ఐదేండ్లలో 79 శాతం జడ్జీలు అగ్రకులాల వారే

0
274

ఎస్సీ, మైనార్టీలు కేవలం 2 శాతమే
పార్లమెంటరీ ప్యానెల్‌కు చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ : గత ఐదేండ్లలో దేశంలోని హైకోర్టులకు 79 శాతం మంది న్యాయమూర్తులు అగ్ర కులాల వారే నియమితులయ్యారు.షెడ్యూల్డ్‌ కులాలు, మైనారిటీలు కేవలం 2 శాతం మాత్రమే నియామకం అయ్యారు. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్‌కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లా అండ్‌ జస్టిస్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం… న్యాయ వ్యవస్థలోని సామాజిక వైవిధ్యాన్ని సూచిస్తోంది. 2018-2022 మధ్య కాలంలో నియమించిన హైకోర్టు న్యాయమూర్తులలో 79 శాతం మంది అగ్రవర్ణాలకు (జనరల్‌ కేటగిరీ) చెందినవారే ఉన్నారు. 2018 నుంచి 2022 డిసెంబర్‌ 19 వరకు వివిధ హైకోర్టులకు 537 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. అందులో 79 శాతం జనరల్‌ కేటగిరీ, 11 శాతం ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), 2.6 శాతం మైనారిటీ, 2.8 శాతం షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ),1.3 శాతం షెడ్యూల్డ్‌ తెగల (ఎస్సీ) వారు ఉన్నారు. దేశంలోని 25 హైకోర్టుల్లో నియామకాలు ఎక్కువగా అగ్రవర్ణాల వారే కావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. రాజ్యాంగ న్యాయస్థానాల నియామకాలలో 11 శాతం కంటే తక్కువగా ఉన్న దేశ జనాభాలో 35 శాతం కంటే ఎక్కువ ఉన్న ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ) పట్ల నియామకాలలో ”వివక్ష”ను ఇది సూచిస్తుంది.

న్యాయమూర్తుల నియామకానికి షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలకు చెందిన అభ్యర్థులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను అభ్యర్థిస్తోందని న్యాయ మంత్రి కిరెన్‌ రిజిజు 2021లో పార్లమెంటుకు తెలిపారు. న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ”రాజ్యాంగ న్యాయస్థానాలకు నియామక ప్రక్రియలో సామాజిక వైవిధ్యం, సామాజిక న్యాయం సమస్యను పరిష్కరించడం సుప్రీంకోర్టు కొలీజియం, హైకోర్టు కొలీజియం ప్రాథమిక బాధ్యత” అని తెలిపింది. న్యాయమూర్తుల నియామకం విషయాలలో న్యాయవ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వబడిందనీ, అందువల్ల న్యాయవ్యవస్థ స్వయంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. న్యాయవ్యవస్థలో ”సామాజిక వైవిధ్యం, సామాజిక న్యాయం సమస్యను పరిష్కరించాల్సిన” అవసరాన్ని నొక్కి చెప్పింది. న్యాయమూర్తుల నియామకంలో కొలీజియంకు ఉన్న ప్రాధాన్యత ప్రస్తుత అసమానతలను తొలగించలేదని పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు కేంద్రం పేర్కొంది.

అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 217, 224 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల నియామకం సూత్రం ప్రకారం ”ఏ కులానికీ, వర్గానికి చెందిన వ్యక్తులకు రిజర్వేషన్లు కల్పించడం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. న్యాయమూర్తుల నియామకానికి ప్రతిపాదనలు పంపేటప్పుడు, సామాజిక వైవిధ్యాన్ని నిర్ధారించడానికి షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలకు చెందిన తగిన అభ్యర్థులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.

సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను పంపినప్పుడల్లా, న్యాయ మంత్రిత్వ శాఖ వాటిని పరిశీలిస్తుంది. ఇంటెలిజెన్స్‌ బ్యూరో సిఫారసు చేసిన అభ్యర్థుల నేపథ్యాన్ని తనిఖీ చేస్తుంది. ఆపై వారి సలహా కోసం హైకోర్టు కొలీజియం సిఫారసులతో సహా వివరణాత్మక నివేదికను సుప్రీంకోర్టు కొలీజియానికి పంపుతోంది. సుప్రీంకోర్టు కొలీజియం పేర్లను క్లియర్‌ చేసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం నియామకాలను నోటిఫై చేస్తుంది.

ప్రభుత్వం, అత్యున్నత న్యాయస్థానం మధ్య విభేదాలు ఉన్నట్లయితే, ప్రభుత్వం పేర్లను పున్ణపరిశీలన కోసం సుప్రీంకోర్టు కొలీజియానికి తిరిగి పంపుతుంది. కానీ కొలీజియం అదే పేరును పునరుద్ఘాటించిన తరువాత, ప్రస్తుత కొలీజియం వ్యవస్థ ప్రకారం ఆ వ్యక్తిని న్యాయమూర్తిగా నియమించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి.

ఇతర సంస్థల్లోనూ ఇదే పరిస్థితి
న్యాయస్థానాల్లోనే కాదు, ఇతర సంస్థల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఉన్న సంస్థల్లో పరిస్థితి మరింత దిగజారింది.ఈ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడం సంస్థల రాజ్యాంగ బాధ్యత. ఉదాహరణకు, ఎయిమ్స్‌ విషయానికి వస్తే, 1,111 అధ్యాపక స్థానాల్లో, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల కోసం మొత్తం 275, ప్రొఫెసర్ల కోసం 92 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే, పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో అర్హత ఉన్నప్పటికీ, సమర్థులు, అనుభవజ్ఞులైన రిజర్వడ్‌ కేటగిరీ వైద్యులను ఫ్యాకల్టీ స్థానాల్లో నియమించడం లేదని పేర్కొంది.

మీడియాలో కూడా ఇలాంటి ఉదంతం వెలుగు చూసింది. ఆక్స్‌ఫామ్‌ ఇండియా-న్యూస్‌లాండ్రీ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం దేశంలో అగ్రవర్ణాల వారు 90 శాతం మీడియా పదవులను కలిగి ఉన్నారు. దిగ్భ్రాంతికరమైన వాస్తవం ఏమిటంటే, ప్రధాన స్రవంతి మీడియా నాయకత్వంలో ఒక్క దళితుడు, ఆదివాసి కూడా లేరు. పై వాస్తవాలను బట్టి, దళితులు, గిరిజనుల పట్ల వివక్ష అనేది సంస్థాగత, క్రమబద్ధమైనదని చెప్పవచ్చు. అయితే మైనారిటీలు, ఇతర వెనుకబడిన తరగతులు కూడా దీనికి బాధితులే. ‘స్వాతంత్య్రం వచ్చిన స్వర్ణయుగం’లో కూడా ఈ వర్గాలు తమ అస్తిత్వం కోసం పాకులాడుతున్నా ఎవరూ వినడం లేదు.

Leave a Reply