కరెంటు గోస

0
135
  • విద్యుత్‌ కనెక్షన్ల కోసం రైతుల ఎదురుచూపులు
  • ఏళ్లు, నెలల తరబడి పెండింగ్‌లో దరఖాస్తులు
  • సీఎం, విద్యుత్‌ మంత్రి ఇలాకాల్లోనూ ఇదే దుస్థితి
  • అన్నదాతలకు చుక్కలు చూపిస్తున్న డిస్కంలు
  • వ్యవసాయ కనెక్షన్లతో లాభం లేదని విముఖత
  • రెండు డిస్కమ్‌ల పరిధిలో 64 వేల అర్జీలు పెండింగ్‌
  • అనధికారికంగా లక్షకు పైగానే ఉన్నాయని అంచనా

హైదరాబాద్‌ : తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం వళ్లపురంలో రైతు ఎర్రబోయిన నారాయణ వ్యవసాయ కరెంటు కనెక్షన్‌ కోసం 2013 జూలై 19న దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ అన్నదాత కరెంటు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయింది. ఇప్పటికీ కనెక్షన్‌ రాలేదు. ఈ ఒక్క మండలంలోనే 387 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు డిస్కమ్‌ వెబ్‌సైట్‌ చెబుతోంది.. ఇక సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కుక్‌ మండలం దామరకుంట గ్రామానికి చెందిన రైతు బత్తిని అనూష వ్యవసాయ కరెంటు కనెక్షన్‌ కోసం 2021 డిసెంబరు 26న దరఖాస్తు చేసుకుంది. మూడు నెలలైనా ఆమెకు కనెక్షన్‌ మంజూరు కాలేదు. ఈ మండలంలో 90 మంది రైతులు కొన్ని నెలలుగా వేచిచూస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఉచితంగా 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. అయితే కొత్తగా వ్యవసాయ కరెంటు కనెక్షన్లు పొందేందుకు అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కోరిన వెంటనే కనెక్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వాలు ఆదేశాలివ్వగా.. డిస్కమ్‌లు మాత్రం సీనియారిటీ ప్రాతిపదికన ‘ఫస్ట్‌ కమ్‌.. ఫస్ట్‌ సర్వ్‌’ అంటూ కనెక్షన్లు మంజూరు చేస్తున్నాయి. తొలుత ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికే ఇస్తామంటూ జాబితాను పెడుతుండగా.. సీనియారిటీకి చేరడానికి రైతులు నెలలు/ఏళ్ల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

వ్యవసాయ పొలాలు దూరంగా ఉండటంతో కనెక్షన్‌ ఇవ్వాలంటే కొత్తగా స్తంభాలు, వైర్లు ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టాల్సి ఉంటుంది. ఏడేళ్లుగా రూ.50 వేల కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న డిస్కమ్‌లు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే పాట్లు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏ మాత్రం లాభసాటి కాని వ్యవసాయ కనెక్షన్లకు అదనంగా నిధులు వెచ్చించి, కనెక్షన్లు ఇవ్వడానికి డిస్కమ్‌లు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 36వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 28,654 పెండింగ్‌లో ఉన్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య లక్షపైనే ఉందని తెలుస్తోంది. వ్యవసాయ కనెక్షన్ల మంజూరు కోసం ప్రత్యేక డ్రైవ్‌లు పెట్టాల్సి ఉండగా.. ఆ పని చేయడం లేదు. ఇక క్షేత్రస్థాయిలో ఒక్కో కనెక్షన్‌ కోసం రూ.25 వేల నుంచి రూ.40 వేల దాకా రైతులు మామూళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇన్ని చేసి.. ఒకవేళ కనెక్షన్‌ మంజూరైనా.. స్తంభాలు, వైర్లు ఇవ్వకపోవడం, ట్రాన్స్‌ఫార్మర్ల కోసం ముప్పుతిప్పలు పెడుతున్నారనే విమర్శలున్నాయి.

స్తంభాలు, లైన్ల కోసం ఇబ్బందులు
గ్రామాల్లో రైతుల బోరు బావులు ఒక చోట ఉంటే.. లైన్లు/ట్రాన్స్‌ఫార్మర్లు మరో చోట ఉంటాయి. కొత్తగా రైతు కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేస్తే సాధ్యాసాధ్యాల నివేదిక ఆధారంగా అంచనాలు(ఏ మేర ఖర్చవుతుందో) వేయాల్సి ఉంటుంది. ఒక కనెక్షన్‌కు ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టాల్సి ఉంటే.. దాని అంచనా రూ.70వేలు దాటితే.. ఆ మేరకు పెరిగే భారాన్ని రైతులే భరించాల్సి ఉంటుంది. రైతు తన వాటా చెల్లించలేదనే కారణాలతో కూడా దరఖాస్తులు పెండింగ్‌లో పెడుతున్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో ఉన్న నల్లగొండ జిల్లాలో 7,219 మందికి ఈ కారణంగానే దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు. కేవలం స్తంభాలు, లైను వేయాలంటే ఒక్కో రైతుకు రూ.45 వేల దాకా ప్రభుత్వం భరిస్తుంది. వికారాబాద్‌ జిల్లా పూడురు మండలం మిట్టకనకల్‌ గ్రామానికి చెందిన రైతు వెంకటయ్య కరెంట్‌ లైను వేయాలని 2019 ఏప్రిల్‌ 11న డీడీ కట్టగా.. ఇప్పటికీ లైను వేయలేదు. నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వడ్డేమాన్‌ గ్రామానికి చెందిన నక్క రాములుదీ ఇదే పరిస్థితి. స్తంభాలు, వైర్లు, అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టడం.. ఆ కనెక్షన్ల వల్ల ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడం, డిస్కమ్‌లు పీకల్లోతు నష్టాల్లో ఉండటంతో.. స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లు కొనడానికి కూడా డిస్కమ్‌ల వద్ద డబ్బు లేదు. దాంతో సీనియారిటీ పేరిట కనెక్షన్లను పెండింగ్‌లో పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

జిల్లాల వారీగా పెండింగ్‌ కనెక్షన్లు..
వనపర్తి జిల్లాలో 5,322 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా.. అన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి కనెక్షన్లు ఇవ్వడానికి 1,500కుపైగా ట్రాన్స్‌ఫార్మర్లు అవసరం. అవి కొనుగోలు చేయడానికి నిధులు లేకపోవడంతో పెండింగ్‌లో పెట్టారు. నిజామాబాద్‌ జిల్లాలో 1,705 కనెక్షన్లు, జోగులాంబ గద్వాల జిల్లాలో 9,340, వికారాబాద్‌ జిల్లాలో 3,450, మెదక్‌ జిల్లాలో 721, జనగామ జిల్లాలో 2,080, ఆసిఫాబాద్‌ జిల్లాలో 4,459, నల్లగొండ జిల్లాలో 7,219, యాదాద్రి జిల్లాలో 1,950, నిర్మల్‌ జిల్లాలో 2,800 కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అంచనా వేసిన దాని కన్నా అధిక వ్యయం కావడం, రైతులు డీడీ చెల్లించలేదనే కారణంతో పలు చోట్ల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు.

వ్యవసాయ వినియోగం పెరిగినా..
వ్యవసాయ విద్యుత్‌ వినియోగం గడిచిన ఆరేళ్లలో(2013-14 నుంచి 2019-20 కాలంలో) మూడు రెట్లు పెరిగింది. 2013-14లో 9.78 లక్షల పంపుసెట్లు ఉంటే.. ప్రస్తుతం 23 లక్షల దాకా ఉన్నాయి. 2013-14లో వ్యవసాయానికి 7 గంటలే కరెంట్‌ ఇవ్వడంతో వినియోగం 4,361.35 మిలియన్‌ యూనిట్లు. అదే 2019-20లో 24 గంటలపాటు 23 లక్షల పంపుసెట్లకు కరెంట్‌ ఇవ్వడంతో వినియోగం 17,958 మిలియన్‌ యూనిట్లయింది. 2022-23లో 25 లక్షల దాకా ఉండే పంపుసెట్లకు 18,707 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరమని డిస్కమ్‌లు లెక్కగట్టాయి. అయితే ప్రభుత్వం నుంచి సబ్సిడీ పెరగాల్సి ఉండగా.. రూ.4,415 కోట్లు మాత్రమే ఇస్తామని సర్కారు ఇప్పటికే స్పష్టం చేసింది. సాధారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో టారి్‌ఫపై విధాన నిర్ణయం తీసుకోవడానికి ముందు బహిరంగ విచారణలో ప్రభుత్వం తాను ఏ మేర సబ్సిడీ ఇస్తుందో ప్రకటించడం ఆనవాయితీ. అయితే ఈ దఫా టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించే సమయంలో ప్రభుత్వ సబ్సిడీపై డిస్కమ్‌లు ప్రకటన చేశాయి. దాంతో రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన సబ్సిడీ కన్నా ఎక్కువ అందే అవకాశాల్లేవు. అయితే వినియోగం, కనెక్షన్లు పెరిగినా, ఆశించిన స్థాయిలో పెరగని సబ్సిడీ.. డిస్కమ్‌లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వ్యవసాయ కరెంట్‌తో నష్టాలు రావడం వల్ల కూడా రైతులకు కొత్త కనెక్షన్లు ఇచ్చే విషయంలో డిస్కమ్‌లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి.

కనెక్షన్లు వెంటనే ఇవ్వాలి
పెండింగ్‌లో ఉన్న కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలి. డీడీలు కట్టినా, కనెక్షన్లు ఇవ్వకుండా రైతులను తిప్పుకుంటున్నారు. ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ప్రభుత్వం.. అడిగిన వెంటనే రైతులకు కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు డిస్కమ్‌లు కూడా నిర్ణయం తీసుకోవాలి.
– సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత కిసాన్‌సభ

రైతులపై అదనపు భారం వేయొద్దు
రైతులు కనెక్షన్ల కోసం డీడీలు కడితే సాధ్యాసాధాల నివేదిక అనంతరం అంచనాలు తయారు చేసి, అదనంగా డబ్బులు కట్టాలని నోటీసులు ఇస్తున్నారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఒక్కో రైతు నుంచి రూ.25 వేల నుంచి రూ.70 వేల దాకా వసూలు చేస్తున్నారు. ప్రతి కనెక్షన్‌కు ప్రభుత్వం వెచ్చించే వ్యయం రూ.70 వేల నుంచి రూ.లక్షకు పెంచాలి.
– స్వామి బోధమయానంద, కొడంగల్‌

Courtesy Andhrajyothi

Leave a Reply