మహాత్ముడిపై దూషణ.. హిందూ మత నాయకుడు కాళీచరణ్‌ అరెస్టు

0
232

రాయ్‌పుర్‌: జాతిపిత మహాత్మాగాంధీని అవమానిస్తూ.. గాడ్సేపై ప్రశంసలు కురిపించిన ఆధ్యాత్మిక గురువు, హిందూ మత నేత కాళీచరణ్‌ మహారాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఆయనను రాయ్‌పుర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఛత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్తున్నారు.

రాయ్‌పుర్‌లోని రావణ్‌ భాగా మైదానంలో గత ఆదివారం జరిగిన ధర్మ సన్సద్‌లో కాళీచరణ్‌ ప్రసంగిస్తూ మహాత్మునిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గాంధీపై దూషణలకు పాల్పడిన కాళీచరణ్‌.. గాడ్సేను ప్రశంసించడం వివాదానికి దారితీసింది. అంతేగాక, మతాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ప్రభుత్వాధినేతగా బలమైన హిందూ నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు రాయ్‌పుర్‌లో ఆయనపై ఓ కాంగ్రెస్‌ నేత పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఘటన జరిగిన తర్వాత నుంచి కాళీచరణ్‌ అదృశ్యమైపోయారు. పోలీసులు ట్రాక్‌ చేస్తారన్న అనుమానంతో ఆయన అనుచరులు కూడా తమ ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఆయన గెస్ట్‌హౌజ్‌ బుక్‌ చేసుకున్నట్లు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లగా.. కాళీచరణ్‌ కన్పించలేదు. ఎట్టకేలకు ఖజురహోకు సమీపంలోని ఓ హోటల్‌లో ఆయన ఆచూకీ లభించింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

Courtesy Eenadu

Leave a Reply