వలస కార్మికులకు ఎంత కష్టం!

0
274

ఇండోర్‌: కరోనా కట్టడికి కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేస్తున్న నేపథ్యంలో లక్షలాది మంది వలస కార్మికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. దాదాపు 45 రోజుల తర్వాత వీరిని తరలించేందుకు కేంద్రం చర్యలు చేపట్టినా వారు మాత్రం ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా 18 మంది వలస కార్మికులు ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తూ పోలీసులకు చిక్కారు.

మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌కు వలస కార్మికులతో వెళుతున్న కాంక్రీట్‌ మిక్చర్‌ ట్రక్కును మధ్యప్రదేశ్‌ పోలీసులు పట్టుకున్నారు. కాంక్రీట్‌ కలిపే వాహనం లోపల కూర్చున్న వారందరినీ దింపి.. ట్రక్‌ను పోలీస్‌ స్టేషనుకు తరలించారు. ఇండోర్‌లో సమీపంలోని పంత్‌ పిప్లాయ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాన్ని తనిఖీ చేయగా ఈ వ్యవహారం బయటపడింది. పోలీసులు తనిఖీ చేయగా డోమ్‌ లోపల ఉన్నవారు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారని డీఎస్పీ ఉమాకాంత్‌ చౌదరి వెల్లడించారు. ఈ 18 మందిలో 14 మంది యూపీకి చెందిన వారు కాగా, మిగిలిన నలుగురు ట్రక్కు యజమానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిని తరలిస్తున్న ట్రక్కు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిని సొంతూళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

కాగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల్లో కొంతమంది కాలినడకన మరికొందరు సైకిళ్లపై స్వస్థలాలకు పయనమవుతున్న దృశ్యాలు దేశమంతటా వెలుగులోకి వస్తున్నాయి. వలస కార్మికుల తరలింపుపై కేంద్రం ఆలస్యంగా స్పందించి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

Leave a Reply