- కేసులు పెరుగుతున్నా దర్శనాలు ఆపడం లేదు
- రమణ దీక్షితులు విమర్శలు.. సీఎంకు ఫిర్యాదు
- ఆ వ్యాఖ్యలు సరికాదు.. దర్శనాలు ఆపం: వైవీ
- యాత్రికులతో సమస్య లేదు: ప్రధానార్చకుడు
తిరుమల : తిరుమలలో కరోనాపై రచ్చ మొదలైంది. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణదీక్షితులు మరోసారి ట్విటర్ వేదికగా అధికారులపై విమర్శలు గుప్పించారు. టీటీడీలో కరోనా కేసులు పెరిగిపోతున్నా దర్శనాలు రద్దు చేయడం లేదని సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. ‘టీటీడీలోని 50మంది అర్చకుల్లో 15మందికి పాజిటివ్ వచ్చింది. మరో 25మంది ఫలితాలు రావాల్సి ఉంది. అయినా దర్శనాల నిలిపివేతపై ఈవో, అదనపు ఈవో నిర్ణయం తీసుకోలేదు. గతంలో చంద్రబాబు, టీడీపీ అనుసరించిన మిరాశీ అర్చక, బ్రాహ్మణ వ్యతిరేక విధానాలనే ఇప్పుడూ టీటీడీ అనుసరిస్తోంది. ఇలాగే కొనసాగిస్తే టీటీడీలో ఉపద్రవం వస్తుంది, దయచేసి చర్యలు తీసుకోండి’ అని పేర్కొంటూ సీఎం జగన్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ నెల 11న కూడా టీటీడీ అధికారులపై రమణదీక్షితులు ట్విట్టర్‌లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, అర్చకుల ఆరోగ్యం విషయానికి రాజకీయ రంగు పులమొద్దని, టీటీడీ అధికారులను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రమణ దీక్షితుల ట్వీట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్చకుల ఆరోగ్య భద్రతపై గురువారం దాదాపు గంటసేపు చర్చించామన్నారు. అర్చకులకు ఇబ్బందికరమైన పరిస్థితి రాకూడదనేది తమ ఉద్దేశమని, అవసరమైతే భక్తుల దర్శనాలను ఆపేందుకు కూడా సిద్ధంగానే ఉన్నామన్నారు. ఏవైనా సలహాలుంటే బోర్డు దృష్టికి తీసుకురావాలే తప్ప మీడియా ద్వారా కామెంట్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
టీటీడీలో 140మందికి కరోనా
శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభించిన తర్వాత టీటీడీలో 140మంది సిబ్బందికి కరోనా సోకినట్టు వైవీ తెలిపారు. అందులో 60మంది ఏపీఎస్పీ సిబ్బందితో పాటు 16మంది పోటు కార్మికులు, మరో 14మంది అర్చకులు, ఇతర ఉద్యోగులు ఉన్నారన్నారు. ఇప్పటికే 70మంది కోలుకున్నారని, వీరిలో కొందరు హోం క్వారంటైన్‌లో ఉండగా, మరికొందరు తిరిగి విధులకు హాజరవుతున్నారని వివరించారు. మరో 70మంది ఆస్పత్రిలో కోలుకుంటున్నారన్నారు. స్విమ్స్ ఐసీయూలో ఉన్న ఒక్క ఉద్యోగికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఆయన త్వరలోనే కోలుకుంటాడని వైద్యులు చెప్పారన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, అధికారులు, అర్చకులతో సమావేశమయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులెవ్వరికి కరోనా సోకలేదని, అలాగే వారిద్వారా ఉద్యోగులకు రాలేదన్నారు. కుటుంబసభ్యులు, ప్రయాణాలు, వారు నివసించే ప్రాంతాల ద్వారానే సిబ్బంది వైరస్ బారినపడినట్టు తెలిపారు. ఇకపై కూడా శ్రీవారి దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. 14మంది అర్చకులకు పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ప్రధాన అర్చకులతో సమావేశమైనట్టు తెలిపారు. వేర్వేరు గదుల కేటాయింపుతో పాటు ప్రత్యేక భోజన సదుపాయం కల్పించాలని అర్చకులు కోరారన్నారు. వయసు మళ్లినవారు ఇంట్లో ఉండేందుకు లేదా తిరుపతి ఆలయాల్లో పనిచేయడానికి అనుమతి ఇవ్వాలని అడిగారన్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
అర్చకులు కైంకర్యాలకే పరిమితం
తిరుమలకు వస్తున్న యాత్రికుల ద్వారా తమకు ఎలాంటి సమస్య లేదని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. అర్చకుల శ్రేయస్సే తమకు ముఖ్యమని, అయితే దర్శనానికి వచ్చే భక్తులతో తాము నేరుగా కలిసే సందర్భాలు ఎక్కడా లేవన్నారు. గర్భాలయంలో విధులు నిర్వహిచే తమకు భక్తుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులకు చెప్పామన్నారు. తీర్థం, శఠారీ కూడా రద్దు చేసినందున కేవలం కైంకర్యాలకే పరిమితం అవుతున్నామన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమంది అర్చకులకు కరోనా సోకిందని, మరిన్ని జాగ్రత్తలు తీసుకునే విషయమై అధికారులతో చర్చించామన్నారు. వయసు పైబడిన, ఆరోగ్య సమస్యలున్న అర్చకులు విధుల నుంచి తాత్కాలిక విశ్రాంతి కోరుకుంటే అనుమతి ఇచ్చేందుకు పాలక మండలి అంగీకరించిందన్నారు.
Courtesy Andhrajyothi