ఆసరా నుంచి 35వేల అర్జీల తిరస్కరణ?

0
43
  • ఆధార్‌ లింక్‌ అయిన ఆస్తుల ఆధారంగానే నిర్ణయం!
  • క్షేత్రస్థాయికి జాబితా.. మళ్లీ పరిశీలించాలని ఆదేశం
  • ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు, కారు ఉన్నా అనర్హులే
  • మూడెకరాల తరి, 7.5 ఎకరాల మెట్ట ఉన్నా అంతే

హైదరాబాద్‌ : ఆసరా పింఛన్ల దరఖాస్తుల్లో మరోమారు వడపోత ప్రక్రియకు సర్కారు సిద్ధమైంది. కొత్తగా ఆసరా పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 10.98 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. వీటిలోంచి ఇప్పటికే సగానికి పైగా దరఖాస్తులకు ఆమోద ముద్ర పడినట్లు తెలిసింది. అయితే మొత్తం దరఖాస్తుదారుల్లో దాదాపు 35వేల మందిని అనర్హులుగా గుర్తించినట్లు సమాచారం. ఇందుకు అర్జీదారులు ఇచ్చిన ఆధార్‌

సంఖ్యనే ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆసరా పింఛన్ల అర్హతకు గతంలోనే కొన్ని నిబంధనలను ప్రభుత్వం నిర్దేశించింది. ఆ ప్రకారం.. భార్యాభర్తల్లో ఒకరికి అప్పటికే ఆసరా పింఛను వస్తుంటే మరొకరికి ఇవ్వరు. అర్జీదారుల పిల్లలు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులుగా ఉన్నా..  కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నా పింఛనుకు అనర్హులు. అలాగే అర్జీదారు పేరిట గానీ, ఇంట్లో ఎవరి పేరుమీద గానీ మూడు ఎకరాల తరి ఉన్నా.. 7.5 ఎకరాల మెట్ట భూమి ఉన్నా.. కారు ఉన్నా పింఛను దరఖాస్తును తిరస్కరిస్తారు. ఈ మేరకు అర్జీదారు ఆధార్‌ సంఖ్యతో.. ఆయన/ఆమె ఆస్తుల వివరాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాయంతో గుర్తించి జిల్లాకు 800 నుంచి 1500 వరకు, మొత్తంగా దాదాపు 35వేల మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. వీరి వివరాలను మరోసారి పరిశీలించి, పంపాలంటూ క్షేత్రస్థాయి అధికారులకు జాబితా రూపంలో ప్రభుత్వం చేరవేసినట్లు చెబుతున్నారు. ఫలితంగా మండల స్థాయిలో ఎంపీడీవోల పర్యవేక్షణలో మరోసారి ఆ వివరాలను పరిశీలించనున్నారు.

Leave a Reply