- లద్దాఖ్‌లో సైనికుడికి తండ్రి నుంచి సోకిన వైరస్..
- ఢిల్లీలో అనుమానితుడి ఆత్మహత్య
న్యూఢిల్లీ : దేశంలో కరోనా బాధితుల సంఖ్య 160కి చేరింది. బుధవారం కొత్తగా వివిధ రాష్ట్రాల్లో 13 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో ఒకే రోజు కొత్తగా ఎనిమిది కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అటు ఏపీ, తమిళనాడులో చెరో పాజిటివ్ కేసు నమోదయ్యాయి. లఖ్‌నవులో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యుడికీ వైరస్ సోకింది. కర్ణాటకలో కొత్తగా మూడు కేసులు నమోదై.. బాధితుల సంఖ్య 14కు పెరిగింది. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 10కి చేరగా.. యూపీలో 16 కేసులు నమోదయ్యాయి. హరియాణాలో వైరస్ సోకిన 17 మందిలో 14 మంది విదేశీయులు. వారితో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 25 మంది విదేశీయులకు వైరస్ పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్రలో 42 మంది.. కేరళలో 27 మంది వైరస్ బారిన పడ్డారు. లద్దాఖ్‌లోనూ బాధితుల సంఖ్య 8కి పెరగ్గా.. అందులో ఒకరు 34 ఏళ్ల జవాను కావడం గమనార్హం. లద్దాఖ్ స్కౌట్ రెజిమెంట్‌లో ఒక సైనికుడికి మన సైనికుల్లో ఒకరికి వైరస్ సోకిన విషయాన్ని ఆర్మీ ధ్రువీకరించింది. జవాన్‌కు ఈ వైరస్ ఆయన తండ్రి నుంచి సోకింది. గత నెలలో ఇరాన్‌లోకి ఖోమ్ క్షేత్రానికి యాత్రకు వెళ్లినప్పుడు ఆయన వైరస్ బారిన పడ్డారు. జవాన్ సోదరుడికి కూడా ఆయన నుంచి వైరస్ సోకినట్టు సమాచారం. సైన్యంలో ఒకరికి కరోనా సోకడంతో ఆర్మీ అప్రమత్తమైంది. సెలవులో వెళ్లి తిరిగొచ్చిన జవాన్లందరికీ పరీక్షలు నిర్వహిస్తోంది. కొంతమందిని క్వారంటైన్‌లో ఉంచుతోంది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని సైనికులకు సూచిస్తోంది. సీఆర్పీఎఫ్, బీఎ్‌సఎఫ్, సీఐఎ్‌సఎష్, ఐటీబీపీ, ఎస్‌ఎ్‌సబీ విభాగాలతో కూడిన కేంద్ర సాయుధ పోలీసు దళం కూడా.. అనవసర సెలవులు పెట్టొదని, యుద్ధ సన్నద్ధతతో పనిచేయాలని తన సిబ్బందికి సూచించింది. అత్యవసరం కాని సెలవులను రద్దు చేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ కూడా భారీ సమావేశాలను, అతిథి ఉపన్యాసాలు, ఎడ్యుకేషనల్ టూర్స్ వంటివాటిని రద్దు చేసింది. కాగా.. గోవాలో ఒక నార్వేవాసికి వైరస్ పాజిటివ్ వచ్చిందని ఆ రాష్ట్ర మంత్రి స్వయంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. కాగా, ఢిల్లీలో కొవిడ్-19 అనుమానిత లక్షణాలతో విమానాశ్రయం నుంచి సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించిన వ్యక్తి (35).. ఆస్పత్రి ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అతడి నమూనాలు వైద్యపరీక్షలకు పంపామని, వైద్యులు తెలిపారు. పంజాబ్‌కు చెందిన ఆ వ్యక్తి ఏడాదిగా సిడ్నీలో ఉంటున్నట్టు తెలిసింది.
స్విస్ ల్యాబ్‌కు..
దేశంలోని గుర్తింపు పొందిన ప్రైవేటు ల్యాబ్‌లకు కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. స్విట్జర్లాండ్‌కు చెందిన ‘రోచె డయాగ్నొస్టిక్స్ ఇండియా’ తొలిగా ఆ అనుమతి దక్కించుకుంది. మనదేశానికి చెందిన ట్రివిట్రాన్ హెల్త్‌కేర్, మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ కూడా అనుమతి కోరుతూ దరఖాస్తు డీసీజీఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)ను సంప్రదించినట్టు అధికారులు తెలిపారు. కాగా, కరోనా కట్టడికి నిర్ణయాత్మకంగా వ్యవహరించడంలో మోదీ సర్కారు విఫలమవుతోందని.. ఫలితంగా భారత్ భారీ మూల్యం చెల్లించుకోబోతోందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇక.. కరోనా నేపథ్యంలో రానున్న నెలరోజులపాటు ఎలాంటి నిరసన కార్యక్రమాలూ చేపట్టకూడదని బీజేపీ నిర్ణయించింది. మరోవైపు.. దేశంలో మాస్కులు, హ్యాండ్ శానిటైజర్ల బ్లాక్‌మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారంటూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌పై బిహార్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తమన్నా హష్మి అనే సామాజిక కార్యకర్త ఈ పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 30న ఇది విచారణకు రానుంది.
ప్రముఖుల స్వచ్ఛంద క్వారంటైన్!
ఇటీవలే సౌదీ అరేబియాలో పర్యటించి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు.. తన ఇంట్లోనే 14 రోజులపాటు స్వచ్ఛంద క్వారంటైన్‌లో ఉంటున్నట్టు ప్రకటించారు. వైద్యపరీక్షల్లో ఆయనకు వైరస్ నెగెటివ్‌గా వచ్చినా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ బిగ్-బి అమితాబ్ బచ్చన్ కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తన చేతిపై ఆ స్టాంపు ముద్రించుకుని ఆ ఫొటోను ట్వీట్ చేశారు.
గ్రాండ్ ప్రిన్సెస్ నౌకలో మనోళ్లకు సాయం
అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో ఉన్న గ్రాండ్ ప్రిన్సెస్ నౌకలో ఉన్న భారతీయులతో.. అక్కడి భారతీయ రాయబార కార్యాలయం టచ్‌లో ఉంది. వారికి కావాల్సిన సాయం అందిస్తోంది. ఆ నౌకలోని 2500 మంది ప్రయాణికుల్లో 21 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది.