ఆచార్యుల ఆకలి కేక

0
292
  • కరోనాతో ఊడిన ఉద్యోగాలు..
  • వీధిన పడ్డ 40వేల మంది టీచర్లు, అధ్యాపకులు
  • రెండు నెలల జీతాలు ఇవ్వకుండానే తొలగించిన యాజమాన్యాలు
  • విద్యావలంటీర్లకు పెండింగ్‌లోనే నాలుగు నెలల వేతనాలు
  • బతుకుదెరువు కోసం టీ కొట్లు, చిన్న దుకాణాలు
  • కొందరు దినసరి కూలీలుగా, ఇంకొందరు సాగు పనుల్లో
  • నేడు ఉపాధ్యాయ దినోత్సవం.. ‘బ్లాక్‌ డే’గా ప్రకటించిన ప్రైవేట్‌ టీచర్ల ఫోరం

తవ్వా వెంకటయ్య తెలుగు సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. విజ్ఞానదాయకమైన ఎన్నో పుస్తకాలు రచించారు. ఇంతటి అక్షర సేద్యం చేసిన ఆయన ఇప్పుడు పలుగు, పార పట్టుకొని పొలం పనులకు వెళుతున్నారు. కడప జిల్లా ఖాజీపేట మండలం అవ్వారుపల్లెకు చెందిన తవ్వా వెంకటయ్య కడప ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ స్పెషల్‌ తెలుగు, ఎస్వీ పీజీ సెంటర్‌లో పీజీ, యోగి వేమన విశ్వవిద్యాలయంలో రాయలసీమ కథాసాహిత్యంపై పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్‌ అందుకున్నారు. బీఈడీ పూర్తి చేశారు. ఖాజీపేటలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తూ వచ్చిన రూ. 10వేలు నెలజీతంపైనే భార్య, కూతురు, తమ్ము డిని పోషిస్తున్నారు. కరోనా వల్ల కళాశాల మూతపడడంతో జీతాలు లేవంటూ యాజమాన్యం తేల్చేసింది. కొన్నాళ్లు గంజి తాగి అర్ధాకలితో జీవితం నెట్టుకొచ్చారు. చివరకు కుటుంబమంతా పొలంబాట పట్టింది. ఆయన కలం నుంచి.. వ్యాకరణబోధిని, వ్యాసధార, సీమకథా తొలకరి, రాయలసీమ తొలితరం కథలు, దళిత నెత్తురు, కడపజిల్లా రాజకీయ ముఖచిత్రం, రాయలసీమ చరిత్ర తదితర రచనలు వెలువడ్డాయి.

పీఈటీగా పిల్లలకు ఆటల్లో తర్ఫీదు నిచ్చిన
ఓ మాస్టారి చేతులిప్పుడు
తట్టలు మోస్తున్నాయి.. తాపీ పట్టాయి!!
అబ్బో లెక్కలా.. అని భయపడే పిల్లలకు అదే మక్కువైన సబ్జెక్టుగా అనిపించేలా చేసిన ఓ సారుకు పొలం పనులే దిక్కయ్యాయి!
నగదు ఖాతాల్లో డెబిట్‌, క్రెడిట్‌లు.. కంపెనీల లాభనష్టాల గురించి బోధించే కామర్స్‌ లెక్చరర్‌ జీవితమే లెక్క తప్పి.. టీ కొట్టు ఆధారమైంది!! 

హైదరాబాద్‌ : ఇలా ఉపాధి పోయి.. పూటగడవక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎందరో! కరోనా దెబ్బకు విద్యాసంస్థలు నడవకపోవడం.. యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోవడంతో 40వేల మంది మాస్టార్లు వీధినపడ్డారు! నేడు ఉపాధ్యాయ దినోత్సవం! ఈ సందర్భంగా ఓ పుష్పగుచ్ఛం, అభినందనలతో కూడిన నాలుగు మాటలు, కొన్ని చప్పట్లు.. వారి హృదయాలను ఉప్పొంగించగలవేమో! కానీ పనిలేక.. ఆకలితో నకనకలాడుతున్న తమ కుటుంబసభ్యులకు పట్టెడన్నం పెట్టలేక.. వారి గుండె లోతుల్లోని బాధ అర్థమయ్యేదెవరికి? వారి కంటి పొరల్లో దాగిన కన్నీరు కనిపించేది ఎంతమందికి?  బోనల్ల పాపారావు.. హైదరాబాద్‌ భరత్‌నగర్‌ నివాసి. కబడ్డీలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఈయన కోచింగ్‌లో 15 మంది క్రీడాకారులు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. పాతికేళ్లుగా స్థానిక ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నారు. గత మార్చిలో ఈయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. కొన్నాళ్లు తాపీ పని చేశారు. చేతికి బొబ్బలు చూసిన భార్య తట్టుకోలేకపోయింది. మెడలోంచి మంగళసూత్రం తీసి ఓ చోట కుదువపెట్టి వచ్చిన డబ్బుతో ఆయనతో టీకొట్టు పెట్టించింది. ఇప్పుడు వారి కుటుంబానికి ఇప్పుడిదే జీవనాధారం.

…తరగతిలో పిల్లాడు అన్యమనస్కంగా ఉంటే, అబ్బాయి సమస్యను అడిగి తెలుసుకొని, తల్లిదండ్రులకు చెప్పి మార్గనిర్దేశం చేసే ఉపాధ్యాయుడే ఇప్పుడు అన్యమనస్కంగా ఉంటున్నాడు. విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థిని తీర్చిదిద్దే మాస్టారే ‘కఠిన పరీక్ష’ను ఎదుర్కొంటున్నాడు. బతుకుబండిని నడిపేదెలా అని రంధిపడుతున్నాడు! ఎందరో పైవేటు ఉపాధ్యాయులు, ఆధ్యాపకులు ప్రస్తుతం ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. బతుకుదెరువు కోసం చిన్న చిన్న షాపులు పెట్టుకున్నారు. ఆ స్థోమతా లేని వారు షాపింగ్‌ మాల్స్‌లో పనిచేస్తున్నారు. కొందరు భవన నిర్మాణ పనుల్లో రోజువారీ కూలీలుగా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.9 లక్షల మంది ప్రైవేటు టీచర్లు, 16వేల మంది విద్యావలంటీర్లు, దాదాపు 40వేల మంది ప్రైవేటు జూనియర్‌, డిగ్రీ లెక్చరర్లు కలుపుకొంటే 2.5 లక్షలకు పైగా గురువులు ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీచేయని సర్కారు.. వారి స్థానంలో విద్యావలంటీర్లను నియమిస్తోంది. శాశ్వత ఉపాధ్యాయులతో సమానంగా కష్టపడుతున్నా.. వీరికి ఇచ్చేది రూ. 12వేలు మాత్రమే.

అదికూడా ప్రతినెలా కాకుండా ఏడాదిలో రెండు, మూడు విడతల్లో ఇస్తారు. ఒక్క విద్యావలంటీర్‌తోనే నడుస్తున్న ప్రాథమిక పాఠశాలలు వందల సంఖ్యల్లో ఉన్నాయి. విద్యావ్యవస్థలో కీలకమైన వీరిని ప్రభుత్వం విస్మరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. నెలకు ఒక్కరోజు సెలవు తప్ప వీరికి ఎలాంటి సెలవులుండవు. పరీక్షలు దగ్గర పడినప్పుడు పదో తరగతి పిల్లలకు ఆదివారాలూ తరగతులు తీసుకోవాల్సిందే. కార్మిక చట్టం ప్రకారం చెల్లించాల్సిన కనీస వేతనాలు కూడా వీరికి లేవు. గత విద్యాసంవత్సరంలో పనిచేసిన డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి కాలానికి సంబంధించిన వేతనాలను ఇంకా విడుదల చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా 12,088 ప్రైవేటు పాఠశాలలుండగా.. ఇందులో 2.5 లక్షలకు పైగా ఉపాధ్యాయులున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత వీరి జీవితాలు తలకిందులయ్యాయి. వీరిలో దాదాపు 1.9 లక్షల మందిని యాజమాన్యాలు తొలగించగా.. 60శాతం మందికి జనవరి నుంచి అంటే రెండు నెలల వేతనాలు కూడా ఇవ్వకుండానే పంపించేశాయి. కనీసం పనిచేసిన కాలానికైనా  వేతనాలు ఇచ్చేలా చూడాలని  డీఈవోలు, ఎంఈవోలకు వారు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావడమే తాము చేసిన తప్పా? అంటూ వారు వాపోతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 1498 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు, 600 ప్రైవేటు డిగ్రీ కళాశాలలుండగా ఇందులో 40వేల మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిలో 90 శాతం మంది ఉపాధికి దూరమయ్యారు. 1383 ప్రైవేటు జూనియర్‌ కాలేజీల గుర్తింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వారంతా ఆటోమేటిగ్గా ఉపాధి కోల్పోయినట్లయింది.

ఈ ఫొటోలోని వ్యక్తి ఎండీ రషీద్‌ పాషా. వరంగల్‌ వాస్తవ్యుడు. ఎంకామ్‌, బీఈడీ చేసి వరంగల్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా తొమ్మిదేళ్లు పనిచేశారు. పేరుకు గెస్ట్‌ ఫ్యాకల్టీ అయినా రోజంతా బోధించేవారు. నెలకు రూ. 5500 ఇచ్చేవారు. ఎప్పటికైనా జీతం పెరుగుతుందన్న ఆశతోనే ఇన్నాళ్లు పనిచేశారయన. లాక్‌డౌన్‌ తర్వాత ఆ ఉపాధి కూడా పోయింది. ఆర్థికసాయం కోసం కలెక్టరేట్‌ చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. కుటుంబాన్ని పోషించుకునేందుకు అప్పుచేసి వరంగల్‌ కలెక్టరేట్‌ ముందు  టీకొట్టు పెట్టుకున్నారు.

 నిబంధనలు పట్టవు
ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ప్రయోజనం కోసం 1994లోనే ప్రత్యేకంగా జీవోను విడుదల చేశారు. దీని ప్రకారం టీచర్ల ప్రయోజనాలను పట్టించుకోని యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. జీవోలో ప్రైవేటు యాజమాన్యాలకు ప్రత్యేక నిబంధనలు విధించింది. బడికి వచ్చే ఆదాయంలో 50శాత టీచర్ల జీతాలకు, 15శాతం వారికి ఈపీఎఫ్‌ లాంటివాటికి చెల్లించాలని పేర్కొంది. ఉపాధ్యాయుల నియామక వివరాలు ఎంఈవో/డీఈవోకు తెలపాలని, వారికి తొలగించాలంటే మూడుసార్లు షోకాజ్‌ నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఈ నిబంధనలు ఉన్నట్లుగా విద్యాశాఖ అధికారుల్లోనే చాలామందికి తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఎవరికి తోచినట్లుగా వారు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

‘బ్లాక్‌ డే’గా పాటిస్తున్నాం
60శాతం పాఠశాలలు జనవరి నుంచి వేతనాలు కూడా ఇవ్వకుండా పంపించేశాయి. భవిష్యత్తు తరాన్ని నిర్మిస్తున్న గురువులకు ప్రభుత్వం, యాజమాన్యాలు ఇచ్చే విలువ ఇదేనా? ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాల తీరుకు వ్యతిరేకంగా ఈసారి టీచర్స్‌ డేను బ్లాక్‌డే గా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యలపై దృష్టి సారించాలి.
 షేక్‌ షబ్బీర్‌ అలీ, అధ్యక్షుడు, తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ ఫోరం

ఇలా అయితే ఉపాధ్యాయులుండరు
జూనియర్‌ కాలేజీల్లో ఉన్న లెక్చరర్లంతా బోధన చేస్తున్నా పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌, గెస్ట్‌ ఫ్యాకల్టీ,  మినిమం స్కేల్‌ పే.. ఇలా 12 రకాలుగా విభజించి చీల్చుతున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా నిర్వహించకుండా ఉపాధ్యాయుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు కృషిచేయాలి. లేకపోతే బోధనా రంగంలోకి వచ్చేందుకు ఎవరూ ఇష్టపడరు.
కొప్పిశెట్టి సురేశ్‌, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సంఘం

Courtesy Andhrajyothi

Leave a Reply