అగ్రి మంటలు

0
278
  • 8 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌
  • మిగిలిన రోజుల్లో సభకు దూరం
  • పెద్దల సభలో మూజువాణి తీర్మానం
  • అయినా సభలోనే ఎంపీలు.. ఆందోళన
  • అవిశ్వాస’ నోటీసుకు వెంకయ్య తిరస్కరణ
  • పార్లమెంటరీ ప్రమాణాలు ఇవేనా!?
  • సభ్యుల ప్రవర్తన దురదృష్టకరం: వెంకయ్య
  • రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెట్లు
  • మూతపడవు: ప్రధాని మోదీ
  • పార్లమెంటులో నిరవధిక ధర్నా
  • గాంధీ విగ్రహం వద్ద సస్పెండైన ఎంపీలు
  • నేడు రాష్ట్రపతి భవన్‌కు ప్రతిపక్షాల ర్యాలీ
  • సాగు బిల్లులను ఆమోదించవద్దని వినతి
  • శివసేన, టీఆర్‌ఎస్‌ ఇతర పక్షాల సంతకం

న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో గందరగోళానికి కారణమైన ఎనిమిదిమంది ప్రతిపక్ష సభ్యులను సోమవారం సస్పెండ్‌ చేశారు. వర్షాకాల సమావేశాల్లో మిగిలిన రోజులు వారు సభకు రాకుండా తీర్మానం ఆమోదించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో కాంగ్రెస్‌ ఎంపీలు రాజీవ్‌ సతవ్‌, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌, రిపుణ్‌ బోరా; తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు డెరెక్‌ ఒబ్రెయిన్‌, డోలా సేన్‌; సీపీఎం ఎంపీలు కేకే రాగేశ్‌, ఎలమారం కరీం; ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ ఉన్నారు. అయితే, బయటకు వెళ్లడానికి వారు నిరాకరించారు. సభలోనే ఆందోళన తెలిపారు. వారికి ఇతర ప్రతిపక్ష సభ్యులు జత కలిశారు. వారి ఆందోళన మధ్య సభా కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఐదుసార్లు వాయిదా పడింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో సోమవారం కార్యకలాపాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయు.

ఆదివారం నాటి పరిణామాలపై వివరణ ఇచ్చే చాన్స్‌ ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యు లు కోరారు. ఎంపీల సస్పెన్షన్‌పై ఓటింగ్‌కు డిమాం డ్‌ చేశారు. కానీ, ప్రభుత్వ తీర్మానం మేరకే నిర్ణ యం ఉంటుందని రాజ్యసభ స్పష్టం చేసింది. దేశ వ్యవసాయ చరిత్రలో భారీ మార్పులు తీసుకొస్తాయంటూ అధికార బీజేపీ 3 బిల్లులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యసభలో సర్కారు సోమవారం వాటిలో రెండింటిని ఆమోదింపజేసుకున్న తీరుపై విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిల్లు పత్రాలను చించి ఉప సభాపతిపైకి విసిరారు. పోడియంపైకి ఎక్కి డిప్యూటీ చైర్మన్‌పైకి రూల్‌ పుస్తకాన్ని విసిరారు. అరుపులు, నినాదాలతో సభను హోరెత్తించారు. వారి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. వర్షాకాల సమావేశాలు ముగిసే వరకూ వారిని సస్పెండ్‌ చేస్తూ సోమవారం తీర్మానం ప్రవేశపెట్టింది. మూజువాణీ ఓటుతో దానిని ఆమోదించింది.

కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళన
వ్యవసాయ బిల్లులను పార్లమెంటు ఆమోదించడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ త్వరలో దేశవ్యాప్త ఆందోళన నిర్వహించనుంది. 2 కోట్లమంది రైతుల సంతకాలతో రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించనుంది. ‘ప్రజాస్వామ్య భారత్‌ మౌనం కొనసాగుతోంది. తొలుత మౌనం. ఇప్పుడు ఎంపీల సస్పెన్షన్‌. వెరసి నల్ల చట్టాలకు సంబంధించి రైతుల ఆందోళనలపై నిర్లక్ష్యం’’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ ప్రతిపక్షాల గొంతులను నొక్కుతున్నారని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా విమర్శించారు.

ఇకముందూ ఎమ్మెస్పీ: మోదీ
21వ శతాబ్దపు భారతదేశానికి ప్రస్తుతం పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లులు ఎంతో అవసరమని ప్రధాని మోదీ అన్నారు. కనీస మద్దతు ధరతో ప్రభుత్వ కొనుగోళ్లు ఇక ముందూ కొనసాగుతాయన్నారు. తమ ఉత్పత్తులను తగిన ధరకు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు ఉంటుందని చెప్పారు. నిబంధనలు క్రమబద్ధం చేస్తుండడంతో సుదీర్ఘ కాలంగా రైతులను దోచుకున్న ఓ ముఠా ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉందని విమర్శించారు. తాజా సంస్కరణల తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్లు మూత పడతాయని ఎవరైనా అంటే అబద్ధాలు చెబుతున్నట్లేనని మండిపడ్డారు. త్వరలో ఎన్నికలు జరిగే బిహార్‌లో 9 హైవే ప్రాజెక్టులకు మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షాల ప్రవర్తన సిగ్గుచేటు అని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ దుయ్యబట్టారు. బిల్లులను 110 మంది సమర్థిస్తే, 70 మంది వ్యతిరేకించారని చెప్పారు.

వీడియో విడుదల చేసిన ప్రభుత్వం
ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం హత్య చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రాజ్యసభలో ఆదివారం నాటి పరిణామాల వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది. డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ ముందున్న పేపర్లను లాక్కునేందుకు రాజ్యసభ సిబ్బందితో జైరాం రమేశ్‌, డెరిక్‌ ఒబ్రెయిన్‌ పెనుగులాడడం.. పేపర్లు లాక్కోవడం.. సెక్రటరీ జనరల్‌ టేబుల్‌పైకి సభ్యులు ఎక్కడం వంటి దృశ్యాలు ఉన్నాయి. డిప్యూటీ చైర్మన్‌ ముందున్న మైక్‌ను లాక్కోవడం, పేపర్లు చించి ఆయనపై వేయడం తదితరాలు అందులో ఉన్నాయి. రాజ్యసభ ప్రసారాలను ఆదివారం సెన్సార్‌ చేశారని ఒబ్రెయిన్‌ ఆరోపించిన నేపథ్యంలో సర్కారు ఆ వీడియోను విడుదల చేసింది.

పార్లమెంటులో నిరవధిక ధర్నా
రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడినా సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు రాత్రంతా పార్లమెంట్‌ ఆవరణలోనే ఉన్నారు. గాంధీ విగ్రహం వద్ద నిరవధిక ధర్నా ప్రారంభించారు. విపక్ష నేతలు మంగళవారం పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ నిర్వహించనున్నారు. వ్యవసాయ బిల్లులకు ఆమోదం తెలపవద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరనున్నారు. ఈ మేరకు, కాంగ్రెస్‌, వామపక్షాలు, శివసేన, టీఆర్‌ఎస్‌, ఆప్‌, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ, తృణమూల్‌, ఆర్జేడీ సహా 15 ఎన్డీయేయేతర పార్టీల నేతలు కోరారు. ఈ మేరకు ఓ సంయుక్త తీర్మానాన్ని రూపొందించారు. రెండు చట్టాల రూపకల్పనలో ఎన్నో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. కోరం లేదని, తమకు ఓటు హక్కు కల్పించలేదని తప్పుబట్టారు. ఇటువంటి అంశంపై మానవత్వంతో వ్యవహరించాలని, అధికార దర్పంతో వ్యవహరించరాదని పేర్కొన్నారు. బీజేడీ, బీఎస్పీ మాత్రం దానిపై సంతకం చేయలేదు. అయితే, రాష్ట్రపతికి వినతి పత్రం అందించాలని తొలుత భావించిన శిరోమణి అకాలీదళ్‌ చివరి నిమిషంలో సంతకం చేయడానికి వెనకడుగు వేసింది. కాగా వ్యవసాయ బిల్లులకు ఆమోదం తెలపవద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను పలువురు ఎన్డీయేయేతర పార్టీల నేతలు కోరారు. ఈ మేరకు, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ, తృణమూల్‌, ఆర్జేడీ తదితర పార్టీల నేతలు రాష్ట్రపతికి లేఖ రాశారు.

సభ్యులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి: వెంకయ్య
‘‘వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా కొందరు సభ్యులు పోడియంలోకి వచ్చి పేపర్లు చించేశారు. రూల్‌బుక్‌ను డిప్యూటీ చైర్మన్‌పైకి విసిరి దూషించారు. కొంతమంది సెక్రటరీ జనరల్‌ టేబుల్‌పైకి ఎక్కి డ్యాన్స్‌ చేశారు. మైకులు విరగ్గొట్టారు. పార్లమెంటరీ ప్రమాణాలు ఇవేనా!?’’ అని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పరిణామాలు తనను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని, రాజ్యసభ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. ఆత్మపరిశీలన చేసుకోవాలని సభ్యులను కోరారు. డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ను భౌతికంగా బెదిరించారని, సకాలంలో అక్కడికి మార్షల్స్‌ రాకపోతే ఆయన పరిస్థితి ఏమై ఉండేదని ఆందోళన చెందారు. ‘‘రాజ్యసభ చరిత్రలో ఇదో దుర్దినం. ఈ ఘటన నన్ను ఎంతో కలచివేసింది. ఇలాంటి ప్రవర్తన దురదృష్టకరం. అవాంఛనీయం. ఖండనార్హం’’ అన్నారు. సభ్యుల వద్ద సంఖ్యా బలం ఉంటే చర్చించి ఉండాల్సిందని, సీట్లలోనే ఉంటే ఓటింగ్‌ నిర్వహిస్తామని డిప్యూటీ చైర్మన్‌ చెబుతున్నా దూకుడుగా వ్యవహరించారని తప్పుబట్టారు. డిప్యూటీ చైర్మన్‌పై 43 మంది విపక్ష సభ్యులు సమర్పించిన అవిశ్వాస తీర్మానం లేఖను వెంకయ్యనాయుడు తిరస్కరించారు.

Courtesy Andhrajyothi

Leave a Reply