ప్లాస్మా దానానికి 32 మంది సిద్ధం

0
565

హైదరాబాద్‌: ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌లో పాల్గొని కోవిడ్‌ బారిన పడి, కోలుకున్న ముస్లిం సోదరులు ఇతరులకు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్న ఇతరులకు తమ ప్లాస్మాను దానం చేసేందుకు 300 మంది ముస్లింలు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్లాస్మా దానం చేసేందుకు ముస్లింలు ముందుకు రావాలంటూ రంజాన్‌ సందర్భంగా జమాత్‌ చీఫ్‌ మౌలానా కూడా పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ కొవిడ్‌-19 నుంచి కోలుకున్న 32 మంది ప్లాస్మా దానానికి ముందుకొచ్చారు. రక్తం ఇచ్చేందుకు సిద్ధమైన 32 మంది వివరాలు తెలుపుతూ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ లేఖ రాశారు. కరోనా బాధితులకు ఇచ్చే ప్లాస్మాథెరపీకి ఆ దాతల రక్తం ఉపయోగపడుతుందని లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ సోకి కోలుకున్న 32 మందిని ప్లాస్మా దానం చేయాల్సిందిగా తాను స్వయంగా కోరగా, దానికి వారు అంగీకరించారని వెల్లడించారు.

ప్లాస్మా థెరపీ అనుమతి
కరోనా వైరస్‌ బారినపడి గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న అత్యవసర రోగులకు ప్లాస్మా థెరపీ అందించేందుకు అనుమతి లభించింది. ఇందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), డ్రగ్‌ కంట్రోల్‌ బోర్డు అనుమతి మంజూరు చేశాయి. గాంధీ ఆస్పత్రి వైద్య బృందం అనుమతుల కోసం ఐసీఎంఆర్‌ సహా డ్రగ్‌ కంట్రోల్‌ బోర్డుకు దరఖాస్తు చేసింది. డాక్టర్‌ రాజారావు నేతృత్వంలో ఎథికల్‌ కమిటీని కూడా ఎంపిక చేసింది. తాజాగా ఐసీఎంఆర్‌ ప్లాస్మా థెరపీ నిర్వహణకు అనుమతులిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply