కాశ్మీర్‌లో పంచాయతీ వెలవెల

0
188

లోయలో 61శాతానికి పైగా సీట్లు ఖాళీగానే
– 19,582 స్థానాలకు గానూ.. 7528 సీట్లు మాత్రమే భర్తీ
దాదాపు ఏడాది కిందటే విజయవంతంగాముగిసిన ఎన్నికలు
శ్రీనగర్‌ : ఆర్టికల్‌ 370 రద్దుపై మోడీ సర్కారు వివాదాస్పద నిర్ణయంతో ఇప్పటికే కష్టాలను ఎదుర్కొంటున్న కాశ్మీర్‌లో పలు పంచాయతీ స్థానా లకు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పాలన స్తం భించింది. దాదాపు ఏడాది కిందటే జమ్మూకాశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విజయవంతంగా ముగిశాయి. అయితే కాశ్మీర్‌లో మాత్రం ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో అనేక పంచాయతీ స్థానాలు ప్రజాప్రతినిధులు లేక వెలవెలబోతున్నాయి. లోయలోని 10 జిల్లాల్లో దాదాపు 61శాతానికి పైగా పంచాయతీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయనీ జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శైలేంద్రకుమార్‌ ఇటీవల వెల్లడించడం గమనార్హం. కాశ్మీర్‌లో మొత్తం 137 బ్లాక్‌లలో 19,582 పంచాయతీ సభ్యులు, సర్పంచ్‌ స్థానాలున్నాయి. ఇందులో కేవలం 7,528 స్థానాలకు అభ్యర్థులు పోటీ చేశారని శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో శైలేంద్రకుమార్‌ వెల్లడించారు. కాగా, 12,054(61.5శాతం) పంచాయతీ, సర్పంచ్‌ బెర్తులు ఇంకా ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
గతేడాది నవంబర్‌-డిసెంబర్‌ మధ్య అత్యంత పటిష్ట భద్రత నడుమ జమ్మూకాశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలను అధికారులు విజయవంతంగా నిర్వహిం చారు. జమ్మూకాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన నెల తర్వాతనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం గమనార్హం. ఆ సమయంలో కాశ్మీర్‌ లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ 44.4శాతం మాత్రమే నమోదైంది. జమ్మూలో మాత్రం ఇది 86 శాతంగా రికార్డయింది. కాగా, కాశ్మీర్‌లో ఖాళీగా ఉన్న సీట్లతో పోల్చుకుంటే జమ్మూ, లఢఖ్‌ ప్రాంతాలలో ఖాళీ అయిన సీట్లు తక్కువగానే ఉన్నాయి.
జమ్మూలో 103, లఢఖ్‌లో 24 పంచాయతీ స్థానాలు ఖాళీగా ఉండటం గమనార్హం. జమ్మూలో 148 బ్లాక్‌లలో 18,182 పంచాయతీ, సర్పంచ్‌ స్థానాలకు గానూ.. 18,089 స్థానాలు భర్తీ అయ్యా యి. అదేవిధంగా లఢఖ్‌లో 31 బ్లాక్‌లలో 1630 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 1606 స్థానాలు భర్తీ కావడం విశేషం. అయితే ఖాళీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి సవాలేననీ, చాలా చోట్లా కోరం లేకపోవడంతో పంచాయతీలను ఏర్పాటు చేయలేకపోయామని సీనియర్‌ అధికారి ఒకరు వివరించారు.
అయితే ఖాళీ అయిన పంచాయతీ స్థానాల భర్తీపై బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్స్‌(బీడీసీ) ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని శైలేంద్రకుమార్‌ వెల్లడించారు. ఆర్టికల్‌-370 రద్దు అనంతరం కాశ్మీర్‌ లోయలో జరగనున్న తొలి ఎన్నికలు ఇవే కానుండ టం గమనార్హం. బీడీసీ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ వచ్చేనెల 24న నిర్వహించనున్నట్టు శైలేంద్రకుమార్‌ తెలిపారు. బీడీసీ ఎన్నికల్లో పంచాయతీ, సర్పంచ్‌ ప్రజాప్రతినిధుల భాగస్వా మ్యం కూడా ఉంటుంది. ఈ ఎన్నికల్లో వీరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ, కాశ్మీర్‌లో 61శాతానికి పైగా పంచాయతీ స్థానాలు ఖాళీగానేఉన్నాయి. మరోపక్క, జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబాముఫ్తీ, ఒమర్‌, ఫరూక్‌లతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు ‘నిర్బంధం’లోనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో బీడీసీ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
ఆంక్షలు తొలగించాలి…!
కేంద్రానికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్‌
న్యూఢిల్లీ : గత ఆగస్టు 5 నుంచి జమ్ము కాశ్మీర్‌లో అమలులో వున్న ఆంక్షలన్నింటినీ వెంటనే తొలగించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. జమ్మూ కాశ్మీర్‌ బ్లాక్‌ డెవలెప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికలు అక్టోబర్‌ 24న జరుగుతాయంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ చేసిన ప్రకటన ప్రజాస్వామ్య విరుద్ధమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. గత రెండు నెలలుగా అక్కడ కమ్యూనికేషన్లు, పౌరుల కదలికలపై ఉక్కుపాదం మోపుతూ, రాజకీయ నేతలు, కార్యకర్తలను నిర్బంధిస్తూ, ఇప్పుడు అంతా ‘సాధారణం’గానే వుందని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నమే ఆ ప్రకటన అని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ పరిస్థితుల్లో బ్లాక్‌ డెవలెప్‌మెంట్‌ కౌన్సిళ్ల ఎన్నికలు నిర్వహించటం ప్రజలను, ప్రపంచాన్ని మోసం చేయటమే అవుతుందని స్పష్టం చేసింది. ఈ కౌన్సిళ్ల ఎన్నికల్లో పంచాయతీ సభ్యులు, సర్పంచ్‌లు ఓటర్లుగా వుంటారని, ఇప్పుడు లోయలో 61 శాతం మేర ఈ పదవులు ఖాళీగానేవున్నాయని గుర్తు చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజల భాగస్వామ్యం లేకుండానే గత ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించారని వివరించింది. ఇప్పుడు ఈ కౌన్సిళ్ల ఎన్నికలను నిర్వహించటానికి ముందు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ ఖాళీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వుందని పేర్కొంది. ఇప్పుడు ఈ తతంగం అంతా కేంద్ర ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని వ్యాఖ్యానించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఒకవైపు జమ్మూ కాశ్మీర్‌లో ఆంక్షలు లేవంటూనే మరోవైపు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని మాత్రమే నిర్బంధిస్తున్నామంటూ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నారని విమర్శించింది. ఆస్పత్రుల ఒపిడిలలో పేషెంట్ల సంఖ్యను, పనిచేస్తున్న లాండ్‌ ఫోన్ల వివరాలను చెప్పటానికి ముందు ఇంటర్నెట్‌ కనెక్షన్లు, మొబైల్‌ కనెక్షన్లు ఎందుకు పునరుద్ధరించలేదో ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అదే విధంగా మెయిన్‌ బజార్లు, షాపులు ఎందుకు మూసి వుంటున్నాయో, స్కూళ్లు ఎందుకు పనిచేయటం లేదో, ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు ఎందుకు తక్కువగా వుంటోందో, నేతలందరూ ఇప్పటికీ జైళ్లలోనే ఎందుకున్నారో కూడా మంత్రి వివరణ ఇవ్వాలని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. ఇవి కేవలం ఆంక్షలు కాదని, ప్రజాస్వామ్యంపై కొనసాగుతున్న దాడి అని అభిప్రాయపడింది. కేంద్ర హోం మంత్రి అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాన్ని ఇకనైనా మానుకోవాలని హితవు పలికింది. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాలని, రాజకీయ నేతలు, కార్యకర్తలందరినీ తక్షణం బంధ విముక్తి చేయాలని, రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలకు స్వేచ్ఛ లభించిన తరువాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలన్న తన డిమాండ్‌ను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పునరుద్ఘాటించింది.

Courtesy Andhrajyothi

Leave a Reply