పిల్లల్ని చిదిమేస్తున్నారు

0
32
  • ఆందోళనకర స్థాయిలో కేసుల పెరుగుదల
  • గతేడాది దేశంలో 53,874 పోక్సో కేసులు

న్యూఢిల్లీ : దేశంలో పిల్లలపై నేరాలు ఆందోళనకరస్థాయిలో పెరిగిపోతున్నాయని ఎన్‌సీఆర్‌బీ(జాతీయ నేర రికార్డుల బ్యూరో) వెల్లడించింది. పిల్లలపై జరుగుతున్న ప్రతి మూడు నేరాల్లో ఒకటి లైంగిక నేరం ఉంటోందని తెలిపింది. ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన తాజా గణాంకాల మేరకు 2021వ సంవత్సరంలో పోక్సో(లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ) చట్టం కింద దేశంలో 53,874 కేసులు నమోదయ్యాయి. 2020లో దేశవ్యాప్తంగా పిల్లలపై జరిగిన వివిధ నేరాలకు సంబంధించి మొత్తం 1,28,531 కేసులు నమోదవగా, 2021లో ఆ సంఖ్య 1,49,404కు (16.2శాతం) పెరిగింది. 2021 సంవత్సరంలో పోక్సో చట్టంలోని సెక్షన్లు 4(లైంగిక దాడి), 6(తీవ్రమైన లైంగిక దాడి) కింద 33,348 కేసులు నమోదవగా, అందులో బాలికలపై జరిగిన ఘోరాలు 33,036, బాలురపై జరిగిన ఘోరాలు 312 ఉన్నాయి.

అలాగే, పిల్లల కిడ్నా్‌పకు సంబంధించి గతేడాది 67,245 కేసులు నమోదయ్యాయి. మరో 29,364 మంది పిల్లలు కనిపించడం లేదని కేసులు నమోదవగా, వారంతా కూడా కిడ్నా్‌పకు గురైనట్టు భావిస్తున్నారు. అలాగే, 1,046 మంది పిల్లలు గతేడాది అక్రమ రవాణాకు గురయ్యారు. మొత్తం నేరాల్లో పిల్లలపై జరుగుతున్న నేరాల రేటు 2020లో 28.9 శాతం ఉండగా, అది 2021లో 33.6 శాతానికి పెరిగిపోయింది. 2021లో 140 మంది చిన్నారులను అత్యాచారం చేసి చంపేయగా, మరో 1,402 మంది చిన్నారులను హత్య చేశారు.

ఢిల్లీలో అత్యధికంగా 7,783 కేసులు..
గతే డాది పిల్లలపై నేరాలకు సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీలోనే అత్యధికంగా 7,783 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ర్టాల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. భ్రూణహత్యల్లో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 121 కేసులు, గుజరాత్‌లో 23, ఛత్తీ్‌సగఢ్‌లో 21, రాజస్థాన్‌లో 13 కేసులు నమోదయ్యాయి. అలాగే, పిల్లలను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలకు సంబంధించి గతేడాది 359 కేసులు నమోదయ్యాయి. ఇక పిల్లల అపహరణకు సంబంధించి 49,535 కేసులు నమోదవగా, వాటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 9,415, మధ్యప్రదేశ్‌లో 8,224, ఢిల్లీలో 5,345, ఒడిసాలో 5,135, పశ్చిమబెంగాల్‌లో 4,026 కేసులు ఉన్నాయి.

బాల కార్మికుల్లో తెలంగాణ టాప్‌..
బాల కార్మికులకు సంబంధించి గతేడాది దేశంలో మొత్తం 982 కేసులు నమోదవగా, వాటిలో తెలంగాణలోనే అత్యధికంగా 305 కేసులు ఉన్నాయి. దాని తర్వాతి స్థానంలో ఒడిసా నిలిచింది. బాల్య వివాహాలకు సంబంధించి 1,062 కేసులు నమోదవగా, కర్ణాటక, తమిళనాడు, అసోం మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి.

Leave a Reply