వరుసగా పార్టీని వీడుతోన్న ముఖ్య నాయకులు
దిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ.. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా చింతన శిబిరం పేరుతో ఇటీవల మేధోమధన సదస్సును కూడా నిర్వహించింది. అయినప్పటికీ పార్టీ నుంచి వలసలు ఆగడం లేదు. పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్ మొదలు తాజాగా కపిల్ సిబల్ వరకు కాంగ్రెస్‌లో అగ్రనేతల రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇలా గడిచిన ఐదు నెలల్లోనే చాలా మంది ముఖ్య నాయకులు పార్టీని వీడిపోయారు. వచ్చే ఎన్నికల్లో భాజపాకు ఎలాగైనా చెక్ పెట్టాలని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీకి అగ్రనేతల రాజీనామాలు వెంటాడుతూనే ఉన్నాయి.
సునీల్ జాఖడ్: కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీని వీడారు. ఆయన కుటుంబంలోని మూడు తరాలు కాంగ్రెస్ పార్టీకి సేవలందించినప్పటికీ ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలతో కలత చెందినట్లు వెల్లడించారు. ముఖ్యంగా చరణ్‌జిత్ చన్నీని ముఖ్యమంత్రిగా పార్టీ అధిష్ఠానం నియమించడాన్ని తప్పుబట్టిన ఆయన.. ఆయన సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అధిష్ఠానం ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో సునీల్ జాఖడ్ పార్టీని వీడారు. అనంతరం ఆయన భాజపాలో చేరిపోయారు. అంతకుముందు పంజాబ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం పార్టీకి తీవ్ర నష్టం కలిగించిన సంగతి తెలిసిందే.
అశ్వని కుమార్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ న్యాయశాఖ మంత్రి అశ్వని కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిణామాలను పరిగణనలోకి తీసుకొని గౌరవప్రదంగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. నలభై ఏళ్లకుపైగా పార్టీతో తనకున్న అనుబంధాన్ని గుర్తచేసుకున్న ఆయన.. రానున్న రోజుల్లో పార్టీ మరింత దిగజారనున్నట్లు తనకు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇంతకాలం పార్టీలో లభించిన గౌరవానికి సోనియాగాంధీకి అశ్వని కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
కపిల్ సిబల్: కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు కోరుకుంటున్న వారిలో కపిల్ సిబల్ ఒకరు. గత కొన్ని నెలలుగా అధిష్ఠానంపై రెబల్‌గా మారిన జీ-23 నేతల్లో కపిల్ సిబల్ ముఖ్యులు. పార్టీలో గాంధీల ప్రాభవం తగ్గినప్పుడే పార్టీకి మంచిరోజులు వస్తాయని బలంగా నమ్ముతున్న వ్యక్తి. సంస్కరణలు చేపడితేనే పార్టీకి మనుగడ ఉంటుందని బహిరంగంగా చెప్పే కపిల్ సిబల్ వంటి దిగ్గజ నేత చివరకు పార్టీని వీడడం కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడని విషయమే.
ఆర్పీఎన్ సింగ్: కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆర్పీఎన్ సింగ్.. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీకి రాజీనామా సమర్పించారు. 32 ఏళ్ల పాటు పార్టీలో పనిచేసిన ఆర్పీఎన్సింగ్.. అప్పుడున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదని వ్యాఖ్యానించారు. అంతకుముందు కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద కూడా రాజీనామా చేసి భాజపాలో చేరిపోయారు. అనంతరం అదే దారిలో పయనించిన ఆర్పీఎన్సింగ్ కూడా భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఇలా యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా చూపించాయి. దీంతో ప్రస్తుతం రెండు స్థానాలకే పరిమితమయ్యింది.
హార్దిక్ పటేల్: గుజరాత్ పాటిదార్ నేత హార్దిక్ పటేల్‌కూడా ఇటీవలే పార్టీని వీడారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన ఆయన మూడేళ్లుగా పార్టీలో కీలక బాధ్యతల్లో కొనసాగారు. అయితే, గతకొంత కాలంగా పార్టీ తనను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఇటీవల పార్టీకు రాజీనామా చేశారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వాటిని పట్టించుకోకుండా అగ్రనేతలు కేవలం మొబైల్ ఫోన్లలో మునిగిపోయారని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. గుజరాత్ కాంగ్రెస్ నేతలు మాత్రం పార్టీ సమస్యలు పక్కనబెట్టి చికెన్ శ్యాండ్విచ్లను పంపిణీ చేయడంపైనే శ్రద్ధ చూపారంటూ విమర్శించారు.
వీరి పరిస్థితి అంతంతే..
గత అసెంబ్లీ ఎన్నికల నుంచి రాజస్థాన్ రాజకీయాల్లో ముసలం కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా సచిన్ పైలట్, అశోక్ గహ్లోత్ వర్గాలు పార్టీలో పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాకుండా తక్షణమే తనకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సచిన్ పైలట్ డిమాండ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రెండేళ్ల క్రితం సచిన్ పైలట్ క్యాంపును బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఈసారి ఆయన డిమాండ్‌ను నెరవేర్చకుంటే కీలక నిర్ణయమే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ కూడా ప్రస్తుత రాజకీయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో తాను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ఏ క్షణమైనా ప్రకటించవచ్చనే సూచనలు కూడా చేశారు.
Courtesy Eenadu