ఆజం ఖాన్‌కు మూడేళ్ల జైలు

0
102
  • ప్రధాని మోదీపై విద్వేష ప్రసంగం కేసులో
  • సమాజ్‌వాదీ సీనియర్‌ నేతకు శిక్ష
  • 2019 ఎన్నికల సమయంలో యూపీ
  • ముఖ్యమంత్రి యోగిపైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు
  • నేరాన్ని నిర్ధారించి రూ.25 వేల జరిమానా
  • కూడా విధించిన ప్రత్యేక న్యాయస్థానం

లఖ్‌నవూ : ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విద్వేష ప్రసంగాలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. విద్వేషప్రసంగాలు ఎవరు చేసినా ఉక్కుపాదం మోపాలని యూపీ, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు గతవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ, యోగితో పాటు నాటి రాంపూర్‌ కలెక్టర్‌ ఆంజనేయకుమార్‌ సింగ్‌పై ఆజంఖాన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు దేశంలో ఉండేందుకు వీల్లేని వాతావరణం కల్పించారని ప్రధానిపై ఆరోపణలు చేశారు. దీనిపై ఐపీసీ 153ఏ (మతవిద్వేషాలను రెచ్చగొట్టడం), 505ఏ (వివిధ వర్గాల నడుమ శత్రుత్వం, ద్వేషభావాలు సృష్టించే తప్పుడు ప్రకటనలు ఇవ్వడం) సెక్షన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 125 (ఎన్నికల్లో వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం) కింద ఆయనపై కేసు నమోదుచేశారు. ఆయన నేరాన్ని రాంపూర్‌లోని ప్రత్యేక కోర్టు నిర్ధారించిందని.. మూడేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించిందని ప్రభుత్వ న్యాయవాది అజయ్‌ తివారీ వెల్లడించారు. హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా తీర్పు అమలును వారంపాటు సస్పెండ్‌ చేసిందన్నారు.

తీర్పు అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చిన ఆజంఖాన్‌ విలేకరులతో మాట్లాడారు. న్యాయస్థానంపై తనకు అచంచల విశ్వాసం ఉందని.. బెయిల్‌ మంజూరు చట్ట నిబంధన అని వ్యాఖ్యానించారు. సమాజ్‌వాదీ పార్టీలో నంబర్‌ టూగా చలామణి అవుతున్న ఖాన్‌పై అవినీతి, దొంగతనం సహా దాదాపు 90 కేసులు ఉన్నాయి. భూకబ్జా కేసులో రెండేళ్లు జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు గత మే నెలలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. 2019లో రాంపూర్‌ ఎంపీగా గెలిచిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో పదో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Leave a Reply