60లక్షలకు పైనే ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు

0
319

నియామకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరాసక్తత
నిరుద్యోగ యువత ఆందోళన

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని 2014 ఎన్నికలకు ముందు మోడీ ఊరూరా తిరిగి వాగ్దానం చేశారు. మోడీ గెలిస్తే జాబ్‌ వస్తుందని దేశ యువత ఆశపడింది. కానీ ఇంతవరకూ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదు. దీంతో దేశ యువతకు జాబ్‌ దొరకటంలేదు. ఒకటికాదు.. రెండు కాదు.. బీజేపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడిచిపోయాయి. కొత్త ఉద్యోగాల సృష్టి పక్కనపెడితే… ఉన్న ఖాళీ పోస్టుల భర్తీపైనా కేంద్రం దృష్టిపెట్టడంలేదు. ఓవైపు ప్రభుత్వరంగసంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నది. మరోవైపు ఈ సంస్థలనూ ప్రయివేటుకు అప్పనంగా అప్పగించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒక్కో సంస్థనూ కార్పొరేట్లకు తెగనమ్ముతూ.. ఉద్యోగాలను కుదించేస్తున్నది. అలాగే రాష్ట్రాల పరిధిలోని ఉద్యోగాలనూ ఆయా ప్రభుత్వాలు భర్తీచేయటంలేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నియామక ప్రక్రియను చేపట్టాలని నిరుద్యోగయువత డిమాండ్‌ చేస్తున్నది.

న్యూఢిల్లీ : దేశం ఎదుర్కొంటున్న అనేక ప్రధాన సమస్యలో నిరుద్యోగం ఒకటి. దేశవ్యాప్తంగా ఎందరో యువతీ, యువకులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారు. ఇంకొందరు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లేక మానసిక వేదనను అనుభవిస్తున్నారు. మరికొందరైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలోని యువత ఇంతగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. తమ ఆధీనంలో ఉండే ప్రభుత్వ కొలువుల నియామకాలను చేపట్టడంలో కూడా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. దీంతో లక్షలాది ప్రభుత్వ కొలువులు నియామకానికి నోచుకోక ఖాళీగా ఉంటున్నాయి. దేశ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు విభాగాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 60 లక్షలకు పైగా కొలువులు ఖాళీగానే ఉన్నాయి. ఇందులో దాదాపు 30 లక్షల పోస్టులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండగా, మిగతా 30 లక్షల ఉద్యోగాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనివి. భారత్‌లోని ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం దేశ యువత చకోర పక్షుల్లా వేచి చూస్తున్నారు. కరోనా ముందు ఎలాగోలా ఉపాధి కల్పించుకున్న నిరుద్యోగులు..ఇపుడు అవకాశాల్లేక అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తే దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య కొంతైనా తగ్గే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతో 2014లో కేంద్రంలో మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. అయితే, అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడిచినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదు. తమ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోకపోవడం నిరుద్యోగ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధి ఏంటో తెలియజేస్తున్నదని యువత వాపోతున్నది.

సమాచార హక్కు చట్టం ద్వారా ఉద్యోగ ఖాళీల వివరాలు ఇలా…
సమాచార హక్కు చట్టం ద్వారా అందిన సమాచారం, పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడించిన సమాచారం, ప్రభుత్వ గణాంకాలు, ఇతర విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు 9.10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఐఐఎంలు, నిట్‌లు, కేంద్ర పరిధిలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు (కేవీలు), జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో దాదాపు 37 వేల ఉద్యోగాలు భర్తీకి నోచుకోలేదు. రాష్ట్రాల్లో అధిక భాగం కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ప్రాథమిక పాఠశాలల్లో 8.53 లక్షల పోస్టులు, ఆరోగ్య రంగంలో 1.68 లక్షలు, అంగన్‌వాడీ వ్యవస్థలో 1.76 లక్షల ఉద్యోగాలు, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో 2 లక్షల పోస్టులు, ఇండియన్‌ ఆర్మీలో 1.07 లక్షల ఉద్యోగాలు, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఏపీ ఎఫ్‌)లో దాదాపు 92వేల పోస్టులు, దేశవ్యాప్తంగా రాష్ట్ర పోలీసు విభాగాలు, జ్యుడీషీయల్‌ కోర్టుల్లో 5.31 లక్షల ఉద్యోగాలు, కిందిస్థాయి కోర్టుల్లో 5 వేలకు పైగా పోస్టులు భర్తీకి నోచుకోక మూలుగుతున్నాయి. ఇక ఆలిండియా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌జీఈఎఫ్‌) సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు, మంత్రిత్వ శాఖల పరిధుల్లో కలుపుకొని మొత్తం 30 లక్షలకు పైగా కొలువులు ఖాళీగానే ఉన్నాయి.

మోడీ వచ్చాక పెరుగుతున్న ఖాళీలు…
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2014-15లో ఖాళీ పోస్టుల సంఖ్య 4.21 లక్షలకు పైగా( 11.57 శాతంగా) ఉన్నది. 2015-16 ఇది 4.20 లక్షలకు పైగా (11.52శాతంగా), 2016-17లో ఇది 4.12 లక్షలకు పైగా (11.36 శాతంగా), 2017-18లో 6.83 లక్షలకు పైగా (17.98 శాతంగా) నమోదైంది. ఇక 2018-19లో అత్యధికంగా 9.10 లక్షలకు పైగా కొలువులు (22.76 శాతం) ఖాళీగా ఉండటం గమనించాల్సిన అంశం.

బ్యాంకుల్లో రెండు లక్షలకు పైగా క్లాస్‌-4, క్లాస్‌-3, ఆఫీసర్‌ కేడర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) జనరల్‌ సెక్రెటరీ సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు. దీంతో బ్యాంకు ఉద్యోగులు పని భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నియామక ప్రక్రియను చేపట్టాలని దేశంలోని నిరుద్యోగ యువత డిమాండ్‌ చేసింది.

Courtesy Nava Telangana

Leave a Reply