7 రెట్ల అబద్ధం!

0
170
  • కొవిడ్‌ మరణాల లెక్కల్లో తేడా 
  • రాష్ట్ర సర్కారు ప్రకటించింది 4,065
  • మొత్తం దరఖాస్తులు 28,969
  • పరిహారం పదమూడు వేల మందికి 
  • పెండింగ్‌లో మరో 3 వేలు..

హైదరాబాద్‌ : కరోనా కేసులు, మరణాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాస్తోందా ? వాస్తవ గణాంకాలను ఎప్పటికప్పుడు వెల్లడించడం లేదా ? అంటే..  ‘ఔను’ అనే సమాధానమిచ్చే ఓ నిదర్శనం స్పష్టంగా కనిపిస్తోంది. అదే.. కొవిడ్‌ పరిహారం కోసం జాతీయ విపత్తుల యాజమాన్య సంస్థ (ఎన్‌డీఎంఏ)కు రాష్ట్రం నుంచి అందిన దరఖాస్తుల జాబితా!! కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేలు చొప్పున పరిహారాన్ని చెల్లిస్తున్నారు. దీని కోసం దరఖాస్తు చేసుకుంటున్న తెలంగాణవాసుల సంఖ్యకు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించిన కొవిడ్‌ మరణాల సంఖ్యకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం లెక్కల ప్రకారం.. ఈ బుధవారం (జనవరి 19) వరకు రాష్ట్రంలో 4,065 మంది కరోనాతో చనిపోయారు. కానీ ఎన్‌డీఎంఏకు మాత్రం ఏకంగా ఏడు రెట్లు ఎక్కువ సంఖ్యలో 28,969 కుటుంబాల నుంచి పరిహారం కోసం దరఖాస్తులు అందాయి. వాటిలో 16వేల దరఖాస్తులకు ఆమోదం తెలిపిన ఎన్‌డీఎంఏ, 13వేల కుటుంబాలకు పరిహారాన్ని చెల్లించే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. మిగతా 3వేల దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ఆధార్‌, బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల ఈ దరఖాస్తుదారులకు నష్టపరిహారాన్ని చెల్లించలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆ మూడువేల దరఖాస్తులు కూడా క్లియర్‌ కాగానే, కొవిడ్‌ పరిహారాన్ని చెల్లిస్తామని ఎన్‌డీఎంఏ అధికారులు చెబుతున్నారు. కొవిడ్‌ పరిహారం కోసం ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని అంటున్నారు. కరోనాతో మరణించినవారి కుటుంబ సభ్యులు నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల మరోసారి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈనేపథ్యంలో మరో 12వేల కొత్త దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్‌డీఎంఏ అంచనా వేస్తోంది.

జాబితాను సవరించకపోవడంతో..
తెలంగాణ నుంచి ఇప్పటికే 29వేల కుటుంబాలు కొవిడ్‌ పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా మరణాలు 4,065 మాత్రమేనని వాదిస్తోంది. ఎందుకీ అంతరం ? అనే దానికి సమాధానం దొరకని పరిస్థితి నెలకొంది. కొవిడ్‌ మరణాల గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరించి ఉంటే.. మరణాల సంఖ్య పెరిగి ఉండేదని పరిశీలకులు అంటున్నారు. కేరళ రాష్ట్రం గణాంకాలను పరిశీలిస్తే.. కొవిడ్‌ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి అది మరణాల జాబితాను ప్రతిరోజూ సవరిస్తోంది. కొవిడ్‌ పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను మరణాల జాబితాలో ఎప్పటికప్పుడు జోడిస్తోంది. ఏదిఏమైనప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న కరోనా మరణాల కంటే రాష్ట్రంలో సంభవించిన మరణాలు కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నాయనే దానికి కొవిడ్‌ పరిహార దరఖాస్తుల జాబితా నిదర్శనంగా నిలుస్తోంది అనేది విస్పష్టం.

జిల్లా కలెక్టర్ల ఆమోదంతో..
కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారాన్ని చెల్లించేందుకు సంబంధించిన మార్గదర్శకాలను 2021 నవంబరు 9న ప్రభుత్వం విడుదల చేసింది. వాటి ప్రకారం.. దరఖాస్తులను ఆన్‌లైన్‌ పద్ధతిలో స్వీకరించారు. వాటిని ఆయా జిల్లాల కలెక్టర్లే ఆమోదించారు. దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వం ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. సరైన ఆధారాలు సమర్పించిన దరఖాస్తులను క్లియర్‌ చేసి, సంబంధిత కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలో నేరుగా రూ.50వేలను జమ చేశారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అంటూ ఇప్పటివరకు ఏమీ లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. అది కూడా కేంద్రమే నిర్ణయించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply