ఊరికి దారేది?

0
216

రాష్ట్రంలో రోడ్లు లేని పంచాయతీలు 832

ఈ ఫొటోలోని పిల్లలు పొలం గట్లలో తిరగడంలేదు! నడిరోడ్డు మీద నడుస్తున్నారు. వీపుపై పుస్తకాల బరువుతో.. మోకాలి లోతు బురదలో స్కూలుకు వెళ్లడానికి పేద్ద సాహసమే చేస్తున్నారు. ఇవీ మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం మొక్కంపల్లి గ్రామస్థుల అగచాట్లు. మొక్కంపల్లి నుంచి కన్నేపల్లి వెళ్లాలంటే ఒక కిలోమీటరు లింక్‌ రోడ్‌తో సహా దాదాపు ఆరు కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ ర హదారిని ఎనిమిదేళ్ల క్రితం మట్టితో నిర్మించారు. తర్వాత దీనిని పట్టించుకున్న వారే లేరు. మొక్కంపల్లిలో ఉంటున్న 500 మందికి ఈ రోడ్డు తప్ప వేరే ప్రత్యామ్నా యం లేదు. ఇక వర్షాలు వచ్చాయంటే ఇదీ పరిస్థితి. ఒక్క మొక్కంపల్లి మాత్రమే కాదు… ఇలాంటి గ్రామాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి.హైదరాబాద్‌, సెప్టెంబరు 29 : 

తెలంగాణ ఏర్పడి ఐదేళ్లు దాటింది. రాష్ట్రంలో 4 వేలకు పైగా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసి కూడా ఏడాది పైనే అయింది. కానీ, గ్రామీణ రహదారుల పరిస్థితి మాత్రం ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. ఉన్న వాటిని కాస్త మెరుగుపర్చడం తప్ప… కొత్త వాటి నిర్మాణం ఆశించిన స్థాయిలో లేదని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 4 వేలకు పైగా పంచాయతీలు/ఆవాసాలకు ఇంకా కాలినడక, బండ్ల బాటలే దిక్కు కావడం గమనార్హం. రహదారులున్న చోట్ల ప్రయాణించేందుకు వీలు లేకుండా ఉన్నాయి. భారీ వర్షాలు వస్తే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి అనేక పంచాయతీలు, ఆవాసాలలో నెలకొంది. వాస్తవానికి రహదారుల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలు ప్రకటించినా.. ఆచరణలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. అయితే, ఈ సారి బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌ శాఖకు నిధులు తగ్గించినా అందులోని ఇంజనీరింగ్‌ విభాగానికి మాత్రం నిధుల కేటాయింపు పెంచారు. కేంద్ర నిధుల అంచనాలతో కలిపి రూ.3002.11 కోట్లు కేటాయించారు. దీంతో రహదారుల నిర్మాణం, మరమ్మతులపై ఆశలు చిగురిస్తున్నాయి.

వంతెనల్లోనూ పురోగతి అంతంతే… : రహదారుల నిర్మాణంలో నీటి కాలువలు, ఇతర డ్రైనేజీ వ్యవస్థల వద్ద వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. అయితే, వంతెనల నిర్మాణంలోనూ ఆశించిన పురోగతి కనిపించడం లేదు. రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రామీణ ప్రాంత రహదారులపై 1655 వంతెనలున్నాయి. గడిచిన ఐదేళ్లలో కేవలం 550 కొత్త వంతెనలకు మంజూరునివ్వగా… 270 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. తెలంగాణలో గడిచిన ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో నిర్మితమైన రహదారులు కేవలం 3,365 కిలోమీటర్లే. రాష్ట్రం ఏర్పడే నాటికి 64,044 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు ఉండగా.. ప్రస్తుతం 67,409 కిలోమీటర్ల రహదారులున్నాయి.

Courtesy Andhrajyothi…

Leave a Reply