– ఏడాదికోసారైనా ఇవ్వని బల్దియా
– కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా మారిన వైనం
– టెండర్ దశలోనే కొనుగోళ్లు వారం రోజుల్లో కిట్లు అందజేస్తాం : అదనపు కమిషనర్ రాహుల్‌రాజ్
హైదరాబాద్ మహానగరం పరిశుభ్రంగా ఉం డాలన్నా…నగరవాసులు ఆరోగ్యంగా ఉండా లన్నా పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమైనది. కార్మికుల కృషి ఫలితంగానే స్వచ్ఛభారత్‌లో ఎన్నో అవార్డులు కూడ వచ్చాయి. ఒక్క రోజు పారిశుధ్య కార్మికులు పని చేయకపోతే నగరమరతా చెత్తకుప్పలా మారుతుంది. కరోనా నేపథ్యంలో జనమంతా బయటికి రావాలంటే జంకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో పారిశుధ్య కార్మి కులు వీధుల్లో చెత్తను క్లీనింగ్ చేస్తున్నారు. కాని నగరాన్నే క్లీన్ అండ్ గ్రీన్ ఉంచుతూ ప్రజలను రక్షిస్తున్నా పారిశుధ్య కార్మికులకే రక్షణ కవచాలు కరువయ్యాయి. కార్మికులకు ప్రతి ఏడాది ఇవ్వాల్సిన అందడంలేదు. కనీసం కరోనా నేపథ్యంలో సమాయానికి ఇవ్వాలనే ఆలోచన అధికారుల్లో కొరవడింది. కోట్లాది రూపాయలనే దుబారా చేస్తున్న జీహెచ్‌ఎంసీ కార్మికులకు అవసరమయ్యే కిట్లు టెండర్ దశలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికైనా కార్మికులకు రావాల్సిన కిట్లను ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసు కోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
18వేల మంది పారిశుధ్య కార్మికులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్(జీహెచ్‌ఎంసీ) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 650చదరపు కిలోమీటర్ల మేర విస్త రించింది ఉంది. ఆరు జోన్లు, 30సర్కిళ్లు, 150వార్డుల్లో 18,550 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కో కార్మికుడు/కార్మికురాలు సుమారు 2-3కిలోమీటర్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 3కిలోమీటర్లకు మించి కూడ విధులు నిర్వహిస్తున్నా సందర్భాలూలేకపోలేదు. ఉదయం 5గంటలకు పనులు ప్రారంభిస్తే సాయంత్రం వరకు విధులు నిర్వ హిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతి రోజూ 6,500మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తేస్తున్నారు. 2,500స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్తను ఆయా ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలిస్తున్నారు. కూరగాయలు, పండ్ల, రైతు బజార్ల ఉన్న ప్రాంతాల్లో మోతాదుకు మించి చెత్త ఉత్పత్తి అవుతుంది.
రక్షణ సామాగ్రి కరువు
జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న ప్రతి పారిశుధ్య కార్మికుడు/కార్మికురాలికి రేడియంతో కూడిన జాకెట్ ఇవ్వాలి. చీపురు కట్టలు, రెండు జతల చెప్పులు, సబ్బులు, కొబ్బరి నూనె ఇవ్వాలి. కాని ఇవేవి కార్మికులకు అంద డంలేదు. రేడియం జాకెట్ లేకపోవడంతో చాలా మంది కార్మికులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఈ మధ్య కాలంలో రేడియం జాకెట్ మాత్రం ఇస్తున్నారు. మిగిలిన వస్తువులు ఇవ్వడంలేదు. టెండర్ల పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారు తప్ప కార్మికుల కష్టాలను పట్టిం చుకోవడంలేదు. సాధారణంగా అయితే ఏడాది మధ్యలో ఇస్తారు. కనీసం కరోనా సందర్భంగానైనా సమయానికి రక్షణ సామాగ్రి ఇస్తారనుకుంటే టెండర్ దశలో కొట్టు మిట్టాడుతోంది. పైగా ఈ సారిలో కార్మికులకు ఇచ్చే కిట్‌లో మాస్కులు, శానిటైజర్, గ్లౌజులతోపాటు 10వస్తువులతో కూడిన కిట్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
- వారం రోజుల్లో అందజేస్తాం
- కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. 10వస్తువులతో కూడిన కిట్‌ను వారం రోజుల్లో అందజేస్తాం. కార్మికులకు పర్మినెంట్ మాస్కులు అందజేయాలని నిర్ణయించాం. స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా మాస్కులను తయారు చేయిస్తున్నాం. ఇప్పటికే శానిటైజర్‌ను అందజేశాం. లాక్‌డౌన్ సందర్భంగా కార్మికులు రావడానికి, పోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం.
- రాహుల్, అదనపుకమిషనర్(పారిశుధ్యం)
- రక్షణ సామాగ్రి వెంటనే అందించాలి
- కరోనా మహమ్మారికి ఎదురొడ్డి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు రక్షణ సామాగ్రిని వెంటనే అందజేయాలి. కొన్ని సర్కిళ్లలో చీపులు కట్టలు కూడ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సబ్బులు, చెప్పులు కచ్చితంగా ఇవ్వాలి.
- జె వెంకటేష్, జీహెచ్‌ఎంసీ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ)
Courtesy Nava Telangana