సిటీలోని సీసీ కెమెరాలు సగం పన్జేస్తలేవ్

0
71
  • ముఖ్యమైన పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనూ పని చేయని కెమెరాలు
  • ఆర్టీఐ దరఖాస్తులో హైదరాబాద్ పోలీసుల వెల్లడి 
  • సోషల్ యాక్టివిస్టు అప్లికేషన్ కు రెండేండ్ల తర్వాత రిప్లై 

హైదరాబాద్ : ‘‘సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలోనే హైదరాబాద్‌‌ ఫస్ట్‌‌’’ అని చెబుతున్న పోలీస్‌‌ ఉన్నతాధికారులు.. వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో 40 శాతం పని చేయడం లేదు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులే వెల్లడించారు. సిటీలో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి? ఎన్ని పని చేస్తున్నాయి? తదితర వివరాలు ఇవ్వాలని ఎస్‌‌క్యూ మసూద్‌‌ అనే సోషల్‌‌ యాక్టివిస్ట్‌‌ 2020 ఆగస్టులో ఆర్టీఐ దరఖాస్తు పెట్టారు. అయితే దీనికి రెండేండ్ల తర్వాత పోలీసులు రిప్లై ఇచ్చారు. 2022 ఆగస్టు వరకు సిటీలోని పబ్లిక్ ప్లేసులలో మొత్తం 10,597 సీసీ కెమెరాలు ఉండగా.. వాటిలో 4,402 పని చేయడం లేదని అందులో వెల్లడించారు.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్​లో సగానికి పైగా ఖరాబ్..
హైదరాబాద్‌‌‌‌లో కీలకమైన ప్రాంతం పంజాగుట్ట. సీఎం కేసీఆర్‌‌‌‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌‌‌‌.. ఈ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ పరిధిలోనే ఉంది. ఇక్కడ ప్రతిపక్షాల ఆందోళనలతో ఎప్పుడూ గందరగోళ పరిస్థితి ఉంటుంది. ప్రగతి భవన్‌‌‌‌ చుట్టుపక్కల కిలోమీటర్ల మేర వేలాది మంది పోలీసులు నిత్యం బందోబస్తులో ఉంటారు. అయితే ఇంత కీలకమైన ఈ పీఎస్‌‌‌‌ పరిధిలో 95 సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పంజాగుట్ట పీఎస్‌‌‌‌ పరిధిలో మొత్తం 400 కెమెరాలుండగా, అందులో 305 పని చేస్తున్నాయి. ఇక వివిధ రంగాల ప్రముఖులు నివాసముండే జూబ్లీహిల్స్‌‌‌‌, బంజారాహిల్స్‌‌‌‌లో సగానికి పైగా సీసీ కెమెరాలు పని చేయడం లేదు. జూబ్లీ హిల్స్‌‌‌‌ పీఎస్‌‌‌‌ పరిధిలో 564 కెమెరాలుంటే, కేవలం 201 మాత్రమే పని చేస్తున్నాయి. బంజారాహిల్స్‌‌‌‌ లో 502 కెమెరాలు ఉండగా, అందులో 192 మాత్రమే పని చేస్తున్నాయి. టూరిజం స్పాటైన గోల్కొండలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పీఎస్‌‌‌‌ పరిధిలో 101 కెమెరాలు పని చేయట్లేదు. పాతబస్తీలోని అన్ని పోలీస్‌‌‌‌ స్టేషన్లలో సగటున వంద సీసీ కెమెరాలు రిపేర్‌‌‌‌లో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.

సిటీ అంతటా ఇదే పరిస్థితి..
అబిడ్స్ రోడ్డులో 133 సీసీ కెమెరాలు ఉంటే 56 పని చేయడం లేదు. నిత్యం రద్దీగా ఉండే బేగం బజార్ లో 148కు గాను 99, ముషీరాబాద్ లో 253లో 105, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 370లో 118, నల్లకుంట పరిధిలో 239లో 121, అంబర్ పేటలో 433లో 157, చార్మినార్ ఏరియాలో 127లో 77, చాంద్రాయణగుట్టలో 81లో 37, హుస్సేనీ ఆలంలో 170లో 113, షాహినాయత్ గంజ్ లో 297లో 125, లంగర్ హౌస్ లో 101లో 66, తుకారాంగేట్ లో 158లో 70, డబీర్ పురాలో 104లో 57, మీర్ చౌక్ లో 81లో 59,  కాలాపత్తర్ లో 39లో 23, సుల్తాన్ బజార్ లో 197లో 94, సైఫాబాద్ లో 354లో 106, మంగళ్ హట్ లో 129లో 49 సీసీ కెమెరాలు పని చేయడం లేదు.

ప్రతి పీఎస్​లో సీసీ టీవీ సిస్టమ్​ అడ్మినిస్ట్రేటర్..
సీసీ కెమెరాలకు సంబంధించి మసూద్ అడిగిన పలు ప్రశ్నలకు పోలీసులు జవాబులిచ్చారు. సీసీ కెమెరాల పనితీరు పరిశీలనకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ టీవీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నట్లు తెలిపారు. వీరు ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లలో ఉంటూ కెమెరాలను చూస్తారని పేర్కొన్నారు. ఏదైనా కెమెరా పని చేయడం లేదని, విజువల్స్ రికార్డు అవ్వడం లేదని గుర్తిస్తే టెక్నీషియన్లకు చెప్పి మరమ్మతులు చేయిస్తారని వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజీ కనీసం 30 రోజుల వరకు ఉంటుందని వివరించారు.

నేరాలను ఎట్ల నియంత్రిస్తరు..
నేను 2020 ఆగస్టులో ఆర్టీఐ కింద సీసీ కెమెరాల సమాచారం అడిగితే రెండేండ్ల తర్వాత ఇచ్చారు. వారిచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే సీసీ కెమెరాల నిర్వహణలో హైదరాబాద్ పోలీసులకు ఒక విధానం లేదని అర్థమవుతోంది. రాష్ట్ర పోలీసులు ఒక కెమెరా 100 మంది పోలీసుల పనికి సమానమని చెప్తుంటారు. కానీ హైదరాబాద్ లో సీసీ కెమెరాల పనితీరును చూశాక.. ఈ వాదన కరెక్ట్ కాదని తేలిపోయింది. ప్రతి పీఎస్‌‌‌‌లో ఒకరిని సీసీ టీవీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌‌‌‌గా నియమించినప్పటికీ పని చేయని సీసీ టీవీల గురించి పట్టించుకోవడం లేదు. ఇట్లయితే నేరాలను ఎలా నియంత్రిస్తారు.
– ఎస్ క్యూ మసూద్, సోషల్ యాక్టివిస్టు

Leave a Reply