మూడు మాసాల్లో 11.2 కోట్ల ఉద్యోగాలు హుష్‌ ! : ఐఎల్‌ఓ నివేదిక వెల్లడి

0
86

ఉపాధిలో లింగ వివక్ష భారత్‌లోనే అధికం : ఐఎల్‌ఓ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ : 2022లో మొదటి త్రైమాసికంలో ప్రపంచ వ్యాపితంగా 11.2 కోట్ల ఉద్యోగాలు పోయాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) తెలిపింది. అంతర్జాతీయంగా పని గంటలు తగ్గిపోయాయని అది పేర్కొంది. 2021 చివరి త్రైమాసికంతో పోల్చితే పని గంటలు దారుణంగా పడిపోయాని ఐఎల్‌ఓ వివరించింది. కరోనా మహమ్మారికి ముందున్న ఉపాధి పరిస్థితి కన్నా 3.8శాతం తగ్గినట్లు పేర్కొంది. ‘వరల్డ్‌ ఆఫ్‌ వర్క్‌” అన్న శీర్షికన ఇచ్చిన ఆ నివేదికలో భారతదేశంలో ఉపాధి రంగంలో నెలకొన్న లింగ అసమానతల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇతర ప్రపంచ దేశాలకన్నా ఉపాధి రంగంలో లింగ వివక్షత భారత్‌లోనే ఎక్కువగా ఉన్నదని చెప్పింది.

కరోనాకు ముందు ప్రతి వంద మంది మహిళలు పనిచేస్తే, అందులో 13 మంది మహిళలు సగటున ఉపాధి కోల్పోయారు. పురుషుల ఉపాధి విషయానికొచ్చేసరికి పరిస్థితి వేరు. ప్రతి వంద మంది పురుషుల్లో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయినవారు 7.5గా వుంది. మహిళల్లో పని గంటలు తగ్గినప్పుడు అల్పాదాయ, మధ్య తరగతి దేశాల ప్రజలపై చూపే ప్రభావం కన్నా పురుషుల పనిగంటలు తగ్గడం వల్ల లింగ అసమాతలపై చూపే ప్రభావమే ఎక్కువ అని పేర్కొంది. ఆహారం, ఇంధన ధరలు అంతర్జాతీయంగా పెరగడం ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా వున్నాయని ఆ నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మరింత మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సభ్య దేశాలను ఐఎల్‌ఓ కోరింది.

ఆర్థిక ఒడిదుడుకులు, తీవ్రమైన రుణ సంక్షోభం, అంతర్జాతీయ సరఫరా చెయిన్‌కు ఆటంకాలు ఇవన్నీ కూడా 2022లో పని గంటలు మరింత క్షీణించడానికి దారి తీస్తాయని ఆ నివేదిక హెచ్చరించింది. రాబోయే మాసాల్లో అంతర్జాతీయ కార్మిక మార్కెట్లో మరింత విస్తృతమైన ప్రభావం వుంటుందని పేర్కొంది. సంపన్న, నిరుపేద దేశాల మధ్య అంతరాలు రోజు రోజుకీ మరింత పెచ్చరిల్లుతున్నాయని నివేదిక హెచ్చరించింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న వారిపట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని ఐఎల్‌ఓ తన సభ్య దేశాలను కోరింది.

Leave a Reply