హైదరాబాద్‌లో రెచ్చిపోయిన గొలుసు దొంగల ముఠా
హైదరాబాద్: జంట నగరాల్లో (hyderabad-Secundrabad) గొలుసు దొంగల ముఠా రెచ్చిపోయింది. రెండు గంటల వ్యవధిలో ఆరు చోట్ల మహిళల మెడల్లోంచి బంగారం గొలుసులు తెంచుకుపోయారు. ఈ ఉదయం 6.20 గంటల నుంచి మొదలు 8.10 గంటల మధ్య నగరంలోని ఉప్పల్ రాజధాని, కళ్యాణపురి, నాచారం నాగేంద్రనగర్, ఓయూలోని రవీంద్రనగర్, చిలకలగూడలోని రామాలయం గుండు, రామ్‌గోపాల్‌పేట్ రైల్వేస్టేషన్ ప్రాంతాల్లోని మహిళల మెడల్లోంచి గొలుసులు దొంగిలించారు.
దిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠా గొలుసు దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం ఉప్పల్‌లో మొదలుపెట్టి సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేట్ వరకు వరుసగా ఆరు గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగల ముఠా రైలులో దిల్లీ పారిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్న పోలీసులు.. రైల్వేస్టేషన్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు.అనుమానితులను తనిఖీ చేస్తున్నారు. వాహన తనిఖీలు సైతం ముమ్మరం చేశారు. సికింద్రాబాద్‌లో దొంగతనానికి పాల్పడిన నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని పారడైస్ వద్ద వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రాంగోపాల్‌పేట్ పోలీసులు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల గురించి సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.