మరో తొమ్మిది కశ్మీర్‌ల సంగతేమిటి?

0
219

ఎబికె ప్రసాద్‌

‘‘జమ్మూ–కశ్మీర్‌ ఏ సూత్రాలపైన భారత్‌లో విలీనం కావడానికి అంగీకరించిందో ఆ సూత్రాలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 370వ నిబంధనను అను సరించి కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని చట్టబద్ధం చేసింది. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ ప్రత్యేక నిబంధనను కశ్మీర్‌ ప్రజల అనుమతితో నిమిత్తం లేకుండా తొల గించడం అభ్యంతరకరం. కశ్మీర్‌ ప్రజల అను మతితో నిమిత్తం లేకుండా చేసిన ఈ సవరణ చెల్లదు గాక చెల్లదు’’ – పలువురు కశ్మీర్, కేంద్ర ప్రభుత్వాల మాజీ అత్యున్నతాధికారులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తాజా పిటిషన్‌

‘‘తొండ ముదిరి ఊసరవెల్లి’’గా మారిన చందంగా రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగా ఏర్పర్చిన జమ్మూ–కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని కాస్తా, తిరిగి రాజ్యాంగ సభను సమావేశపరిచి, చర్చించి లేదా ఎన్నికైన కశ్మీర్‌ శాసనసభలో చర్చించి నిర్ణయించకుండా బీజేపీ పాల కులు రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఈ పిటిషన్‌ దాఖలయింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన ఈ పిటిషన్‌పైన సంత కాలు చేసిన వారిలో జమ్మూ–కశ్మీర్, కేంద్ర ప్రభుత్వాల అత్యున్నత స్థాయి మాజీ ఉన్నతాధికారులున్నారు. మాజీ హోంశాఖకు చెందిన జమ్మూ–కశ్మీర్‌ సంధానకర్తల బృందం సభ్యుడు, ప్రొఫెసర్‌ రాధా కుమార్, జమ్మూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి హిందాల్‌ హైదర్‌ ల్యాబ్జీ, ఎయిర్‌–వైస్‌మార్షల్‌ కపిల్‌ కాక్‌ (రిటైర్డ్‌), భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధాలలో, యూరి సెక్టార్‌లోనూ బాధ్యతలు నిర్వహించిన మేజర్‌ జనరల్‌ అశోక్‌ కుమార్‌ మెహతా (రిటైర్డ్‌), భారత కేంద్ర ప్రభుత్వ అంతర్రాష్ట్ర మండలి మాజీ కార్యదర్శి, అమితాబ్‌ పాండే, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి గోపాల పిళ్లై!… కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రాజ్యాంగ సభ తిరిగి సమావేశపర్చి, చర్చించి, తుది నిర్ణయం తీసు కునేదాకా ఆ ప్రతిపత్తికి చెందిన 370వ నిబంధనను రద్దుచేస్తూ కేంద్రం సవరణ చట్టం తేవడానికి వీలులేదని, ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య అనీ వీరు పిటిషన్‌లో పేర్కొన్నారు. పోనీ, నాటి రాజ్యాంగ నిర్ణయసభ ఇప్పుడు లేదు కాబట్టి, కనీసం ప్రజలెన్నుకున్న కశ్మీర్‌ శాసనసభ అయినా ఉనికిలో ఉందా అంటే దానిని బీజేపీ పాలకులు ముందే రద్దు చేసి కూర్చున్నారు. ఈ సంకట స్థితికి, పాలకుల సంకర విధానాలకు సమాధానంగానే అత్యున్నత స్థాయిలో ప్రత్యక్షంగా కశ్మీర్‌ వ్యవహారాలు నిర్వహించి ఉన్న ఉద్దండులు సుప్రీం కోర్టుకు వాస్తవాలతో పరిశీలనార్థం పిటీషన్‌ను దాఖలు చేయవలసి వచ్చింది.

‘370’ సంగతి అలా ఇంకా రగులుతూండగానే బీజేపీకి ఎదురవు తున్న సమస్యలు చాలవన్నట్టుగా, కశ్మీర్‌ రాష్ట్రానికి వెలుపలవారు కశ్మీర్‌ ప్రజల భూముల్ని కొనడానికి లేదా అమ్మడానికి వీలులేదన్న నిర్దిష్ట రాజ్యాంగ నిబంధన ‘35–ఎ’ను కూడా కేంద్ర పాలకులు రద్దు చేయడంతో భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలోని బీజేపీ పాలకులు లేదా శాసనకర్తలు కశ్మీర్‌ మహిళలపైన, ఆడపిల్లలపైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. కశ్మీర్‌ భూముల ఆక్రమణతో తమకు రాగల ‘స్వేచ్ఛ’ను వీరు ఎంతవరకు సాగలాగుతున్నారో హరియాణా బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖత్తార్‌ మాటలే నిదర్శనం: ‘‘ఇకమీదట కశ్మీర్‌ ఆడపిల్లల్ని ఇక్కడికి తెచ్చేసుకోవచ్చు’  అలాగే ఢిల్లీ బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడు హన్స్‌రాజ్‌ హన్స్‌ ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ పేరును మార్చాలన్నాడు? నెహ్రూ చేసిన తప్పులను మోదీ సవరించుకుంటూ వస్తున్నందున దాన్ని ‘మోదీ–నెహ్రూ యూనివర్సిటీ’గా మార్చాలట! ఇలా చిన్న తప్పుల నుంచి దుర్భరమైన తప్పులదాకా పాలకుల ప్రవర్తనవల్ల పేరుకుపోతూ, దేశం పరువుపోతూన్న దశలో మనం ఉన్నాం. కశ్మీర్‌ పరిస్థితులు ‘చక్కబడుతున్నాయ’ని గత రెండు వారాలుగా కేంద్ర పాలకులు ప్రకటనలమీద ప్రకటనలు గుప్పించడమేగానీ, ఆ సానుకూల పరిణామం కోసం ఎదురుచూస్తున్న భారత ప్రజలకు అనుక్షణం నిరాశే ఎదురవుతోంది. అబద్ధాల్ని నిజాలుగాను, నిజాల్ని అబద్ధాలుగానూ మనం చూడలేని ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం.

నేడు ‘370’, ‘35–ఎ’ నిబంధనలు రాజ్యాంగంనుంచి కనుమరుగైనట్లు కన్పించినా, ఆ రెండు రాజ్యాంగ నిబంధనల వెలుగునీడలు దేశంలోని కొన్ని రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రం తొలగడంలేదు, పరోక్షంగా కొనసాగుతున్నాయని చెబితే అత్యుక్తి కాదు. ఎందుకంటే నిన్నటివరకు ‘370’, ‘35–ఎ’ ప్రత్యేక ప్రతిపత్తి నిబంధనలు కశ్మీర్‌కే పరిమితమని భావించాం, కానీ ఆచరణలో ఆ నిబంధనల నీడలో మన దేశంలోనే ఉన్న కశ్మీర్‌ ఒక్కటే కాదు, అలాంటి ప్రతిపత్తిని దరిదాపుల్లో చెలాయించుకుంటున్న ‘పిల్ల కశ్మీర్‌’లు కనీసం ఎనిమిది రాష్ట్రాలున్నాయి. ఈ నెల ఆరవ తేదీతో ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయి ‘జమ్మూ–కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ’ చట్టం కింద కేవలం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (జమ్మూ–కశ్మీర్, లదాఖ్‌) చాలించు కోవలసి వచ్చింది. అంటే, రద్దయిన ‘370’ని మినహాయిస్తే, ఆ నిబ ంధన తోబుట్టువులే రాజ్యాంగంలోని 371 నుంచి 371 (ఎ/బి/సి /డి/ఎఫ్‌/జి/హెచ్‌) నిబంధనల దాకా ఉన్న క్లాజులన్నీ ప్రత్యేక అభి వృద్ధి మండలుల పేరిటనో, గవర్నర్ల పేరిటో, ప్రత్యేక ప్రాంతాల పేరిటో, ఏ చట్టమూ వర్తించని ప్రాంతం పేరిటో, ప్రత్యేక ప్రతిపత్తి పేరిటో రకరకాలుగా ప్రత్యేకంగా చెలామణీ అవుతున్నవి అక్షరాలా 8. అవి: నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, సిక్కిం, మిజో రాం, అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌.

ఏడు ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఐదేళ్ల క్రితం దాకా ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 371(డి) నిబంధన కింద ప్రత్యేక ప్రతి పత్తితో మెలిగిందే. ఉమ్మడి ఏపీని చీల్చడంలో ఒకరు ప్రత్యక్షంగా, మరొకరు పరోక్షంగా ఘనమైన పాత్ర పోషించిన కాంగ్రెస్, బీజేపీ కేంద్ర నాయకులేనని నిద్రలో కూడా మరవరాదు. మానవ శరీరంలోని కణాలకు ఉంటుంది ఈ విభజన (సెల్‌ డివిజన్‌). ఆ లక్షణాన్ని కేవలం పరిపాలనా సౌలభ్య ప్రయోజనాల దృష్ట్యా తప్ప రాజకీయ పార్టీలు, నాయకులు తమ మధ్య కక్షలు, కార్పణ్యాల దృష్ట్యా పెంచుకోవడం దేశ ప్రయోజనాలకు, ప్రజల విశాల ప్రయో జనాలకు చేటు తెస్తుందని గ్రహించాలి. ఈ వాస్తవాన్ని తనకున్న పరిమితులలో గ్రహించి కేవలం రెండు తెలుగు ప్రాంతాల ప్రజల మధ్య సమాన అవకాశాలు, అభివృద్ధికి అనుగుణమైన సమాన సౌకర్యాల కల్పన కోసం ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్‌కు ఉద్దేశించిన ప్రత్యేక ప్రతిపత్తి రాజ్యాంగ నిబంధనే 371(డి) అధికరణ. అలాగే ఇండియాలో సిక్కిం భాగమైన తర్వాత కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తే ‘371–ఎఫ్‌’ నిబంధన. పైగా, ఇండియాలో భాగంగా, చేర్చుకున్న సిక్కింకు సంబంధించిన ప్రత్యేక చట్టాలకూ ప్రత్యేక రక్షణ కల్పిం చింది అందుకే. ఇక రాష్ట్రాలకు గిరిజన ప్రాంతాలకు ఫెడరల్‌ (సమాఖ్య) స్ఫూర్తికి అనుగుణంగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిందీ ఇందుకేనని మరవరాదు. ఢిల్లీ, పుదుచ్చేరిలను శాసనసభా ప్రతిపత్తి గల కేంద్రపాలిత రాష్ట్రాలుగా ప్రకటించి ఆయా ముఖ్యమంత్రులను అనుదిన పాలనా వ్యవహారాలలో బీజేపీ కేంద్ర పాలకులు తమ అనుకూల లెఫ్టినెంట్‌ గవర్నర్ల ద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. వాస్తవాలకు మసి పూస్తున్నారు.

‘కాంగ్రెస్‌లో ఆరెస్సెస్‌ శక్తులు మొదటినుంచీ ఉన్నాయని’ పండిట్‌ నెహ్రూ అన్న మాటలు ఎంత నిజమో, ఇటీవల కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు కశ్మీర్‌ ప్రతిపత్తిని బీజేపీ పాలకులు రద్దు చేసిన మరుక్షణం బీజేపీలో చేరడమే నిదర్శనం. కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి రాజ్యాంగ నిర్ణయ సభ చేసిన తీర్మానానికి, నెహ్రూ క్యాబినెట్‌ దాన్ని ఆమోదించినప్పుడు మంత్రివర్గ సభ్యునిగా జన్‌సంఘ్‌ (ఆరెస్సెస్‌) నాయకునిగా శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ సమ్మతి అలా తెల్పలేదని ఇప్పుడు బీజేపీ వాదన. పైగా, ఈ వాదన ముగ్గులోకి పటేల్‌ను కూడా దించడానికి బీజేపీ నాయకులు ప్రయత్నించారు. సర్దార్‌ పటేల్, అనంత శయనం అయ్యంగార్, రాజగోపాలాచారి బహుభాషల, భిన్న మతాల, విభిన్న సంస్కృతులకు ఆలవాలమైన భారత ఉపఖం డాన్ని మత ప్రాతిపదికపై ఉపఖండ విభజనను వ్యతిరేకించారు. ఆ కలివిడితనం కోసమే కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి హోదాను సమ్మతిం చారు, గౌరవించారు. నెహ్రూ అన్నట్టుగా ‘‘కశ్మీర్‌ అనేది ఇండియా– పాకిస్తాన్‌ల మధ్య ఆట బంతి కాదు. కశ్మీర్‌కు తనదైన సొంత ఆత్మ ఉంది, దానికి సొంత వ్యక్తిత్వం ఉంది. కనుక కశ్మీర్‌తో మనంగానీ, పాకిస్తాన్‌గానీ ఆడుకోగల్గిన రాజకీయ జూదం కాదు. కశ్మీర్‌ ప్రజల సుహృద్భావంతో నిమిత్తం లేకుండా మనం ఏమీ చేయలేం’’ (1955 మార్చి 31న లోక్‌సభలో ప్రసంగం).

ఇంత గొప్ప ప్రకటన చేసిన నెహ్రూ కాంగ్రెస్‌ పక్కదారులు తొక్కింది. కశ్మీర్‌ ప్రత్యేక వ్యక్తిత్వానికి, సుకుమార సౌందర్య సద్భావా లకి నివాళులర్పించిన వాజ్‌పేయి నేతృత్వం వహించిన బీజేపీ మళ్లీ విభజన సిద్ధాంతాన్ని పట్టుకునే వేళ్లాడుతోంది. బీజేపీ నాయకులు రాజ్యాంగంలోని 253వ అధికరణ నిర్దేశించిన నిర్ణయాన్ని సదా గుర్తుంచుకోవాలి. ‘‘భారత ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్నయినా రద్దు చేయాలనుకుంటే అందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి విధిగా అవసరమని ఆ నిబంధన శాసిస్తోంది. కశ్మీర్‌లో ఆ బాధ్యతను నిర్వ హించకుండా ఉండేందుకే తమ సభ్యత్వం ఉన్న సంకీర్ణ మంత్రి వర్గాన్ని ముందుగానే బీజేపీ నాయకత్వం పడగొట్టి, ఆరునెలల్లోగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రపతి ద్వారా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాలన నిర్వహించి గద్దెనెక్కాలని పన్నుగడ పన్నింది. అందుకు సాకుగా భారత రాష్ట్రాల్లోని పేదరికాన్ని చూపకుండా ప్రత్యేకంగా ‘కశ్మీర్‌ అభివృద్ధికి అక్కడి పేదరికాన్ని’ సాకుగా చూపుతూ చట్ట సవరణ ద్వారా ఒక్క కలంపోటుతో కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికే ఎసరు పెట్టింది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాజీ ప్రధాన కార్య దర్శులు, సైనికాధికారులు, దౌత్యనీతిజ్ఞులు సుప్రీంకోర్టును కదపవ లసి వచ్చింది. న్యాయ వ్యవస్థ ఇంకా సజీవంగానే ఉందన్న నమ్మ కంతో వీరు ఈ చర్యకు పాల్పడ్డారు.

వ్యాసకర్త సీనియర్‌ సంపాదకులు

(Courtacy Sakshi)

Leave a Reply