విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన..12 మందికి కరోనా పాజిటివ్‌

0
77
  • 13కు చేరిన కేసులు.. అంతా టిమ్స్‌కు
  • ఢిల్లీలో మరో 12 మందికి కూడా..
  • అందరూ అంతర్జాతీయ ప్రయాణికులే
  • యూకే, సింగపూర్‌ నుంచి ఇద్దరు తమిళనాడుకు.. ఇద్దరికీ పాజిటివ్‌
  • జైపూర్‌లో 9 మంది నమూనాలు టెస్ట్‌కు
  • కొడంగల్‌ గురుకులంలో ఐదుగురికి
  • సూర్యాపేట, నిజామాబాద్‌, జగిత్యాల హాస్టళ్లలోనూ పలువురికి వైరస్‌

హైదరాబాద్‌ సిటీ/ఓల్డ్‌ బోయిన్‌పల్లి, కుత్బుల్లాపూర్‌: విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చినవారిలో మరో 12 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముప్పు జాబితాలోని దేశాల నుంచి శుక్రవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన 219 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం ఒక మహిళకు పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 13 మందికి కొవిడ్‌ ఉన్నట్లు తేలగా.. అందరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపినట్లు వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. వీరందరికీ గచ్చిబౌలిలోని టిమ్‌ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పాజిటివ్‌లలో 9 మంది యూకే నుంచి, సింగపూర్‌, కెనడా, అమెరికా నుంచి ఒక్కొక్కరు వచ్చారు. కాగా, ఒమైక్రాన్‌ నేపథ్యంలో కిట్లు, మందులన్నింటిని అందుబాటులో ఉంచినట్లు వైద్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 26.31 లక్షల యాంటీజెన్‌ కిట్‌లు, 3.74 లక్షల ఆర్టీపీసీఆర్‌ కిట్‌లు, 43.14 లక్షల ఎన్‌-95 మాస్కులు, 8.16 లక్షల పీపీఈ కిట్‌లు, 1.56 కోట్ల త్రీలేయర్‌ మాస్కులు, 8.71 లక్షల హోంఐసోలేషన్‌ కిట్‌లు, 2.42 లక్షల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌, 7.01 కోట్ల పారాసిటమాల్‌, 2.80 కోట్ల లివోసిట్రాజిన్‌, 1.47 కోట్ల అజిత్రోమైసిన్‌, 1.85 కోట్ల డాక్సిలిన్‌  మాత్రలు ఉన్నట్లు తెలిపింది.

టీకా కోసమూ ఇంటింటికి వెళ్లండి
‘‘నాయకులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వెళ్లినట్టు.. టీకా వేయించుకున్నారా..? లేదా..? అన్నది పరిశీలించేందుకు ఇంటింటికి ఒకటి, రెండు సార్లు వెళ్లాలని’’ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌ ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని శాంతినికేతన్‌ కాలనీలో శుక్రవారం బస్తీ దవాఖానా, సంచార టీకా వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్‌ ముద్దం నరసింహయాదవ్‌కు వ్యాక్సినేషన్‌పై సూచనలు చేశారు. అనంతరం సమీపంలోని ఇళ్లకు వెళ్లి టీకా వేసుకున్నారా..? లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన మహిళలకు కరోనా పాజిటివ్‌గా తేలిందని.. ఏ వేరియంటో తెలియాల్సి ఉందని మంత్రి అన్నారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదని, కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లతో ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా, యాదవ బస్తీలో 900 మంది మొదటి డోస్‌ టీకా కూడా వేసుకోలేదని వైద్య సిబ్బంది చెప్పడంతో మంత్రి ఆశ్చర్యపోయారు. మీరంతా ఏం చేస్తున్నారని ప్రజా ప్రతినిధులు, సిబ్బందిని ప్రశ్నించారు. 100 శాతం టీకా పూర్తి చేసి రిపోర్టు పంపాలని కార్పొరేటర్‌ ముద్దం నరసింహయాదవ్‌కు సూచించారు. కార్యక్రమానికి వచ్చినవారిలో 25 శాతం మందికి మాస్క్‌ లేదని చురకలంటించారు.

విమానాశ్రయంలో నెగెటివ్‌.. ఇంటికొచ్చేసరికి పాజిటివ్‌
యూకే నుంచి వచ్చిన ఓ మహిళకు నిర్వహించిన రెండు వేర్వేరు కొవిడ్‌-19 పరీక్షల్లో ఒక రిపోర్టు నెగెటివ్‌.. మరో రిపోర్డు పాజిటివ్‌ రావడంతో గందరగోళం నెలకొంది. రెండో ఫలితం పాజిటివ్‌ రావడం అధికారులను ఉరుకులు పెట్టించింది. కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ గణే్‌షనగర్‌ లో ఉంటున్న తల్లిదండ్రులను చూసేందుకు ఓ మహిళ (36) తన 5 ఏళ్ల పాపతో ఈ నెల 1న లండన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా రాత్రి 10.30కు నెగెటివ్‌ వచ్చిందని అధికారులు నిర్ధారించారు. దీంతో ఆమె బయటకు వెళ్లిపోయారు. అయితే, అదే రోజు రాత్రి 9.54కు చేసిన పరీక్షలో పాజిటివ్‌ తేలింది. విమానాశ్రయ అధికారులు అప్రత్తమమై జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, వైద్యశాఖ అధికారులు ఆమె నివాసానికి చేరుకున్నారు. మహిళను గేటు వద్దనే నిలిపి విషయాన్ని వివరించారు. ఆస్పత్రిలో చేరాలని సూచించగా ఆమె సరేమిరా అన్నారు. చివరకు నచ్చజెప్పి టిమ్స్‌కు తరలించారు. అక్కడ చేసిన పరీక్షలోనూ పాజిటివ్‌గానే తేలింది. నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ప్రాథమిక కాంటాక్టుల్లో తల్లిదండ్రులు, సోదరుడి కి నెగెటివ్‌ వచ్చింది. కుమార్తె రిపోర్టులు రావల్సి ఉంది.

రాష్ట్రంలో కొత్తగా 198 కేసులు
రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు 150లోపే వచ్చే పాజిటివ్‌ల సంఖ్య 200కు సమీపిస్తోంది. శుక్రవారం   39,140 మందికి పరీక్షలు చేశారు. 198 మందికి పాజిటివ్‌ వచ్చింది. మరో ఇద్దరు చనిపోయారు. 3,723 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసుల్లో హైదరాబాద్‌లో 82, రంగారెడ్డి జిల్లాలో 18, సంగారెడ్డిలో 15, హన్మకొండలో 11 నమోదయ్యాయి. కొత్తగా 2,76,319 మంది టీకా తీసుకున్నారు. ఇందులో తొలిడోసు 1,33,259, రెండో డోసు 1,43,060 మంది తీసుకున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply