అక్కడ చావు పేరు శానిటైజర్…

0
272

పిట్టల్లా రాలిపోతున్న యువత
విజయవాడను వెంటాడుతున్న వరుస మరణాలు

అమరావతి : అప్పారావు, చందు, శేఖర్‌, మధు, శివ, సత్యనారాయణ వీరందరూ చనిపోయారు. తిరు గుతూ తిరుగుతూనే మృత్యు ఒడిలోకి చేరుకుంటు న్నారు. సత్యనారాయణ ఎందుకు చనిపోయారంటే ‘శానిటైజర్‌’తో అని టక్కున చెప్పేస్తున్నారు. విజయ వాడలో ఇదో తరహా కొత్త వ్యాధిలా మారిపోయింది. ఈ వారం రోజుల కాలంలో నగరంలోని కొత్తపేట ప్రాంతంలో సుమారు 30 మందికిపైగా శానిటైజర్‌ తాగి చనిపోయారు. దీంతో ఆ మరణాలకు శానిటైజర్‌ అని పేరు పెట్టేశారు. వీటిల్లో నాలుగైదు కేసులు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా ఎక్కువ కేసులు సాధారణ మరణాల ఖాతాలో వేసేస్తున్నారు. కరోనా కాలంలో ఆరోగ్య రక్షణ కోసం చేతుల శుభ్రంగా ఉంచుకోవాలని తీసుకొచ్చిన శానిటైజర్‌ తాగి విజయవాడలో పదుల సంఖ్యలో యువకులు చనిపోతున్నారు. ఆదివారం ఒక్కరోజే నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో సుమారు 20 మందికిపైగా చనిపోయారు. గతంలో మద్యానికి బానిసలైన యువకులు ఎక్కువమంది ఇపుడు శానిటైజర్‌ను యథేచ్ఛగా తాగేస్తున్నారు. సోమవారం సాయంత్రం కొత్తపేటకు చెందిన సత్యనారాయణ అనే రిక్షా పుల్లర్‌ అకస్మాత్తుగా వాంతులు, విరేచనాల బారినపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయారని అక్కడ వైద్యులు తెలిపారు. రిక్షా కార్మికులు, చిన్న చిన్న పనులు చేసుకునే యువకులు ఎక్కువమంది తక్కువ ధరకు కొని, ఎక్కువ కిక్కు వస్తుందని భావించి శానిటైజర్‌కు అలవాటుపడ్డారు. మద్యం బాటిల్‌ రూ.200 పెట్టి కొనాల్సి ఉండటంతో అంత చెల్లించకోలేక రూ.40 శానిటైజర్‌, రూ.10 కూల్‌డ్రింక్‌ (యాపిల్‌జ్యూస్‌) రెండు తెచ్చుకుని గ్లాసులో కలుపుకుని తాగేస్తున్నారు. సరైన నిఘా లేకపోవడం ప్రతి రోజూ కొంటున్నా ఎందుకు అని మందుల దుకాణాల యాజమాన్యం అడగడం లేదు. ప్రతిరోజూ తాగుతున్న వారిలో కనీసం పది రోజులు వాడిన అనంతరం ఎక్కువ మంది చనిపోతున్నారని తెలిసింది. విజయవాడ కొత్తపేట పరిధిలో చనిపోయిన వారిలో ఎక్కువమంది రోజువారీ వినియోగదారులే కావడం, వారందరూ ఒకటి రెండు రోజుల తేడాతో చనిపోతుండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పారావు అనే వ్యక్తి ముఠా పని చేస్తుంటాడు. ఇటీవల పనులు లేకపోవడంతో శానిటైజర్‌ తాగడానికి అలవాటు పడ్డాడు. సోమవారం సాయంత్రం చనిపోయాడు. మహంతిపురానికి చెందిన రిక్షా పుల్లర్‌ శ్రీనివాసరావు, కొత్తపేట శ్రీనివాసమహల్‌ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ వీరందరూ శానిటైజర్‌ తాగి చనిపోయారు. కేసు పెడితే పోలీసులు పోస్టుమార్టం చేయిస్తుండటంతో ఎక్కువమంది ఫిర్యాదులు చేయడం లేదు. దీనిపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

తాగితే చాలా ప్రమాదం
శానిటైజర్‌ తాగేందుకు పనికిరాదు. అందు లో గ్లైజిన్‌ కలుపుతారు. దీనివల్ల ఊపిరితిత్తులు పాడై పోతాయి. లిపిడ్‌ న్యూమెనియా వస్తుంది. లివర్‌ దెబ్బ తింటుంది. క్రమంగా ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడవుతాయి. శానిటైజర్‌ తాగినవారు అతి తక్కువ కాలంలోనే వాంతులు, విరేచనాలతో చనిపోతారు.
కోవిడ్‌ మాజీ ప్రత్యేక అధికారి డాక్టర్‌ ప్రభాకరరెడ్డి

Courtesy Nava Telangana

Leave a Reply