13.6 కోట్ల ఉద్యోగాలకు ముప్పు!

0
237

అసంఘటిత రంగం విలవిల
కొత్త ఉద్యోగాల ఊసే ఉండదు
పాదరక్షల నుంచి పర్యాటకం వరకూ కుదేలు

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ అనేక రంగాల్లో సునామీ సృష్టించనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదరక్షల నుంచి పర్యాటకం వరకూ అన్ని రంగాల్లో కోట్లాది ఉద్యోగాలు ప్రమాదంలో పడొచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికులు, ఉద్యోగులు భారీగా రోడ్డున పడనున్నారని మింట్‌ ఓ కథనంలో వెల్లడించింది. కేవలం పర్యాటక, హాస్పిటాలిటీ రంగంలో 2 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని పారిశ్రామికవేత్తల సంఘం సీఐఐ పేర్కొంది. ఈ రంగం పుంజుకోవాలంటే 2020 అక్టోబర్‌ వరకు సమయం పట్టొచ్చని అంచనా వేసింది.

ముఖ్యంగా పర్యాటక రంగంలో పని చేసే వారికి రెగ్యులర్‌ వేతనం అంటూ ఉండదు. రోజు వచ్చే ప్రయాణికులు, పర్యాటకులపై వీరు ఆధారపడి బతుకుతుంటారు. అదే విధంగా పార్కింగ్‌, షాపుల్లో పని చేసే వారు, రెస్టారెంట్‌లో వెయిటర్స్‌, కూరగాయల సరఫరాదారులు, హోటళ్లకు మాంసం, పూలు సరఫరా చేసే తదితరుల బతుకులు ప్రమాదంలో పడ్డాయి. ఇలాగే అనేక సర్వీసులు, తయారీ, తయారేతర, నిర్మాణ రంగాల్లో పని చేసే వారి పరిస్థితి క్లిష్టంగా మారనుంది. వృద్ధి మందగించడం, డిమాండ్‌ పడిపోవడం వల్ల కొత్త ఉద్యోగాల కల్పన లేకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎన్‌ఎస్‌ఎస్‌, పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వేస్‌ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) డాటా ప్రకారం స్థూలంగా విశ్లేషిస్తే వ్యవసాయేతర రంగాల్లోని 13.6 కోట్ల ఉద్యోగాలు ఇప్పటికిప్పుడు ప్రమాదంలో పడ్డాయిని అంచనా. కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే వీళ్ల ఉపాధికి ఎలాంటి భద్రతా లేదు. మరోవైపు ఏడాది కంటే తక్కువ కాలానికి గాను తాత్కాలికంగా పనికి కుదుర్చుకున్న సిబ్బందికి ఆయా పరిశ్రమలు, ఎజెన్సీలు పింక్‌ స్లిప్‌లు జారీ చేయనున్నాయి. దేశంలో ఇలాంటి పనులు చేస్తున్న వారు 50 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. సాధారణంగా దేశ జనాభాకు అనుగుణంగా ప్రతీ ఏడాది కొత్తగా కోటి మందికి ఉపాధి కల్పించాలి. వీళ్లంత నిరుద్యోగులుగానే కొనసాగే ప్రమాదం ఉంది. మోడీ ప్రభుత్వ విధానాలతో ఇప్పటికే దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. కరోనా మరింత ప్రమాదం పెంచనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాహన పరిశ్రమలో 10 లక్షల మంది..
టెక్స్‌టైల్‌, కాపిటల్‌ గూడ్స్‌, సిమెంట్‌, అహారోత్పత్తులు, లోహ, ప్లాస్టిక్‌, రబ్బర్‌, ఎలక్ట్రానిక్స్‌ తదితర తయారీ రంగాల్లో పని చేస్తోన్న 90 లక్షల ఉద్యోగాలు పోవచ్చని మానవ వనరులను సమకూర్చే అడెక్కో గ్రూప్‌ ఇండియా అంచనా వేసింది. మాంద్యంతో అమ్మకాలు పడిపోవడంతో గత త్రైమాసికంలోనే అనేక కంపెనీలు సిబ్బందికి ఉద్వాసన పలికాయని పేర్కొంది. కరోనాతో ఈ సంఖ్య మరింత పెరుగొచ్చని అంచనా వేసింది. వాహన పరిశ్రమలో 10 లక్షల ఉద్యోగాలు పోవచ్చని పేర్కొంది. విమానయాన రంగంలో క్షేత్ర స్థాయి నుంచి పైవరకు 6 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని విశ్లేషించింది.

సామాజిక రక్షణ నిల్‌
భారత్‌లో 2017-18 నాటికి మొత్తంగా 49.5 కోట్ల కార్మికులు ఉన్నారని జెఎన్‌యు ప్రొఫెసర్‌, ఎకనామిస్టు సంతోష్‌ మెహ్రోత్రా అన్నారు. 3 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు. ప్రస్తుతమున్న ఉద్యోగాలకు పెద్ద భద్రత లేదన్నారు. వారికి ఎలాంటి సామాజిక రక్షణ లేదన్నారు. వాళ్లు ఒక విధంగా అసంఘటిత వర్కర్లని అన్నారు. 2.8 కోట్ల మంది ఎలాంటి హామీ లేని తయారీ రంగంలో పని చేస్తున్నారన్నారు. మరో 4.9 కోట్ల మంది తయారేతర రంగంలో ఉండగా.. 5.9 కోట్ల మంది సర్వీసు రంగంలో పని చేస్తున్నారు. ఈ వ్యవసాయేతర రంగాల్లో స్థూలంగా 13.6 కోట్ల మందికి ఎలాంటి భద్రత లేదన్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply