వ్యవసాయానికి కరెంట్‌ 7 గంటలే!

0
144
  • ఉత్తర డిస్కమ్‌లో అధికారికంగా విద్యుత్తు కోత
  • వరి సాగు తగ్గినా.. విద్యుత్తు వినియోగం పెరుగుదల
  • రోజుకు 250 మిలియన్‌ యూనిట్ల దాకా వినియోగం
  • బహిరంగ విపణిలో అత్యధికంగా విద్యుత్తు ధరలు
  • భారీ మొత్తం చెల్లించలేక పరిమితంగా కొనుగోలు
  • ప్రభుత్వ అనుమతితోనే కరెంట్‌ కోతల విధింపు!
  • పంట చేతికొచ్చే దశ కావడంతో రైతుల్లో ఆందోళన
  • సబ్‌స్టేషన్ల వద్ద, పొలాల్లో రైతుల నిరసనలు

రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలూ ఉచిత విద్యుత్తు ఇస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఇక తమ ప్రకటనను మార్చుకోవాల్సి ఉంటుందేమో! ఎందుకంటే.. ప్రస్తుతం వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా అవుతోంది. డిస్కమ్‌లు ఇప్పటికే భారీ నష్టాల్లో ఉండటం, బహిరంగ విపణిలో విద్యుత్తు ధరలు అత్యధికంగా ఉంటుండడంతో పెద్దమొత్తంలో ఖర్చు చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దీంతో పరిమితంగా కొనుగోలు చేస్తూ.. వ్యవసాయ పంపుసెట్లకు ఇచ్చే విద్యుత్తులో పెద్ద ఎత్తున కోత విధిస్తున్నాయి. 

హైదరాబాద్‌ : వ్యవసాయానికి ఉదయం 6 నుంచి 11 గంటల దాకా పీక్‌ పీరియడ్‌లో కరెంట్‌ అవసరం లేదని రైతులు చెబుతున్నారంటూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ) చైర్మన్‌ టి.శ్రీరంగారావు మార్చి 23న ప్రకటించడం, ఆ మేరకు డిస్కమ్‌లకు సూచనలు ఇస్తామని చెప్పడం తెలిసిందే. అయితే 19 గంటల విద్యుత్తు చాలునని రైతులు చెబుతున్నారంటూ ఈఆర్‌సీ సంకేతాలివ్వగా.. డిస్కమ్‌లు మాత్రం 7 గంటలకన్నా ఎక్కువ అక్కర్లేదని అంటుున్నాయి. సరిగ్గా యాసంగి పంట చేతికొస్తున్న సమయంలో కరెంట్‌ కోతలు అమలవుతున్నాయి. ఉత్తర డిస్కమ్‌(ఎన్పీడీసీఎల్‌)లో అధికారికంగా 7 గంటల పాటే విద్యుత్తును అందిస్తున్నారు. కాగా, త్రీఫేజ్‌ కరెంట్‌ ఉంటేనే  వ్యవసాయ పంపుసెట్లు పని చేస్తాయి. దాంతో ఆ కరెంట్‌ను 7 గంటల కన్నా మించి ఇవ్వరాదని ఉత్తర డిస్కమ్‌ నిర్ణయించింది.

ఈ మేరకు విద్యుత్తు సరఫరాపై డిస్కమ్‌లు ఏ రోజు షెడ్యూల్‌ను ఆరోజే విడుదల చేస్తున్నాయి. గురువారం ఖమ్మం సర్కిల్‌ పరిధిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరెంట్‌ ఇవ్వగా… మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ సర్కిల్‌ పరిధిలో ఉదయం 8.15 నుంచి 3.15 గంటల దాకా సరఫరా చేశారు. కరీంనగర్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇచ్చారు. దక్షిణ డిస్కమ్‌ (ఎస్పీడీసీఎల్‌)లో మాత్రం పలుచోట్ల సాయంత్రం 5 గంటల తర్వాత వ్యవసాయ పంపుసెట్లకు కరెంట్‌ కట్‌ అవుతోంది. ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని వికారాబాద్‌లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే త్రీఫేజ్‌ కరెంట్‌ ఇస్తున్నారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో సాయంత్రం 5.30 నుంచి ఉదయం 7.30 గంటల వరకు కరెంట్‌ సరఫరా అవుతోంది.

రోడ్డెక్కుతున్న రైతులు..
కరెంట్‌ కోతలతో చేతికొస్తున్న పంటలు ఎండిపోయే ప్రమాదం నెలకొనడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. సబ్‌స్టేషన్ల ఎదుట ఆందోళనలకు దిగుతున్నారు. మెదక్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రెండు వారాల క్రితం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి, కరెంట్‌ కోతలపై నివేదించారు. ఆ తర్వాత కొద్దిరోజులపాటు పరిస్థితి మెరుగుపడగా.. మళ్లీ 4 రోజుల నుంచి కరెంట్‌ కోతలు విధిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్‌ మండలంలో మాత్రమే 24 గంటలపాటు కరెంట్‌ ఇస్తున్నారు. మిగిలిన మండలాల్లో 5 నుంచి 6 గంటల పాటు కోతలు అమలవుతున్నాయి. ఇక విద్యుత్తు మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి నల్లగొండలో 12 గంటల కోత విధిస్తున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహించే సూర్యాపేట జిల్లాలోనే పరిస్థితి కాస్త బాగున్నదని రైతులు చెబుతున్నారు.

రోజుకు 250 మిలియన్‌ యూనిట్లు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్చి 29వ తేదీనఏకంగా 14,160 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ ఏర్పడింది. వరి పంట సాగు తగ్గినప్పటికీ వ్యవసాయానికి కరెంటు వినియోగం ఏ మాత్రం తగ్గలేదు. రెండు నెలలుగా ప్రతిరోజూ 250 మిలియన్‌ యూనిట్ల దాకా విద్యుత్తు వినియోగం ఉంటోంది. అధికారులు ఈ నెల 6న బహిరంగ విపణిలో ఏకంగా 50 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ను కొనుగోలు చేయగా.. ప్రస్తుతం 10-20 మిలియన్‌ యూనిట్లలోపే కొంటున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక స్లాట్‌లో కరెంట్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సరాసరిగా ఒక్కో యూనిట్‌ ధర రూ.9.35 ఉంటుంది. గరిష్ఠ ధర రూ.12ల దాకా ఉంటుంది. ఈ నేపథ్యంలో అత్యధిక ధరకు కరెంట్‌ కొనుగోలు చేయలేక.. కోతలే మేలనే భావనకు డిస్కమ్‌లు వచ్చాయి.

నష్టాలు వస్తున్నందునే
2018-19 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ డిస్కమ్‌(ఎస్పీడీసీఎల్‌)లో వ్యవసాయ పంపుసెట్లకు ఒక యూనిట్‌ విద్యుత్తు అందించడానికి అయిన వ్యయం రూ.5.05 కాగా, మూడేళ్లలో అది రూ.9.20కు చేరింది. ఏకంగా యూనిట్‌కు రూ.4.15 పెరిగింది. ఇక ఎన్పీడీసీఎల్‌(ఉత్తర డిస్కమ్‌)లో 2018-19లో వ్యవసాయ విద్యుత్తును అందించడానికి యూనిట్‌కు రూ.5.57 అయినట్లు లెక్క తీయగా.. 2022-23లో రూ.8.96 అవుతుందని అంచనా వేశారు. నష్టాల కారణంగానే డిస్కమ్‌లు కరెంట్‌ కోతలు అమలు చేస్తున్నాయి.

పొలాల వద్దే రైతుల నిరసన  
అచ్చంపేట అర్బన్‌: విద్యుత్తు కోతల కారణంగా వరిపంట పూర్తిగా ఎండిపోతోందంటూ నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో అంతయ్య, మల్లయ్య, జంగయ్య, ఆంజనేయులు, యాదయ్య, తిరుపతయ్య అనే రైతులు గురువారం తమ పంట పొలాల వద్దే నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా కరెంటు కోతలతో బోరు మోటార్లు నడవడంలేదని, చివరకు పశుగ్రాసం కూడా మిగిలే పరిస్థితి లేదని వారు వాపోయారు.

4 ఏళ్లుగా 24 గంటల కరెంట్‌ : ట్రాన్స్‌కో జేఎండీ
వ్యవసాయానికి నాలుగేళ్లుగా 24 గంటల కరెంట్‌ను సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు అన్నారు. 26 లక్షల పంపుసెట్లకు 24 గంటలపాటు విద్యుత్తును అందిస్తున్నట్లు చెప్పారు. గురువారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. రాష్ట్రం విద్యుత్తు రంగంలో స్వయం సమృద్ధి సాధించిందని చెప్పారు. మార్చి 29వ తేదీన 14,160 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ నమోదయిందని, భవిష్యత్తులో 17 వేల మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ సిద్ధంగా ఉందన్నారు.

సీఎం నియోజకవర్గానికో న్యాయం.. మాకో న్యాయమా?
మాసాయిపేట ; అది.. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గాన్ని అనుకొని ఉన్న మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం. ఇక్కడి గ్రామాల్లో కరెంటు కోతలు విధిస్తున్నారని, ఫలితంగా పంటలు ఎండుతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని పొలాలకు 24 గంటలపాటు కరెంటు ఇస్తున్నారని చెబుతున్నారు. కరెంటు విషయంలో సీఎం కేసీఆర్‌ నియోజకవర్గానికి ఒక న్యాయం, మాకో న్యాయమా? అని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కరెంటు కోతలతో చేతికొస్తున్న దశలో వరి పంట ఎండిపోతోందని ఆందోళన చెందుతున్నారు. మండలంలోని 50 మంది రైతులు బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు దాదాపు 8గంటల పాటు మాసాయిపేట సబ్‌స్టేషన్‌లో నిరసన చేపట్టారు.

Courtesy Andhrajyothi

Leave a Reply