70శాతం మంది చిన్నారుల్లో రక్తహీనత

0
192
  • – మహిళల్లో 58 శాతం, గర్భిణీల్లో 53 శాతం 
  • – తెలంగాణలో పోషకాహార లోప సమస్యలపై నిటి ఆయోగ్‌ నివేదిక 

న్యూఢిల్లీ : పోషకాహార లోపం కారణంగా తెలం గాణలో 70శాతం మంది ఐదేండ్లలోపు చిన్నారులు రక్త హీనతతో బాధపడుతున్నారని నిటి ఆయోగ్‌ వెల్లడించింది. అలాగే మహి ళల్లో 58 శాతం, గర్భిణీల్లో 53 శాతం రక్త హీనత సమస్యను ఎదుర్కొంటున్నాని తెలిపింది. ఈ మేరకు 32 శాతం మంది చిన్నారులు తక్కువ బరువు కలిగి ఉన్నారనీ, 33 శాతం మంది చిన్నారులు వయసుకి తగ్గ ఎత్తు పెరగలేదనీ, 22 శాతం మంది చిన్నారులు ఎత్తుకు తగ్గట్లుగా బరువులేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొం టున్నారని నివేదికలో పేర్కొంది. దేశంలో పోషకాహార లోపం కారణంగా చిన్నారులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియచేసే రాష్ట్ర పోషకాహార ప్రొఫైల్‌లను పోషన్‌ పేరుతో నిటి ఆయోగ్‌ అదనపు కార్యదర్శి డాక్టర్‌ రాకేశ్‌ సర్వాల్‌ శుక్రవారం విడుదల చేశారు. ఐదేండ్లలోపు చిన్నారుల్లో బరువు లోపం, ఎత్తు పెరగకపోవడం, రక్తహీనత, తక్కువ బరువు, అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యల వివరాలను నివేదికలో తెలిపింది. 2005-06, 2015-16, 2019-20ల్లో చేసిన 3,4,5 దశల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధా రంగా రూపొందించిన ఈ నివేదికలో పోషకాహార లోపం ఫలితాలు, తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఇందు లో దేశంలోని అత్యుత్తమ, పనితీరు సరిగాలేని జిల్లాలు, అత్యధిక భారం ఉన్న జిల్లాలు, టాప్‌ కవరేజ్‌ జిల్లాలను ఈ నివేదికల్లో హైలైట్‌ చేశారు. ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐఎఫ్‌పీఆర్‌ఐ), ఇండియన్‌ ఇని స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌), యూనిసెఫ్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌ (ఐఈజీ)లతో కలిసి నిటి ఆయోగ్‌ దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం ‘ది స్టేట్‌ న్యూట్రిషన్‌ ప్రొఫైల్స్‌’ను ప్రారంభించింది.

‘భారతదేశంలో పోషకాహారంపై పురోగతి: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఫేజ్‌ -1)’ అనే వెబినార్‌లో రాష్ట్ర పోషకాహార ప్రొఫైల్‌లను విడుదల చేశారు.రాష్ట్రంలో ఐదేండ్లలోపు చిన్నారుల్లో పోషకాహార లోపం కారణంగా వయసుకు తగ్గట్లుగా ఎత్తు పెరగకపోవడం అనే సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. 2019-20 గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 8,82,645 మంది చిన్నారుల్లో ఈ లోపం గుర్తించారు. అధిక భారం ఉన్న జిల్లాల జాబితాలో అత్యధికంగా రంగారెడ్డిలో 1,73,073, మహబూబ్‌నగర్‌లో 1,55,653, హైదరాబాద్‌లో 1,02,126, ఆదిలాబాద్‌లో 98,116, మెదక్‌లో 94,749మంది చిన్నారుల్లో ఈ లోపం కనిపిస్తోంది.ఐదేండ్లలోపు చిన్నారుల్లో ఎత్తుకు తగ్గ బరువులేని లోపం ప్రముఖంగా కనిపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 5,18,647 మంది చిన్నారుల్లో ఈ లోపాన్ని గుర్తించారు. జిల్లాల వారీగా చూస్తే నల్లగొండలో 77,602, మహబూబ్‌నగర్‌లో 65,038, రంగారెడ్డిలో 63,643, ఆదిలాబాద్‌లో 63,335, హైదరాబాద్‌లో 59,462మంది చిన్నారుల్లో ఈ సమస్య కనిపించింది. కాగా 2,06,206మంది చిన్నారుల్లో ఎత్తుకు తగ్గ బరువులేని సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టు కనుగొన్నారు. అందులో నల్లగొండలో 37,759, మహబూబ్‌నగర్‌లో 31,788, ఖమ్మంలో 29,717, ఆదిలాబాద్‌లో 27,696, హైదరాబాద్‌లో 26,875 మంది చిన్నారులు ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 8,06,558మంది ఐదేండ్లలోపు ఉన్న చిన్నారుల్లో పోషకాహార లోపం కారణంగా తక్కువ బరువు సమస్యను గుర్తించారు.

ఇందులో రంగారెడ్డిలో 1,35,070, మహబూబ్‌నగర్‌లో 1,20,576, ఆదిలాబాద్‌లో 1,11,642, మెదక్‌లో 1,09,326, నిజామాబాద్‌లో 76,910మంది చిన్నారులు ఉన్నారు. కాగా 15 నుంచి 49 సంవత్సరాల వయసులోని 17,76,043 మంది మహిళల్లోనూ తక్కువ బరువు లోపాన్ని గుర్తించారు. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 2,76,716, రంగారెడ్డిలో 2,40,986, కరీంనగర్‌లో 2,34,382, మెదక్‌లో 2,25,217, ఆదిలాబాద్‌లో 2,16,810 మంది మహిళల్లో తక్కువ బరువు సమస్యను కనుగొన్నారు.

అదే సమయంలో రాష్ట్రంలోని 16,34,760 మంది చిన్నారులు రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డిలో 3,11,768, మహబూబ్‌నగర్‌లో 2,71,114, హైదరాబాద్‌లో 1,91,931, నల్లగొండలో 1,74,275, మెదక్‌లో 1,63,680మంది చిన్నారుల్లో రక్తహీనత లోపాన్ని గుర్తించారు. 15 నుంచి 49 సంవత్సరాల వయసులోని మహిళల్లో రక్తహీనత సమస్య చాలా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 53,53,541 మందికి ఈ సమస్య ఉన్నట్లు కనుగొన్నారు.

జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డిలో 8,66,903, కరీంనగర్‌లో 6,95,183 , హైదరాబాద్‌లో 6,37,565, మహబూబ్‌నగర్‌లో 6,35,293, నల్గొండలో 5,56,813 మంది మహిళల్లో రక్తహీనత సమస్య కనిపించింది. అదే సమయంలో 97,473మంది గర్భవతుల్లోనూ రక్తహీనత లోపం గుర్తించారు. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డిలో 25,555, నల్గొండలో 15,231, ఖమ్మంలో 13,922, మహబూబ్‌నగర్‌లో 12,757, నిజామాబాద్‌లో 11,374మంది గర్భవతుల్లో రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు.

2020లో 15-19 వయసు యువతులు తల్లులు కావటం లేదా గర్భందాల్చడం వంటి గణాంకాలను 2016 తో పోలిస్తే రాష్ట్రంలోనే అద్భుతంగా పనిచేసిన జిల్లాగా 4.6 శాతం పాయింట్లతో హైదరాబాద్‌ జిల్లాను గుర్తించారు. అదే సమయంలో 18 ఏండ్లలోపు వివాహం చేసుకున్న యువతుల సంఖ్య హైదరాబాద్‌లో 6.4 శాతం పాయింట్లు తగ్గింది. 11.8 శాతం పాయింట్లతో తాగునీటి సౌకర్యాలను, 5.3 శాతం పాయింట్లతో పారిశుధ్య వసతులను మెరుగుపరిచిన జిల్లాగా రాష్ట్రంలో హైదరాబాద్‌ జిల్లా ముందంజలో ఉన్నది. కాగా మహిళల విద్యాభ్యాసం విషయంలో, 5ఏండ్లలోపు చిన్నారుల్లో స్థూలకాయం నియంత్రణ, 15-49 ఏండ్ల మధ్య మహిళల్లో స్థూలకాయం, రక్తపోటు నియంత్రణ, 15-54 ఏండ్ల మధ్య పురుషుల్లో రక్తపోటు నియంత్రణ విషయంలో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన జిల్లాగా హైదరాబాద్‌ చోటు దక్కించుకుంది.

2016 నుంచి 2020 మధ్య కాలంలో ఐదేండ్లలోపు చిన్నారుల్లో వయసుకు తగ్గట్లుగా ఎత్తు పెరగకపోవడం, ఎత్తుకు తగ్గట్లుగా బరువు పెరగకపోవడం సమస్యలు 5 శాతం పాయింట్లు (పీపీ) చొప్పున పెరిగాయి. కాగా తక్కువ బరువు 4 శాతం పాయింట్లు, రక్తహీనత 9 శాతం పాయింట్లు పెరిగాయి. కాగా ఈ నాలుగేండ్లలో మహిళల విషయంలో తక్కువ బరువు సమస్య 4 శాతం పాయింట్లు తగ్గింది. గర్భిణీలు కాని వారిలో రక్తహీనత 1 శాతం పాయింట్లు, గర్భిణీల్లో రక్తహీనత 5 శాతం పాయింట్లు పెరిగింది. మహిళల్లో అధిక బరువు, ఊబకాయం సమస్య 1 పీపీ పెరిగింది. కాగా ఈ నాలుగేండ్లలో పురుషుల్లో అధిక బరువు, ఊబకాయం 8 శాతం పాయింట్లు పెరిగింది.

కనీసం 37 శాతం మందిలో తల్లిపాలను ప్రారంభించడం, 9 శాతం మందికి తగినంత ఆహారం ఇచ్చేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అతిసారం సమయంలో ఓఆర్‌ఎస్‌ (56 శాతం) అతిసారం సమయంలో జింక్‌ (41శాతం) వినియోగం చేయాలని ప్రతిపాదించారు.

Courtesy Nava Telangana

Leave a Reply