ఎంపీ మాలోతు కవిత ఢిల్లీ నివాసంలో..ముగ్గురి అరెస్టు

0
656
  • ముడుపులు తీసుకుంటుండగా పట్టుకున్న సీబీఐ
  • వాళ్లెవరో తనకు తెలియదన్న టీఆర్‌ఎస్‌ ఎంపీ

న్యూఢిల్లీ, మహబూబాబాద్‌ : ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత అధికార నివాసంలో ముగ్గురు వ్యక్తులు ముడుపులు తీసుకుంటూ సీబీఐకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సీబీఐ వర్గాల కథనం ప్రకారం.. రాజీవ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్తా అనే వ్యక్తులు.. ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో పైరవీల కోసం ముడుపులు డిమాండ్‌ చేశారు. సర్దార్‌నగర్‌లోని ఓ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా.. అధికారుల నుంచి కాపాడతామని ఆ నిర్మాణం యజమాని మన్మిత్‌సింగ్‌ లాంబాను సంప్రదించారు. అందుకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో లాంబా సీబీఐని ఆశ్రయించారు. తనకు తొలుత రాజీవ్‌ భట్టాచార్య ఫోన్‌చేసి.. ఎంపీ మాలోతు కవిత పీఏగా పరిచయం చేసుకున్నాడని బాధితుడు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత శుభాంగీ గుప్తా అనే మహిళ రంగంలోకి దిగిందని చెప్పారు. ఆ తర్వాత వీరంతా.. రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కవిత డ్రైవర్‌ దుర్గేశ్‌కుమార్‌ కూడా వీరితో కలిసి ఉన్నాడని మన్మిత్‌సింగ్‌ పేర్కొన్నారు. బీడీమార్గ్‌లోని సరస్వతి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ నంబర్‌-401కు డబ్బు తీసుకురావాలని రాజీవ్‌ భట్టాచార్య సూచించాడు. అప్పటికే వలపన్నిన సీబీఐ అధికారులు.. రాజీవ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్తాలను డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారితో పాటు ఉన్న దుర్గేశ్‌ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో అతని పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అరెస్టు చేసిన ఇద్దరూ.. తమను తాము ఎంపీ కవిత పీఏలుగా చెప్పుకొంటున్నారని, దర్యాప్తులో నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు.

వాళ్లెవరో నాకు తెలియదు: మాలోతు కవిత
ఢిల్లీలో తనకు వ్యక్తిగత కార్యదర్శులు(పీఏ) ఎవరూ లేరని ఎంపీ మాలోతు కవిత స్పష్టం చేశారు. గురువారం ఆమె ఢిల్లీ, మహబూబాబాద్‌ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. తనకు తెలంగాణలో మాత్రమే ప్రభుత్వం కేటాయించిన పీఏలు, మహబూబాబాద్‌ క్యాంపు కార్యాలయంలో ఒక ప్రైవేటు పీఏ ఉన్నారని చెప్పారు. ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని రెండు నెలల క్రితమే కేటాయించారని వివరించారు. దుర్గేశ్‌ అనే డ్రైవర్‌ను ఢిల్లీలో ఇటీవలే నియమించుకున్నానని, అతనికి సర్వెంట్‌ క్వార్టర్‌ కూడా ఇచ్చానని చెప్పారు. మిగతా ఇద్దరు ఎవరో తనకు తెలియదన్నారు. ఏది ఏమైనా.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సీబీఐని కోరారు.

Courtesy Andhrajyothi

Leave a Reply