మగబిడ్డే కావాలంటూ భార్యకు వేధింపులు
ముంబయి: ఆడపిల్లలు అనేక రంగాల్లో సత్తా చాటుతూ తమదైన ముద్ర వేస్తున్న కాలం ఇది. అమ్మాయి పుడితే అదృష్టంగా భావించేవారెందరో ఉన్నారు. కానీ.. కొందరిలో మాత్రం నేటికీ మార్పు రావడం లేదు. అందుకు ఇదిగో.. ఈ ఘటనే ఒక ఉదాహరణ. తనకు మగ బిడ్డ కావాలంటూ భార్యకు ఎనిమిదిసార్లు అబార్షన్ చేయించాడో వ్యక్తి. ఈ క్రమంలో ఆమెకు వందల సంఖ్యలో హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వేయించాడు. ఈ దారుణ సంఘటన ముంబయిలోని దాదర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలు (40) తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.
బ్యాంకాక్‌కు తీసుకెళ్లి మరీ..
ఓ తండ్రి తన కుమార్తె 2007లో పెళ్లి చేసి సంపన్న, విద్యాధిక కుటుంబంలోకి పంపారు. కొన్నాళ్లకే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. 2009లో ఆమె ఆడశిశువుకు జన్మనివ్వగా.. 2011లో మరోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో తనకు వారసుడే కావాలంటూ భర్త అబార్షన్ చేయించాడు. మరోవైపు తానూ చికిత్స చేయించుకోవడం మొదలుపెట్టాడు. ప్రీ ఇంప్లాంటేషన్, లింగ నిర్ధారణ తదితర అంశాలకు మన దేశంలో అనుమతి లేకపోవడంతో ఆమెను బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఎనిమిది సార్లు గర్భస్రావం చేయించాడు. చికిత్స, ఆయా పరీక్షల సమయంలో ఆమెకు 1,500కుపైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించాడు. మరోవైపు వేధింపులు పెరిగిపోతుండటంతో తట్టుకోలేక విసిగివేసారిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Courtesy Eenadu