నెల్లూరులో అత్యధికంగా 30.. అత్యల్పంగా అనంతలో 3
అమరావతి : రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం మినహా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 11 జిల్లాల్లో 133 ప్రాంతాలను ప్రభుత్వం ‘రెడ్‌జోన్లు’గా గుర్తించింది. వీటిలో అత్యధికంగా నెల్లూరులో 30 ఉండగా, ఆ తర్వాత కర్నూలులో 22, కృష్ణాలో 16 ప్రాంతాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో అతి తక్కువగా 3మాత్రమే ఉన్నాయి. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించడం ద్వారా రెడ్‌అలెర్ట్ ప్రకటించి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.
ఈ క్లస్టర్ల వద్ద కరోనా వ్యాప్తి నివారణ, ప్రజారోగ్య చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి క్వారంటైన్, భౌతిక దూరం పాటించడం, మెరుగైన నిఘా, అనుమానాస్పద కేసులన్నింటినీ పరీక్షించడం, కాంటాక్ట్స్ అందర్నీ ఐసొలేషన్‌లో పెట్టడం, కమ్యూనిటీ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. కరోనా కేసులున్న ప్రాంతం నుంచి 3కి.మీ. పరిధిలో ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ క్లస్టర్‌గా తీసుకుంటున్నారు. కేసుల వ్యాప్తికి వీలున్న 5కి.మీ. ప్రాంతం బఫర్‌జోన్‌గా గుర్తిస్తున్నారు. గ్రామాల్లో బఫర్ జోన్లను 7కి.మీ. వరకూ విస్తరిస్తారు. కంటైన్మెంట్ జోన్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద థర్మల్ స్ర్కీనింగ్ చేస్తారు. వాహనాల కదలికను నిషేధించారు.
Courtesy Andhrajyothi