రాష్ట్రంలో జ్వరపీడితులు 13 లక్షలు

0
189
  • జ్వరం సర్వేలో వెలుగుచూసిన కేసులు
  • ఆరువారాల్లో 1.62 లక్షల మందికి జ్వరాలు
  • హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధికం
  • బోధన, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అనేక కేసులు
  • డెంగీ కేసులు 5 వేలు నమోదు

హైదరాబాద్‌: ఊరూ, వాడా అనే తేడా లేకుం డా జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏ ఇంట చూసినా ఒక్కరన్నా ఏదోరకమైన జ్వరంతో మంచంపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జ్వర లక్షణాలున్నవారు లక్షల్లో ఉన్నారు. రోజురోజుకూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరాలపై వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న సర్వేలో అనేక కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో గతనెల నుంచి ఇప్పటివరకు అంటే ఆరువారాల్లో 1.62 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు సర్వేలో నిర్ధారణ అయింది.

ఇవిగాక జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులకు వచ్చేవారిని కలుపుకుంటే 2 లక్షల జ్వరం కేసులు ఉండొచ్చని అంచనా. అత్యధి కంగా హైదరాబాద్‌లో 42 వేలు, రంగారెడ్డి జిల్లాలో 24 వేల మంది జ్వరాల బారినపడినట్లు అంచనా. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏకంగా 13 లక్షల మంది జ్వరం బారిన పడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో కరోనాతో జ్వరాలు నమోదు కాగా, జూలై నుంచి అటు కరోనా, ఇటు వైరల్‌ జ్వరాలు నమోదవుతున్నాయని వైద్యవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కరోనా, డెంగీ, చికున్‌గున్యా, టైఫాయిడ్, మలేరియా కేసులు నమోదవుతున్నాయి.

ఐదు వేల డెంగీ కేసులు…?
రాష్ట్రంలో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నా యి. ఈ ఏడాది నమోదైన డెంగీ కేసుల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ల్లోనే అత్యధికం. 2020లో 2,173 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 8నాటికి 4,714 కేసులు న్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆ తర్వాత నమోదైన వాటిని కలుపుకుంటే దాదాపు ఐదువేల డెంగీ కేసులు ఉంటాయని అంచనా.

అత్యధికంగా హైదరాబాద్‌లో 1,188 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 8 వరకు 632 మలే రియా కేసులు నమోదయ్యాయి. 2019లో 1,168… 2020లో 664 నమోదయ్యాయి. బయటకు రానివి ఇంతకుమించి ఉంటాయని వైద్యనిపుణులు అంటు న్నారు. మరోవైపు పలు ఆసుపత్రులు డెంగీ బాధి తులను ఫీజుల రూపేణా పీల్చి పిప్పిచేస్తున్నాయి.

ఇవీ కారణాలు…
రాష్ట్రంలో పలు చోట్ల పారిశుధ్య నిర్వహణ సరిగా లేక దోమలు విజృంభిస్తున్నాయి. పగటిపూట కుట్టే దోమలతో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. మలేరియా కేసులూ వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లోనూ దోమలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెలంతా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. డెంగీ, మలేరియా కేసులు మరింతగా నమోదయ్యే అవకాశాలున్నాయి.

నిర్లక్ష్యం తగదు..
ప్రస్తుతం గొంతునొప్పి, జ్వరంతో అనేకమంది ఆసుపత్రులకు వస్తున్నారు. గతంలో డెంగీ, కరోనా కేసులు అధికంగా రాగా, ఇప్పుడు డెంగీ కేసులే ఎక్కువ ఉంటున్నాయి. డెంగీకి, కరోనా లక్షణాలకు మధ్య తేడాను గుర్తించవచ్చు. డెంగీలో 102–103 జ్వరం కూడా ఉంటుంది.

పారాసిటమాల్‌ మాత్ర వేసినా అది తగ్గదు. కరోనాలో మాత్ర వేశాక తగ్గుముఖం పడుతుంది. 50 వేల వరకు ప్లేట్‌లెట్లు తగ్గినప్పుడు మాత్రం ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. అప్పుడు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి.

Courtesy Sakshi

Leave a Reply