మగ్గంపై పిడుగు

0
459
  • వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ బాదుడు
  • ఇప్పటికే 5 శాతం ఉన్న పన్ను
  • మరో 7 శాతం పెంపుతో ఈ రంగంపై తీవ్ర ప్రభావం
  • చేనేత మగ్గాలకు గడ్డు రోజులే
  • కార్మికులు, సహకార సంఘాల్లో గుబులు
  • ఆందోళనకు సిద్ధమవుతున్న వస్త్ర, వ్యాపార రంగాల ప్రతినిధులు

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ పెంపుదల నిర్ణయం రాష్ట్రంలోని చేనేత, జౌళిరంగానికి పిడుగుపాటు కానుంది. మరో ఏడు శాతం పెరిగితే ఉత్పత్తుల ధరలు పెరిగి వస్త్రాల క్రయవిక్రయాలు గణనీయంగా తగ్గుతాయని, ఈ ప్రభావం చేనేతపై ఆధారపడిన వేల మంది కార్మికులకు ఉపాధిని దూరం చేస్తుందనే ఆందోళనను కార్మిక, వ్యాపార వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే కష్టాలతో కునారిల్లుతున్న ఈ రంగానికి ఇది మరణశాసనం రాస్తుందనే అభిప్రాయాన్ని అటు టెస్కో, ఇటు సహకార సంఘాలు వ్యక్తంచేస్తున్నాయి.

తెలంగాణలో చేనేత రంగంపై 44 వేల కుటుంబాలు, మరమగ్గాల రంగంపై 33 వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. వస్త్ర పరిశ్రమపై 2017లో కేంద్రం తొలిసారిగా 12 శాతం జీఎస్టీని విధించింది. దీనిపై కార్మికులు, వ్యాపారవర్గాలు ఆందోళన చేయడంతో దానిని అయిదు శాతానికి తగ్గించింది. అయినప్పటికీ ఆ మేరకు ధరలు పెరిగిన నేపథ్యంలో చేనేత వస్త్రాల క్రయవిక్రయాలు భారీగా తగ్గాయి. మిల్లు తయారీ వస్త్రాల ధరలు తక్కువగా ఉండి మార్కెట్‌ను ముంచెత్తడం, వాటితో పోలిస్తే చేనేత వస్త్రాల ధరలు ఎక్కువగా ఉండటం కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. దీనికితోడు రెండేళ్ల క్రితం కరోనాతో వస్త్ర పరిశ్రమ మరింత దెబ్బతింది. ఉత్పత్తులు నిలిచిపోయాయి. చేనేత పరిశ్రమ మొత్తం స్తంభించిపోయింది. కార్మికులకు పని తగ్గింది. ఫలితంగా రాష్ట్రంలో 43 వేలకుపైగా ఉన్న చేనేత మగ్గాల సంఖ్య ప్రస్తుతం 20 వేలకు పరిమితమైంది. మిల్లులు, మరమగ్గాలు మాత్రం కొంత మేరకు తట్టుకుని కొనసాగాయి.

మరోసారి జీఎస్టీ బాదుడు
తాజాగా కేంద్రం చేనేత, జౌళి ఉత్పత్తులపై జీఎస్టీని అయిదు శాతం నుంచి 12 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ ప్రభావం చేనేత పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీస్తాయని ఆ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ”ప్రస్తుతం ఒక కాటన్‌ చీరకు అవసరమైన ముడిసరుకుల పెట్టుబడి రూ.800 అవుతోంది. దాన్ని రూ.500కి మించి కొనడానికి మాస్టర్‌ వీవర్లు ముందుకు రావడం లేదు. అదే సమయంలో మిల్లులో తయారయ్యే చీరలు రూ.100 నుంచి దుకాణాల్లో అందుబాటులో ఉంటున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలు వాటినే కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని రకాల్లో ఒక్కో పట్టు చీర తయారీకి రూ.7,000 మేరకు పెట్టుబడి అవుతోంది. ధనికులు, ఎగువ మధ్యతరగతి వారే ఆ ధరకు కొంటున్నారు. ఫలితంగా ఉత్పత్తి చేసినవి మగ్గాల వద్దనే ఆగిపోతున్నాయి. జీఎస్టీ మరో ఏడుశాతం పెరిగితే పెట్టుబడులూ పెరుగుతాయి. ఆ ధరకు చీరలు ఎవరు కొంటారని” గద్వాల సహకార సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.

టెస్కో మనుగడ కష్టమే
రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రభుత్వ సహకార సంస్థ (టెస్కో) పెద్దదిక్కుగా ఉంది. కార్మికుల నుంచి ఉత్పత్తులు తీసుకునే సహకార సంఘాలు వాటిని టెస్కోకే విక్రయిస్తున్నాయి. టెస్కో వాటిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 దుకాణాల ద్వారా వినియోగదారులకు విక్రయిస్తోంది. జీఎస్టీ అమల్లోకి రాకముందు ఈ సంస్థ యేటా రూ.500 కోట్ల వస్త్రాలను విక్రయించేది. వచ్చిన తర్వాత కేవలం రూ.350 కోట్ల విక్రయాలే జరుగుతున్నాయి. ‘జీఎస్టీ మళ్లీ పెరిగితే వస్త్రాల ధరలు పెరిగి విక్రయాలు సగానికి పడిపోయే ప్రమాదం ఉందని’ ఓ ఉన్నతాధికారి తెలిపారు.

వినియోగదారులపైనా భారమే
జీఎస్టీ పెంపుతో వస్రాల్త ధరలు గణనీయంగా పెరగనున్నాయి. ఈ భారం వినియోగదారులపై పడుతుందని, అంతిమంగా ఇది వస్త్ర వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరలు పెరిగితే అమ్మకాలు తగ్గుతాయని అమీర్‌పేటలోని ఒక ప్రధాన వస్త్రాలయ అధినేత తెలిపారు. ‘ధర తక్కువగా ఉన్నప్పుడు వినియోగదారులు అవసరానికి మించి కొంటారు. ఇకపై అత్యవసరమయితేనే కొనుగోళ్లకు ముందుకొస్తారని’ ఆయన వెల్లడించారు.

పెట్టుబడులపైనా ప్రభావం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత చేనేతకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిచ్చింది. పారిశ్రామిక విధానంలో భాగంగా జౌళి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో దేశ విదేశాల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో 57 జౌళి పరిశ్రమలు వచ్చాయి. వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద జౌళి పార్కును ప్రారంభించింది. సిరిసిల్లలో భారీ మర మగ్గాల పార్కు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జీఎస్టీ పెంపు వల్ల పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రావనే ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీ రామారావు జీఎస్టీ పెంపుదల వల్ల కలిగే దుష్పరిణామాలపై ఇప్పటికే కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌కు లేఖ రాశారు. స్పందన లేకపోవడంతో ఈ నెలాఖరులో జీఎస్టీ పెంపుదలను నిరసిస్తూ వస్త్ర, వ్యాపార రంగాల ప్రతినిధులు మూడురోజుల ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

పెంపు నిర్ణయం దారుణం
చేనేత వృత్తిపరమైంది. నైపుణ్యం, కళతో కూడుకున్నది. కేంద్రం దాన్ని వ్యాపార పరిశ్రమగా చూడడం బాధాకరం. జీఎస్టీ పెరిగితే ఉత్పత్తి, విక్రయాలు పడిపోతాయి. కార్మికులకు పని దొరకదు. సహకార సంఘాలన్నీ మూతపడతాయి. కేంద్ర నిర్ణయం చేనేత రంగానికి మరణశాసనమే అవుతుంది. మున్ముందు కోలుకుంటుందనే నమ్మకమూ పోతోంది. ఈ రంగంపై జీఎస్టీని పూర్తిగా తొలగిస్తేనే చేనేతకు మనుగడ.
– మండల శ్రీరాములు, ఆప్కో మాజీ అధ్యక్షుడు

కేంద్ర ప్రోత్సాహం కరవు
ఇప్పటివరకు కార్మికుల కష్టాలను చూసి చీరలు, ఇతర వస్త్రాలను కొనుగోలు చేస్తున్నాం. విక్రయాల్లో బేరసారాలు తప్పడం లేదు. పెద్దగా లాభాలూ లేవు. చేనేతను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా, కేంద్రం వెనక్కి లాగుతోంది.
– గజం మురళి, పోచంపల్లి మాస్టర్‌ వీవర్‌

వస్త్ర పరిశ్రమ నిలదొక్కుకోవడం కష్టమే
వస్త్ర పరిశ్రమకు ఇది కష్టకాలం. అనేక సమస్యలతో ఈ రంగం కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా కుంగదీసింది. ఇప్పుడు ఒమిక్రాన్‌ పంజా విసురుతోంది. ఈ తరుణంలోనే మళ్లీ కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఇది వస్త్ర పరిశ్రమ, కార్మికులకు శరాఘాతమే.
– ఎం.సత్యం, రాజన్న సిరిసిల్ల పాలియెస్టర్‌ వస్త్ర వ్యాపారుల సంఘం

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరిట కేంద్రం చేనేత పరిశ్రమకు చేసిందేమీ లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జీఎస్టీ పెంపు సరైన నిర్ణయం కాదు. ఇకనైనా కేంద్రం ధోరణి మారాలి. చేనేత, జౌళి రంగాలకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి.
– బోడ శ్రీనివాస్‌, దుబ్బాక సొసైటీ మాజీ ఛైర్మన్‌

Courtesy Eenadu

Leave a Reply