ముజిబుల్లా.. మానవత్వానికి చిరునామా!

0
349

లక్నో: మానవత్వం మరుగునపడిపోతోందని బాధపడే వారికి ముజిబుల్లా రెహమాన్‌ వెలుగు రేఖలా కన్పిస్తున్నాడు. మిణుకుమిణుకుమంటున్న ఉదాత్త విలువలకు ఈ 80 ఏళ్ల వృద్ధుడు తన రెండు చేతులను అడ్డుపెట్టి కాపాడుతున్న తీరు ఆదర్శనీయం. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో పరులకు సాయం చేస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. కరోనా సంక్షోభంలో అష్టకష్టాలు పడుతున్న పేద వలస శ్రామికుల సామాను ఉచితంగా మోస్తూ మానవత్వాన్ని చాటుతున్నాడు ఈ పెద్ద మనిషి.

ముజిబుల్లా రెహమాన్‌ 1970 నుండి లక్నో చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. 80 సంవత్సరాల వయస్సులో ఆయన ఇప్పటికీ తన తలపై 50 కిలోల బరువును మోయగలడు. ప్రతిరోజు రైల్వే స్టేషన్‌కు వచ్చి 8 నుంచి 10 గంటలు పనిచేస్తున్నాడు. ప్రస్తుత సంక్షోభ సమయంలో నిరుపేద వలస కార్మికుల సామానులు మోస్తూ నిస్వార్థ సేవ చేస్తున్నాడు. ఆయన సేవలను గుర్తించిన ఎండీ ఆసిఫ్‌ఖాన్‌ అనే వ్యక్తి ముజిబుల్లా రెహమాన్‌ గొప్పతనం గురించి వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీంతో ముజిబుల్లా మంచితనం గురించి బయట ప్రపంచానికి తెలిసింది. ముదిమి వయసులోనూ సాటివారికి సాయపడుతున్న ముజిబుల్లాను అందరూ మెచ్చుకుంటున్నారు.

 

లగేజీ మోసినందుకు ఎంత డబ్బు ఇవ్వాలని అడిగితే.. “నేను డబ్బు తీసుకోను. ప్రయాణికులు డబ్బులు ఇస్తామంటారు. కానీ నేను తీసుకోను. ప్రతిదీ సాధారణమైనప్పుడు డబ్బు వస్తుంది ” అని వినమ్రంగా సమాధానం చెబుతాడు ముజిబుల్లా రెహమాన్‌. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముజిబుల్లా సేవలను నెటిజనులు తెగ పొగడుతున్నారు.

Leave a Reply