-రూ. 17,500 దాటని జీతం
– సీఎం, మంత్రులకు మొరపెట్టుకున్నా పట్టించుకోని వైనం
– కరోనా రోగులకు సేవలందించడంలోనూ వారే కీలకం
– అయినా వారిపై వివక్షే
– కొత్త వారితో సమానంగా వేతనాలకు డిమాండ్
హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. నర్సింగ్ వృత్తిలో వాళ్లది 13 ఏండ్ల సర్వీసు. అదీ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలోనే. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడ తాయనుకున్నారు.. పర్మినెంట్ అవుతామని భావించారు. ప్చ్..! ఏం ప్రయోజనం. ఆందోళనలు చేసినా.. సీఎంకి లేఖరాసినా.. ఆరోగ్యమంత్రిని కలిసి మొరపెట్టుకున్నా… అయ్యో! అవునా..కచ్చితంగా న్యాయం చేస్తామనోళ్లేగానీ.. ఏ ఒక్కరూ దృష్టిపెట్టలేదు. కరోనా కష్టకాలంలో గాంధీలో రోగులకు సేవలందించడంలో వారీది కీలక భూమిక. మనిషిని ముట్టుకుంటే ఎక్కడ వైరస్ అంటుకుంటుందో అన్న భయంతో పక్కకు జరుగుతున్న సమయంలోనూ… రోగులకు దగ్గరుండి సేవలందిస్తున్నారు. కొందరు నర్సులైతే అన్నం కూడా తినిపిస్తున్నారు. ఇంత చేసినా.. ఆ నర్సులపై సర్కారుకు జాలి కలగలేదు. కనికరం అంతకన్నా లేదు. ఇటీవల కొత్తగా నియమించిన వారికి రూ. 25 వేల వేతనం, ఐదేండ్ల అనుభవం ఉన్నవారికి హెడ్‌నర్స్ హౌదా ఇచ్చింది. పాత వారిని కొత్తవారి కింద పనిచేసే పరిస్థితిని కల్పించింది. ఇక ఈ అన్యాయాన్ని భరించలేం…తమకూ కొత్తవారితో సమానంగా రూ. 25 వేల వేతనం ఇవ్వాలని ఆందోళన బాట పట్టారు. శుక్రవారం రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ ఎదుట ఆందోళన చేసిన ఆ నర్సులు… శనివారం కూడా విధులను బహిష్కరించనున్నట్టు ప్రకటించారు.
గాంధీ ఆస్పత్రిలో 220 మంది నర్సులు 2007 నుంచి ఔట్ సోర్సింగ్ పద్ధతి ప్రాతిపదికన సేవలు అందిస్తున్నారు. 13 ఏండ్లుగా సేవలందిస్తుంటే వారికి దక్కుతున్న వేతనం రూ. 17,500 మాత్రమే. పీఆర్సీ గైడ్‌లైన్స్ ప్రకారం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ వేతనమైనా ఇవ్వాలని నిబంధన ఉంది. అది ఎక్కడా అమలు కావడం లేదు. గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ నర్సులు జీతాలు పెంచాలని కొన్నేండ్లుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రూ.25 వేల నెల జీతంతో కొత్తగా 2 వేల మంది స్టాఫ్ నర్సులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలోనే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అందులో గాంధీ ఆస్పత్రికి 180 మందిని కేటాయించింది. ఇప్పటికే దశాబ్ద కాలంగా అక్కడ పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మాత్రం అదే రూ.17,500 జీతం కొనసాగిస్తున్నారు. జీతం తక్కువ, పొరుగుసేవల సిబ్బంది అని రెగ్యులర్ నర్సుల కన్నా రాష్ట్ర ప్రభుత్వం వారితో తక్కువేం పని చేయించుకోవట్లేదు. అందరితోపాటు సమానంగా పని చేయాల్సిందే. చివరకు కరోనా రోగులకు చికిత్స అందించే విషయంలోనూ అంతే. పేరుకేమో అత్యసవర విభాగంలో సేవలు. జీతం మాత్రం అత్తెసరు. రెగ్యులర్ చేయాలనీ లేదంటే కనీసం కాంట్రాక్టు నర్సులుగా గుర్తించాలని ఔట్ సోర్సింగ్ నర్సులు కోరుతున్నారు. తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
గాంధీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న నర్సులకు కనీస వేతనం కూడా ఇవ్వటం లేదు.
కొత్తవారికి ఇచ్చినట్టే వీరికీ వేతనమివ్వాలి. గాంధీ ఔట్‌సోర్సింగ్ నర్సుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర
ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు. 13 ఏండ్ల అనుభవం ఉంది కాబట్టి పాతవారిని పర్మినెంట్ చేయాలి. లేనిపక్షంలో సమ్మెలోకి వెళ్లటానికి కూడా వెనకాడం. అరెస్టు చేసిన నర్సులను వెంటనే విడుదల చేయాలి. ధర్నా చేస్తున్నారు కాబట్టి అరెస్టు చేస్తామనడం సరిగాదు. వారి న్యాయబద్ధ డిమాండ్ల విషయంలో మంత్రి ఈటల రాజేందర్ చొరవ తీసుకుని పరిష్కరించాలి.
నర్సింహ్మ, తెలంగాణ మెడికల్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు
నిమ్స్‌లోనూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన బాట
నిమ్స్ ఆస్పత్రిలో 400 మంది కాంట్రాక్టు నర్సులున్నారు. ట్రైనీలు మరో 170 మంది ఉన్నారు. టెక్నికల్, నాన్‌టెక్నికల్ విభాగాల్లో 350 మంది, మరో 300 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నారు. వీరిలో ఎవ్వరికీ రూ. 18 వేలకు మించి వేతనం లేదు. వీరందరూ జేఏసీగా ఏర్పడి జీతాల పెంపు కోసం ఆందోళన బాట పట్టారు. నిమ్స్ డైరెక్టర్ మనోహర్ వారితో చర్చలు జరిపారు. ఈ నెల నుంచి వేతనం పెంచుతామని హామీనిచ్చారు. అయితే, తమకు రాతపూర్వక హామీ ఇస్తేనే విధుల్లోకి వస్తామనీ, లేనిపక్షంలో ఈ నెల 13 నుంచి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.
Courtesy Nava Telangana