20 కోట్ల మంది ఎదురుచూపులు

0
255

– లాక్‌డౌన్‌లో అదనపు సాయం అందలే..
– రేషన్‌కార్డు లబ్దిదారులకు చేరని సరుకులు
– పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద ప్రకటించిన కేంద్రం
– అత్యంత అధ్వాన స్థితిలో ఢిల్లీ, పంజాబ్‌

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో కోట్లాది మంది పేద ప్రజలు, వలసకూలీలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ యోజనా ప్యాకేజీ (పీఎంజీకేపీ) ఆశించినస్థాయిలో అమలుకావడం లేదు. ఈ పథకంలో భాగంగా రేషన్‌కార్డుదారులకు సాధారణంగా ఇచ్చే నిత్యావసర సరుకులతో పాటు అదనంగా ఇచ్చే 5 కిలోల ధాన్యం (బియ్యం లేదా గోధుమలు) 20 కోట్ల మందికి అందలేదు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద 80 కోట్ల మంది లబ్దిదారులకు ప్రయోజనం వర్తించనున్నదని కేంద్రం ప్రకటించినా.. ఏప్రిల్‌ నెలలో 20 కోట్ల మందికి అదనపు సాయం అందలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వ లెక్కలే వెల్లడిస్తున్నాయి.
దేశవ్యాప్త మూసివేత సందర్భంగా మార్చి 26న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పీఎంజీకేపీని ప్రకటించారు. ఇందులో భాగంగా రేషన్‌కార్డు లబ్దిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా సాధారణంగా ఇచ్చే సరుకులతో పాటు ఒక్కో వ్యక్తికి 5 కిలోల అదనపు ధాన్యం, కిలో పప్పు అందజేస్తామని తెలిపారు. వచ్చే మూడు నెలల పాటు ఇది కొనసాగుతుందని ఆమె చెప్పారు. కానీ గతనెలలో 20 కోట్ల మంది లబ్దిదారులకు కేంద్ర సాయం అందలేదు.

కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం… 80.3 కోట్ల లబ్దిదారులకు గానూ 60.3 కోట్ల మందికి అదనపు సాయం అందించారు. ఈ పథకం సరిగా అమలై ఉంటే 40.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పంపిణీ కావాల్సి ఉండగా.. ఏప్రిల్‌లో 30.16 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్నే సరఫరా చేశారు. అంటే 25 శాతం మందికి కేంద్ర ప్రయోజనం అందలేదు.

పంచని పంజాబ్‌, ఢిల్లీదేశ రాజధానితో పాటు దానికి ఆనుకుని ఉన్న పంజాబ్‌లుపేద ప్రజలకు అదనపు సాయం అందించడంలో దారుణంగా విఫలమయ్యాయి. ఈ రెండు రాష్ట్రాలు వారి జనాభాలో 1 శాతం జనానికి మాత్రమే సరుకులు పంపిణీ చేశాయి. భారతదేశ ధాన్యాగారంగా పేరొందిన పంజాబ్‌లో 70 వేల టన్నుల ధాన్యాన్ని పంపిణీ చేయాల్సి ఉండగా.. 688 టన్నులు మాత్రమే పంపిణీ చేశారు. ఇక లక్షలాది మంది వలస కార్మికులు చిక్కుకుపోయిన ఢిల్లీలో 36 వేల టన్నులు పంచాల్సి ఉండగా.. 63 టన్నులు మాత్రమే పంచారని గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా 2 వేల రేషన్‌ షాపులున్నా.. పేద ప్రజలకు మాత్రం రేషన్‌ అందడం లేదు. ఈ జాబితాలో తర్వాతి స్థానంలో జార్ఖండ్‌, ఒడిషాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ వ్యాప్తంగా 2.73 లక్షల టన్నుల ధాన్యాన్ని పంచాల్సి ఉండగా.. 1.3 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే పంచింది. కేరళ, అసోం, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరాం, రాజస్థాన్‌లు మాత్రమే దాదాపు పూర్తిస్థాయిలో పంపిణీ చేశాయి.

ధాన్యం నిల్వలున్నా…
పేదలకు పంచడానికి కేంద్ర ప్రభుత్వ గోదాములలో సరిపడినంత ధాన్యం నిల్వలున్నాయి. కేంద్రం ప్రకటించిన సాయం మేరకు వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికింద రాష్ట్రాలకు 67 లక్షల టన్నుల ధాన్యాన్ని పంపామని కేంద్రం చెబుతున్నది. కానీ వాస్తవంగా 40 లక్షల టన్నులు మాత్రమే రాష్ట్రాలకు అందాయని సమాచారం. ఇక పప్పు ధాన్యాల విషయానికొస్తే.. 2.42 లక్షల టన్నుల పప్పుదినుసులను రాష్ట్రాలకు పంపామని కేంద్రం చెబుతున్నది. ఇందులో 52 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇవి అందాయని ఆహార హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఆహార భద్రతకు ముప్పు..
లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాది మంది వలస కూలీలు, అసంఘటితరంగ కార్మికులు, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలకు ఉపాధి కరువైంది. నిత్యావసరాలు కొందామన్నా వారి దగ్గర డబ్బుల్లేవు. దీంతో పేద కుటుంబాలు ఆకలికి అలమటిస్తున్నాయి. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ప్రకారం.. మరో 10 కోట్ల మంది లబ్దిదారులకు రేషన్‌ అందాల్సి ఉండగా, వారికి కార్డులు పంపిణీ చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని జీన్‌ డ్రీజ్‌, రీతిక ఖేరా, మేఘనా ముంగీకర్‌ వంటి హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో వారి ఆహర భద్రతకు ముప్పు వాటిల్లందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply