- బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తుల ఘాతుకం
- బాలిక ముఖం, కళ్లకు తీవ్ర గాయాలు..
- సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స
- ఢిల్లీలో అమ్మకాలపై నిషేధం అమల్లో
- ఉండగా యాసిడ్ ఎలా లభిస్తోంది?
- సమగ్ర విచారణ జరిపి దుండగులపై కఠిన
- చర్యలు తీసుకోండి: ఎల్జీ సక్సెనా
- ఇంత సాహసమా? ఉపేక్షించేది లేదు: కేజ్రీ
- కూరగాయలు దొరికినట్లుగా యాసిడ్ లభిస్తుంటే నిద్రపోతున్నారా?
- నివేదికివ్వండి: ఢిల్లీ మహిళా కమిషన్
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో మరో ఘోరం! నడిరోడ్డు మీద 17 ఏళ్ల పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. బుధవారం ఉదయం 7:30 గంటలకు బడికి వెళ్లేందుకు తన చెల్లెలితో కలిసి ఇంట్లోంచి బయలుదేరిన ఆరేడు నిమిషాల్లోనే ఈ దారుణం చోటుచేసుకుంది. ద్వారక మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కడానికి ఎదురుచూస్తున్న సమయంలోనే ముఖాలకు మాస్కు ధరించి ద్విచక్రవాహనమ్మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను బాలిక ముఖమ్మీద పోశారు. ఈ ఘటనలో ఆమె ముఖం, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు ఆలస్యంగా స్పందించడం అనుమానాలకు తావిస్తోంది. దాడి ఘటన జరిగిన గంటన్నర తర్వాత తమకు సమాచారం వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా దాడికి పాల్పడిన దుండగులు బాధితురాలికి తెలిసనవాళ్లేనని పోలీసులు నిర్ధారించారు. చికిత్స కోసం బాలికను తొలుత దీన్‌దయాళ్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. యాసిడ్ దాడికి పాల్పడిన వారి పేర్లను బాధితురాలు పేర్కొనగా ముగ్గురు నిందితు(సచిన్, హర్షిత్, వీరేందర్ సింగ్)లను అరెస్టు చేసినట్లు ద్వారక డీసీపీ హర్షవర్ధన్ వెల్లడించారు. బాలికపై యాసిడ్ దాడి ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు.
దుండగుల బైక్‌కు నంబర్ ప్లేట్ లేదని, వారెవరనేది తన అక్కకు, తండ్రికి తెలుసునని బాధితురాలి సోదరి చెప్పారు. కాగా బాలికపై యాసిడ్ ఘటనపై సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా తీవ్రస్థాయిలో స్పందించారు. ఢిల్లీ మార్కెట్లలో యాసిడ్ అందుబాటులో ఉంచడంపై నిషేధం అమల్లో ఉన్నా ఎలా లభ్యమైంది? అని సక్సెనా ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దుండగులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సచిన్(19) యాసిడ్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.
అధికారులు నిద్రపోతున్నారా?
ఓ బాలికపై యాసిడ్ దాడి చేసేందుకు దుండగులకు ఎంత సాహసం? అని సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులను ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని, నిందితులకు అత్యంత కఠిన శిక్ష పడాలన్నారు. యాసిడ్ దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అటు ఢిల్లీ మహిళా కమిషన్.. వెంటనే తమకు సమగ్ర నివేదికను అందజేయాలని పోలీసులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా యాసిడ్‌ను నిషేధించాలని తాము ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని.. ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందని డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ ప్రశ్నించారు. కూరగాయలను అమ్మినట్లుగా ఢిల్లీ అంతటా యాసిడ్ అమ్మకాలు విచ్ఛలవిడిగా జరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారా? అని నిలదీశారు. కాగా బాలికపై యాసిడ్ దాడికి పాల్పడిన దుండగులను బహిరంగంగా ఉరితీయాలని మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ డిమాండ్ చేశారు.