ఎవరు పర్మినెంట్.. ఒక్కో శాఖలో వేల మంది

0
97
  • తమకు అవకాశం ఇవ్వాలంటూ హైదరాబాద్​ బాట మంత్రులుఎమ్మెల్యేలకు వినతులు
  • ఏండ్ల నుంచి తక్కువ జీతానికే పనిచేస్తున్నమని గోస
  • 2014, 2018 మేనిఫెస్టోల్లోని హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్
  • పీఆర్సీ రిపోర్ట్​ ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులు
  •  50,400 మంది  రెగ్యులరైజ్ చేస్తామని సీఎం చెప్పింది 11,103 మందినే

హైదరాబాద్ : రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్​పై అయోమయం నెలకొంది. ఏ ఏ డిపార్ట్​మెంట్ల వారిని, ఎవరిని పర్మినెంట్​ చేస్తారన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో 50,400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పని చేస్తుండగా.. సీఎం కేసీఆర్  కేవలం 11,1‌‌‌‌03 మందిని రెగ్యులరైజ్​ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించడంతో ఆ లిస్టులో తామున్నామో.. లేమో తెలియక  కాంట్రాక్ట్​ ఉద్యోగులు టెన్షన్​కు గురవుతున్నారు. రెగ్యులరైజేషన్​ను కొన్ని శాఖలు, కొందరు ఉద్యోగులకే పరిమితం చేయకుండా అందరిని  చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. రెగ్యులరైజేషన్​ జాబితాలో తమ ఉద్యోగాలు కూడా ఉండేలా చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి కోరుతున్నారు. గత నాలుగైదు రోజులుగా సెర్ప్​, సర్వశిక్ష అభియాన్​, గురుకులాలు, నేషనల్​ హెల్త్ మిషన్​, ఉపాధి హామీ, జూనియర్​, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్​ ఉద్యోగులు, ఆయా సంఘాల నేతలు మినిస్టర్ క్వార్టర్స్​, అసెంబ్లీ చుట్టూ తిరుగుతూ ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.

తెలంగాణలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్​ వ్యవస్థ ఉండబోదని, అందరినీ రెగ్యులరైజ్​ చేస్తామంటూ  2014 టీఆర్​ఎస్​ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని, సెర్ప్​ ఉద్యోగుల సర్వీస్ ను రెగ్యులరైజ్​ చేస్తామంటూ  2018 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఈ సందర్భంగా వాళ్లు గుర్తు చేస్తున్నారు.  సర్కార్​ ప్రకటించిన 80,039 పోస్టుల్లో తమ ఉద్యోగాలు లేవని, తమను పర్మినెంట్​ చేసినా ఇబ్బందులు ఉండవని, అందువల్ల తమను పర్మనెంట్ చేయాలని కోరుతున్నారు.

పీఆర్సీ రిపోర్ట్​ ప్రకారం..
1996  నుంచి చంద్రబాబు హయాంలోనే కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ మొదలైంది. ఆయన హయాంలో టీచర్, పోలీస్​ పోస్టులు మినహా మిగతా ఉద్యోగాలన్నీ దాదాపు కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్ మెంట్ చేసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి  అధికారంలోకి వచ్చాక 2005 నుంచి ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానం అమల్లోకి వచ్చింది. పీఆర్సీ కోసం బిశ్వాల్​ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్టు ప్రకారం… రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఖాళీగా చూపిన 1,91,126  పోస్టుల్లో 50,400 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు.  ఔట్​ సోర్సింగ్​ పద్ధతిలో మరో 58,128 మంది పని చేస్తున్నారు.

పర్మినెంట్​ చేయాలంటూ హైదరాబాద్​ బాట
రెగ్యులరైజేషన్​పై సీఎం ప్రకటన చేసిన మరుసటి రోజు నుంచి వివిధ శాఖలు, సంస్థలు, స్కీముల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి ఉద్యోగ సంఘాల నేతలు హైదరాబాద్ బాటపట్టారు. సుమారు 700 మంది సెర్ప్ ఉద్యోగులు ‘చలో హైదరాబాద్’ పేరిట మినిస్టర్స్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు చేరుకొని మంత్రులు ఎర్రబెల్లి, హరీశ్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. 2018 టీఆర్​ఎస్​ ఎన్నికల మేనిఫెస్టోలో సెర్ప్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్​ను ప్రత్యేకంగా పేర్కొన్నారని, గవర్నర్​ ప్రసంగంలోనూ చేర్చారని వారు గుర్తుచేస్తున్నారు. రెగ్యులరైజ్​ చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్​ లెక్చరర్లు కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, బండ ప్రకాశ్​, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్​ను కలిసి తమ సర్వీస్​ను రెగ్యులరైజ్​ చేయాలని కోరారు. వచ్చేనెల 19తో తమ మూడేండ్ల కాంట్రాక్ట్ పీరియడ్ పూర్తికానుందని, రెగ్యులరైజ్​ చేయాలని జూనియర్​ పంచాయతీ సెక్రటరీలు కోరుతున్నారు. వారి కాంట్రాక్ట్‌‌‌‌ను ప్రభుత్వం మరో ఏడాది పెంచింది.

కొలిక్కి రాని ఆర్టిజన్ల రెగ్యులరైజేషన్​
విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 23 వేల మంది ఆర్టిజన్ కార్మికులు రెగ్యులరైజ్ అయ్యారా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. రెగ్యులరైజ్ చేశామని సర్కార్ చెప్తుండగా.. అది పూర్తిస్థాయిలో అమలు కావట్లేదని ఆర్టిజన్లు అంటున్నారు. కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్మికుల నుంచి ఆర్టిజన్లుగా తమ పేరు మారింది తప్ప.. బతుకులు మాత్రం మారలేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. హైకోర్టు చెప్పినా తమకు సర్వీస్ రూల్స్ కూడా అమలు చేయట్లేదని అంటున్నారు. బ్రిటిష్ ​కాలం నాటి స్టాండింగ్ రూల్స్ ను తెచ్చిన విద్యుత్ సంస్థలు వాటిని తమపై మోపి రెగ్యులరైజ్ చేసినట్టు చెప్పుకుంటున్నాయని మండిపడుతున్నారు. ఓవైపు అసెంబ్లీలో, మరోవైపు ఇటీవల పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మంత్రులు విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థల్లో పనిచేస్తున్న 23 వేల మందిని రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్లు ప్రకటించుకోవడాన్ని తప్పు పడుతున్నారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చాలి
సెర్ప్ ఉద్యోగుల సర్వీస్​ను రెగ్యులరైజ్ చేస్తామని 2018 టీఆర్​ఎస్​ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన  హామీని అమలు చేయాలి. సీఎం ప్రకటనలో మా ప్రస్తావన లేకపోవడం మనస్తాపానికి గురిచేసింది. మేం 22 ఏండ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా బతుకులీడుస్తున్నాం. రాష్ట్రంలో 48 లక్షల మంది మహిళలతో పొదుపు సంఘాలు నిర్వహిస్తూ.. వారి సాధికారత కోసం పని చేస్తున్న సెర్ప్​ ఉద్యోగులను పట్టించుకోకపోవడం విచారకరం.
– కుంట గంగాధర్ రెడ్డి,   నర్సయ్య, మహేందర్ రెడ్డి, సుదర్శన్, సెర్ప్​ జేఏసీ

యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్​ చేయాలి
యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లందరినీ రెగ్యులరైజ్ చేయాలి. 15, 25 ఏండ్లుగా రాష్ట్రంలోని స్టేట్ యూనివర్సిటీల్లో 1,300 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు అరకొర వేతనాలతో పనిచేస్తున్నా రు. ఇప్పటికే కొందరు రిటైర్డ్​ అవ్వగా, మరికొందరు రిటైర్మెంట్​కు  దగ్గర్లో ఉన్నారు.  అన్ని శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేసిన ప్రభుత్వం మాకు మాత్రం వర్తింపజేయలేదు. ఇతర బెన్ఫిట్స్​ కూడా అమలు కావడం లేదు.
– డాక్టర్​ శ్రీధర్​ కుమార్ లోధ్​, కన్వీనర్​, తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ

ఒక్కో శాఖలో వేల మంది..
స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే సర్వశిక్ష అభియాన్​, స్కూళ్లు, ఎంఈవో, డీఈవో ఆఫీసుల్లో 18 వేల మంది కాంట్రాక్టు ఎంప్లా యీస్​ ఉన్నట్లు అంచనా. జూనియర్ కాలేజీల్లో 3,700 మంది, డిగ్రీ కాలేజీల్లో 800 మంది, పాలిటెక్నిక్​ కాలేజీల్లో 400 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉండగా.. రాష్ట్రంలోని స్టేట్​ యూనివర్సిటీల్లో 1,335 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు. పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 9,100 మంది జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంచాయతీ సెక్రటరీలు, సెర్ప్​లో 4,086 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఈజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 430 మంది ఏపీవోలు, రెవెన్యూ శాఖలో 600 మంది ధరణి ఆపరేటర్లు కాంట్రాక్ట్​ పద్ధతిలో డ్యూటీ చేస్తున్నారు. హెల్త్​ డిపార్ట్​మెంట్​లో 17 వేల మంది కాంట్రాక్ట్​ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరిలో కొందరు 20, 25 ఏండ్ల నుంచి పని చేస్తున్నవారు కూడా ఉన్నారు.

Courtesy V6velugu

Leave a Reply