచిక్కి
నల్లమల చెంచుపెంటల్లో బతుకు దుర్భరంగా మారింది చెంచులకు. ముఖ్యంగా శ్రీశైలం రహదారికి 30 కిలోమీటర్ల దూరాన ఉన్న అప్పాపూర్, మేడిమల్కల, సంగిడిగుండాల, బౌరాపూర్, సూరాపూరఖ్ వంటి పెంటకు కనీసం రవాణ సౌకర్యం లేదు. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే భయంతో వణికిపోతుంటారు. సీజనల్ వ్యాధుల వల్ల ఇబ్బందులు పడుతారు. వీరు దట్టమైన అడవిలో ఉంటున్నారు. వైద్యం అందుబాటులో ఉండటం లేదు. దీంతో చెంచులు కానుగ, దుసరితీగ, కొరివి వంటి 26 చెట్ల బెరడులతో తయారు చేసిన రసాన్ని నీటిలో వేసి పుట్టిన బిడ్డకు, తల్లికి స్నానం చేయిస్తారు. పసరిక మందులు తినడం వల్ల ఆరోగ్యం కుదుటపడక చాలామంది చనిపోతున్నారు. వారానికి ఒకసారి అయినా.. వైద్యులు రాకపోవడంతో చెంచులు నిత్యం అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మేము ఎలా బతకాలి
లింగయ్య చెంచు అప్పాపూర్
మాకు తిండి లేదు. నీళ్లు లేవు. ఎండ గొడితేనే తాగునీరు వస్తోంది. వరుసగా వారం రోజులు ఎండ లేకుంటే తాగనీకే నీళ్లు ఉండవు. బోరు ద్వారా వచ్చే నీరు గంజిలాగా ఉంటుంది. ఆ నీళ్లు తాగడం వల్లనే మాకు ఈ రోగాలు వస్తున్నాయి.

వైద్యం అందించి చెంచుజాతిని కాపాడాలి
ధర్మానాయక్ – గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి
నల్లమల అడవిలో ఉండే చెంచులతోపాటు మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులను రక్షించుకోవాలి. ముఖ్యంగా వారికి స్వచ్ఛమైన నీరు, ఆహారం అందించాలి. వైద్యం అందుబాటులో ఉంటే ఇన్ని మరణాలు జరిగేవి కాదు. ఇప్పటికైనా చెంచు జాతి రక్షణ కోసం వైద్యంతో పాటు ఆహారం, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి.

Leave a Reply