ఏపీలో కరోనా కిస్తుకూ ఆటంకాలే

0
257

అమరావతి : కరోనా లాక్‌డౌన్‌తో నష్టపోయిన రైతులకు ఆర్థిక ఉపశమనం కల్పించేందుకంటూ కేంద్రం ప్రకటించిన పిఎం-కిసాన్‌ అడ్వాన్స్‌ కిస్తు వివిధ కారణాల వలన రాష్ట్రం నుంచి ఎంపికైన లబ్ధిదారుల్లో దాదాపు 18 లక్షల మందికి అందలేదు. తమ అకౌంట్లలో సొమ్ము పడక పోవడానికి స్పష్టమైన కారణాలేంటో తెలీక లక్షలాది మంది రైతులు మదన పడుతున్నారు. సర్కారు ఇచ్చే స్వల్ప మొత్తమైనా లాక్‌డౌన్‌ సమయంలో కొంతైనా ఆసరా అవుతుందన్న ఆశతో బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ వారికి సరైన సమాధానం చెప్పే నాధుడే లేడు.

నెల దాటుతోంది
మార్చి నాల్గవ వారంలో తొలి దశ లాక్‌డౌన్‌ విధించగానే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీలో పిఎం-కిసాన్‌ సైతం ఉంది. రైతులకు కొత్తగా రూపాయి ఇవ్వకపోయినా, పిఎం-కిసాన్‌లో రాబోయే నాలుగు మాసాల్లో చెల్లించాల్సిన రూ.రెండు వేల వాయిదాను ఏప్రిల్‌ మొదటి వారంలో ఇస్తామన్నారు. ప్రతి నాలుగు నెలలకూ రూ.2 వేలు వంతున రైతులకు పెట్టుబడి సాయం చేసే పథకం పిఎం-కిసాన్‌. కేంద్రం 2018 డిసెంబర్‌ నుంచి ప్రారంభించింది. నాల్గవ కిస్తు ఏప్రిల్‌, మే, జూన్‌, జులై మాసాల్లో (స్కీంకు అర్హత సాధించిన తేదీ ప్రకారం) కేంద్రం పేమెంట్‌ చేయాలి. కరోనా లాక్‌డౌన్‌ వలన నాలుగు నెలలకు బదులుగా ఏప్రిల్‌ మొదటి వారంలోనే లబ్ధిదారులందరికీ రూ.2 వేలు ముందస్తుగా ఇస్తామంది. కానీ మే వచ్చినా రాష్ట్రంలోని లబ్ధిదారులందరి బ్యాంక్‌ అకౌంట్లలో కేంద్రం నుంచి సొమ్ము పడలేదు. పిఎం-కిసాన్‌ మార్గదర్శకాల ప్రకారం ఎపిలో 57.13 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా ఏప్రిల్‌ ఆఖరు నాటికి 39.13 లక్షల మంది ఖాతాల్లోనే రూ.2 వేలు పడ్డాయని సమాచారం. సుమారు 18 లక్షల మందికి సొమ్ము జమ కాలేదు. పిఎం-కిసాన్‌కు లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత రాష్ట్రాలదే. ఎపి నుంచి పంపించిన వివరాల్లో సాంకేతిక సమస్యల మూలంగా సుమారు 11.31 లక్షల బ్యాంక్‌ అకౌంట్ల జాడ లేదు. ఆధార్‌, ఫోన్‌నెంబర్‌, భూమి పత్రాల అనుసంధానంలో తేడాల వలన ఆన్‌లైన్‌లో డేటా ట్రేస్‌ కావట్లేదు. దశలవారీగా కొన్ని మాసాల్లో టెక్నికల్‌ సమస్యలు తలెత్తిన అకౌంట్లలో ఏడు లక్షల అకౌంట్ల డేటాను ఎప్పటికప్పుడు సరి చేశామని అధికారులు చెబుతున్నా సొమ్ము మాత్రం జమ కావట్లేదు. సాంకేతిక సమస్యలు తలెత్తిన అకౌంట్లను పక్కనపెట్టినా, మరో ఏడు లక్షల మంది అకౌంట్లలో రూ.2 వేలు జమ కాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

భరోసాకూ ఇబ్బందే
పిఎం-కిసాన్‌కు ఎంపికైన లబ్ధిదారులకే (సొంత భూమిదారులు) రాష్ట్రం వైఎస్‌ఆర్‌ రైతు భరోసా అందిస్తోంది. ఖరీఫ్‌కు ముందు ఈ నెల 15 నుంచి భరోసా చెల్లింపుల కోసం కసరత్తు ప్రారంభించనుంది. లక్షల సంఖ్యలో పిఎం-కిసాన్‌ కిస్తు పడని పరిస్థితులుండగా ‘భరోసా’కూ అవే ఇబ్బందులెదురు కానున్నాయి.

Courtesy Nava Telangana

Leave a Reply