రైతుల ప్రాణాలు పోతున్నయ్

0
201
  • రాష్ట్రంలో మూడేండ్లలో 59,200 మంది మృత్యువాత
  • అందులో 8 వేల మంది ఆత్మహత్య..  రైతు బీమా స్కీం చెప్తున్న లెక్కలివి
  • కౌలు రైతుల వివరాలు కలిపితే సంఖ్య మరింతగా పెరిగే చాన్స్
  • ఇంకా లెక్కలోకి రాని మరణాలు చాలానే ఉంటాయిఅంటున్న రైతు సంఘాలు
  • ఆత్మహత్యలను దాస్తున్న సర్కారు.. అవి రైతు బీమాలో అదర్స్​ కింద రికార్డు

రైతు రాజ్యంగా చెప్పుకుంటున్న రాష్ట్రంలో రైతుల మరణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. అందరికీ అన్నం పెట్టే అన్నదాతల ఇండ్లు గొడగొడ ఏడుస్తున్నాయి. ఇంటిపెద్దను కోల్పోయి కుటుంబాలు ఆగమవుతున్నాయి. రాష్ట్రంలో రోజూ సగటున 55 మంది రైతులు చనిపోతున్నారు. గడిచిన మూడేండ్లలో వివిధ కారణాలతో 59,200 మంది ప్రాణాలొదిలారు. వీరిలో దాదాపు ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు బీమా స్కీం లెక్కలు చూస్తే ఈ విషయం తెలుస్తోంది. ఈ స్కీం 2018 ఆగస్టు 14 నుంచి అమలవుతోంది. తొలి ఏడాది (2018‌‌–19) 17,845 మంది చనిపోతే.. 2019–20లో 19,351 మంది మరణించారు. అంతకంటే ఎక్కువ సంఖ్యలో 2020–21లో ఇప్పటివరకు 22,004  మంది చనిపోయారు.

హైదరాబాద్​ : రాష్ట్రంలో మూడేండ్లలో 59,200 మంది రైతులు చనిపోయారు. ఇందులో 37,400 మందివి  సహజ మరణాలు కాగా, 2,419 మంది యాక్సిడెంట్లలో చనిపోయారు. రైతుల మరణాలపై, బీమా పరిహారంపై వ్యవసాయ శాఖ ఇటీవల కేటగిరీల వారీగా లెక్కలు తీసింది. 614 మంది అన్నదాతలు కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు అందులో వెల్లడించింది. కరెంట్​ షాక్, పాము కాటుతో  వందల మంది చనిపోయినట్లు పేర్కొంది. మరో 11,819 మరణాలను అదర్స్​  కేటగిరీలో వేసింది. వీరిలో దాదాపు 30 శాతం మంది అనారోగ్య కారణాలతో చనిపోతే.. 70 శాతం మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. అంటే దాదాపు 8వేల మంది ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్క. ఆత్మహత్యలకు పాల్పడిన పాలసీదారులకు ఇన్సురెన్స్​ కంపెనీలు తమ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించవు. కానీ.. రైతు బీమా స్కీంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 5 లక్షల పరిహారం ఇస్తున్నారు. కానీ క్లెయిమ్​లు, పరిహారం అందించిన జాబితాలో ఆత్మహత్యలను  ప్రత్యేకంగా చూపించకుండా ప్రభుత్వం దాచిపెడుతోంది. సహజ మరణాలు, పాము కాటు, కరోనా, కరెంట్​ షాక్  కేటగిరీలుగా రైతుల మరణాలను రికార్డు చేసి, ఆత్మహత్యలను అదర్స్​ కోటాలో వేస్తోంది.

5,650 క్లెయిమ్​లు పెండింగ్​
18 ఏండ్లకు పైబడి 60 ఏండ్లలోపు రైతులందరికీ  రైతు బీమా స్కీమ్​ వర్తిస్తుంది. చనిపోయిన రైతు కుటుంబాలకు వారం రోజుల్లో  రూ. 5 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది. గత మూడేండ్లలో మొత్తం 59,200 మంది చనిపోతే.. 53,550 క్లెయిమ్​లు సెటిల్​ అయ్యాయి. మిగతా  5,650 క్లెయిమ్​లు  పెండింగ్​లో ఉన్నాయి. 2018–19లో 225 మంది, 2019–20లో 558 మంది, 2020–21లో ఇప్పటివరకు  4,867  కుటుంబాలకు పరిహారం అందలేదు.

రుణమాఫీ అమలు కాదాయె.. అప్పులు పెరిగిపోవట్టె..!
అప్పుల సేద్యం, రుణమాఫీ అమలు కాకపోవడం, నిర్బంధ పంటల సాగు, అకాల వర్షాలు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై ప్రభుత్వం సీజన్ ​కో తీరుగా వ్యవహరించటం వంటి కారణాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. అప్పు తెచ్చి పెట్టుబడిగా పెట్టి రైతులు సాగు చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రావడం లేదు. అప్పులు పెరిగిపోయి పిల్లల చదువులు, వారి పెండ్లిళ్లు, ఇండ్లు గడుసుడు ఎట్లా అనే ఆందోళనలతో ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. మరికొందరు తీవ్ర డిప్రెషన్​లోకి వెళ్లి అనారోగ్యాల పాలై చనిపోతున్నారు. రైతు ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణమని రైతు సంఘాల నాయకులు, అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెప్తున్నారు. బ్యాంకుల్లో ఉన్న లక్ష రూపాయల వరకు క్రాప్​ లోన్​ను మాఫీ చేస్తామని టీఆర్​ఎస్​ 2018 ఎన్నికల టైంలో చెప్పింది. ఇంతవరకు అది పూర్తిగా అమలు కావడం లేదు. ఆ అప్పు మాఫీగాక, బ్యాంకుల్లో కొత్త అప్పు పుట్టక, ఎక్కువ మిత్తీకి ప్రైవేటులో అప్పు తెచ్చుకుని తిరిగి మళ్లీ తీర్చలేక రైతులు ఆగమవుతున్నారు. రాష్ట్ర సర్కార్​ 40.66 లక్షల మంది లబ్ధిదారులు రుణమాఫీ పథకంలో ఉన్నారని లెక్క తేల్చింది. కానీ ఇప్పటివరకు కేవలం 2.96 లక్షల మందికి రూ. 408 కోట్లు.. అది కూడా రూ. 25 వేలలోపు రుణాలనే మాఫీ చేసి చేతులు దులుపుకుంది. నిరుడు కందులను ఎంఎస్పీకి కొంటామని చెప్పిన ప్రభుత్వం.. బయట రేటు మంచిగానే ఉందని, తాము కొనడం ఎందుకని ఒక్క కంది గింజను కూడా కొనలేదు. మక్కలదీ అదే పరిస్థితి. వరిలో సన్న రకాలు వేయాలని చెప్పిన సర్కారు..​ బోనస్​ ఇచ్చి కొంటామని చెప్పినా మాట నిలబెట్టుకోలేదు. దీంతో దొడ్డు రకం ధరకే అమ్ముకుని రైతులు నష్టాల పాలయ్యారు. అకాల వర్షాలతో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే అందాల్సిన ఇన్​పుట్​ సబ్సిడీ అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల కేంద్ర ప్రభుత్వం అమలు చేసే  ఫసల్​ బీమా పథకం కూడా రాష్ట్రంలో  అమలుకావడం లేదు.

కౌలు రైతుల లెక్క కలిపితే ఇంకా ఎక్కువే
కౌలు రైతుల మరణాలు, ఆత్మహత్యలు కలిపితే రైతు మరణాల సంఖ్య పెరుగుతుందని రైతు సంఘాలు అంటున్నాయి. గత ఆరున్నరేండ్లలో 4,200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని లెక్క గట్టాయి.  ఇంకా రిపోర్ట్‌‌‌‌ కాని ఆత్మహత్యలు చాలానే ఉంటాయంటున్నాయి.

ఆత్మహత్యలను దాస్తున్నరు
పంటకు పెట్టుబడి సాయం చేస్తున్నామని సర్కార్  చెప్తోంది. కానీ, ఆ పెట్టుబడి పైసలతో అన్ని సమస్యలు తీరిపోతయా? అప్పుల పాలై రైతులు చనిపోతున్నారు. ఆ మరణాలను అదర్స్​ లిస్టులో వేసి ప్రభుత్వం దాస్తోంది. మల్లారెడ్డి, రైతు సంఘం నేత

అప్పులు తీరే మార్గం లేక కౌలు రైతు ఆత్మహత్య
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లికి చెందిన కౌలు రైతు మస్కురి రాములు(40) జూన్​4న ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత భూమి లేకపోవడంతో అదే గ్రామంలో రెండెకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి సాగు చేసేవాడు. పంటలు పండక 4 లక్షల వరకు అప్పు  చేశాడు. ఈ అప్పులు తీరే దారి కనిపించకపోవడం, పెళ్లికి ఎదిగిన కూతుర్లు ఉండడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. పొలం దగ్గరే  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు మృతితో అతని భార్య పద్మ, ముగ్గురు కూతుళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ముగ్గురు పిల్లలతో రోడ్డున పడ్డా..
మాది వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ఆత్మకూరు. నా భర్త ఐదెకరాల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసిండు. ఐదు లక్షలు అప్పయింది. పైసలు ఇచ్చినోళ్లు ఇంటిమీదికొచ్చి లొల్లి చేయడంతో ఫికరు పెట్టుకుండు. ఊళ్ళో కట్టిన రైతు వేదికకు ఉరేసుకొని ప్రాణం తీసుకుండు. సాయం కోసం దరఖాస్తు పెట్టుకున్న.. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రాలే.   – సదిరం రమా (గత ఏడాది నవంబర్ 7న నిర్మాణంలో ఉన్న రైతువేదికలో ఉరేసుకున్న కౌలు రైతు రాంచందర్ భార్య)

రాష్ట్రంలో రైతుల మరణాలు (రైతు బీమా స్కీం లెక్కల ప్రకారం)
ఏడాది    చనిపోయినవారు
2018‌‌–19    17,845
2019‌‌‌‌‌‌–20    19,351
2020–21    22,004
మొత్తం 59,200

Courtesy V6velugu

Leave a Reply