ఇంట్లోనే ఇటలీ!

0
251

బయటకు రావొద్దు.. 6 కోట్ల జనాభాకు సర్కారు ఆదేశం
ఆ దేశంలో 9,172 మందికి వైరస్‌.. 463 మంది మృతి
115 దేశాల్లో 1.16 లక్షల మందికి.. మృతులు 4091
ఇరాన్‌లో ఒక్క రోజులో 54 మంది.. సౌదీ సరిహద్దులు బంద్‌
కొవిడ్‌-19
విజృంభణతో విలవిల

మిలన్‌/బీజింగ్‌, మార్చి: చైనాలో మొదలైన  కొవిడ్‌-19 ‘విశ్వ’రూపం చూపిస్తోంది! 115 దేశాల్లో 1,16,400 మందికి సోకింది. మృతుల సంఖ్య 4091కి చేరింది. కేంద్ర స్థానమైన చైనాలో వైరస్‌ ఉధృతి తగ్గుముఖం పడుతుండగా యూరప్‌ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. చైనాలో కొవిడ్‌తో సోమవారం 17 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 3,136కు చేరింది. వూహాన్‌లో వైరస్‌ వ్యాప్తిని తగ్గించామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రకటించారు. తాత్కాలికంగా నిర్మించిన 14 ఆస్పత్రులను మూసివేశారు.

ఆరు కోట్ల మంది ఇల్లు కదలొద్దు
ఇటలీలో వైరస్‌ విలయతాండవం చేస్తోంది. దేశంలో 9,172 మంది కొవిడ్‌-19 బారిన పడ్డారు. 463 మంది మరణించారు. వైరస్‌ తీవ్రంగా ఉన్న ఉత్తర ప్రాంతం (దేశంలో పావు భాగం) అంతటా ఇప్పటికే ఆంక్షలు ఉండగా, తాజాగా దేశమంతటికీ వర్తింపజేశారు. కరోనాను కట్టడి చేయాలంటే దేశంలోని ఆరు కోట్ల మందీ ఇళ్లకే పరిమితం కావాలని ఇటలీ ప్రధాని గుసెప్‌ కోంటె స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆంక్షలు ఏప్రిల్‌ 3 వరకు అమలులో ఉంటాయి. పాఠశాలలు, యూనివర్సిటీలకు సెలవులిచ్చారు. పబ్‌లు, హోటళ్లు తెరచుకోవు. పలు దేశాలు విమానాలను రద్దు చేశాయి. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఇరాన్‌లో మంగళవారం అత్యధికంగా 54 మంది మృతిచెందారు. మొత్తం 8,042 మందికి వైరస్‌ సోకగా.. 291 మంది మరణించారు. దక్షిణ కొరియా(7513 పాజిటివ్‌ కేసులు, 54మంది మృతి), స్పెయిన్‌ (1646-35), ఫ్రాన్స్‌ (1412-30), అమెరికా(729-27), జపాన్‌(543-10) కరోనా విపత్తును ఎదుర్కొంటున్నాయి. దేశంలోకి వచ్చే వారందరికీ క్వారంటైన్‌ విధించాలని ఇజ్రాయెల్‌ నిర్ణయించింది. కరోనా ప్రభావిత 14 దేశాలకు సౌదీ అరేబియా సరిహద్దులను మూసివేసింది.

తుమ్ముతో దారిమళ్లిన విమానం
లాస్‌ ఏంజెలెస్‌:
ఓ ప్రయాణికుడికి తుమ్ములు,  దగ్గు రావడంతో అమెరికాలోని కొలరాడో రాష్ట్రం ఈగిల్‌ నుంచి న్యూజెర్సీకి బయల్దేరిన విమానాన్ని దారి మళ్లించాల్సి వచ్చింది. బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. మిగతావారు గాబరాపడిపోవడంతో  డెన్వర్‌ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్‌ చేశారు. ఆ ప్రయాణికుడికి వచ్చింది అలర్జీయేనని వైద్యులు తేల్చారు.

Courtesy Andhrajyothi

Leave a Reply