అదానీ షేర్లు విలవిల

0
132
  • గ్రూప్‌లో పలు కంపెనీల షేర్లు 20% పతనం
  • సెన్సెక్స్‌ 874 పాయింట్లు డౌన్‌.. ఎల్‌ఐసీకి 18 వేల కోట్ల నష్టం
  • ఇంట్రాడేలో 1200 పాయింట్లు పతనం..
  • రెండ్రోజుల్లో రూ.11 లక్షల కోట్ల పెట్టుబడి ఆవిరి
  • హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ సామ్రాజ్యంపై అనుమానాలు.. వివరాలడిగిన సెబీ
  • రెండ్రోజుల్లో 1.84 లక్షల కోట్ల నష్టం..
  • అదానీ గ్రూపు సంస్థల అప్పులు రూ.2 లక్షల కోట్ల పైనే
  • వాటిలో రూ.81,200 కోట్లు దేశీయ బ్యాంకుల నుంచే..

షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు 2 రోజుల్లోనే దాదాపు 11 లక్షల కోట్లు నష్టపోయారు. ఇందులో అదానీ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారే రూ.4.17 లక్షల కోట్లు కోల్పోవాల్సి వచ్చింది! వాటిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, బ్యాంకుల షేర్లు కూడా ఘోరంగా పతనమయ్యాయి. అదానీ గ్రూపు కంపెనీల్లో రూ.81 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ.. రెండు రోజుల్లోనే రూ.18 వేల కోట్లు నష్టపోయింది. ఇక, ఆయా కంపెనీలకు రుణాలిచ్చిన ఎస్బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎన్‌బీ వంటి బ్యాంకుల షేర్లూ కింది చూపులే చూశాయి. అదానీ కంపెనీల షేర్లు వరుసగా రెండోరోజూ దారుణంగా పడిపోయాయి. కొన్ని షేర్లు ఏకంగా 20% వరకూ నష్టపోయాయి. నిరుడు కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్‌, ఎన్డీటీవీ భారీగా మార్కెట్‌ విలువను కోల్పోయాయి. ఫలితంగా, ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ జాబితాలో ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలో ఉన్న అదానీ ఏడో స్థానానికి పడిపోయారు. వెరసి, అదానీ దెబ్బకు రెండో రోజూ మార్కెట్‌ పతనమైంది. సెన్సెక్స్‌ ఒక దశలో 1200 పాయింట్లు నష్టపోయినా చివరికి 874 పాయింట్ల వద్ద సర్దుకుంది. హిండెన్‌బర్గ్‌ నివేదికను ఆధారంగా చేసుకొని సెబీ కూడా అదానీ గ్రూప్‌ లావాదేవీల వివరాలు అడిగింది.

ముంబై: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్టు ప్రభావంతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ కుప్పకూలాయి. కొన్ని అదానీ కంపెనీల షేర్లయితే శుక్రవారం 20 శాతం వరకు పతనమై లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. గడిచిన రెండు సెషన్లలో గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.4.17 లక్షల కోట్లు క్షీణించింది. దాంతో గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఈ నెల 24న నమోదైన రూ.19.20 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ.15.02 లక్షల కోట్లకు పడిపోయింది. ఇంట్రాడేలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీ సెజ్‌) షేరు దాదాపు 2 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోగా.. అదానీ గ్రీన్‌ ఎనర్జీ సరికొత్త ఏడాది కనిష్ఠాన్ని తాకింది. అదానీ టోటల్‌ గ్యాస్‌ షేరు 3 నెలలకు పైగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 5 నెలల కనిష్ఠ స్థాయిని చవిచూశాయి. కాగా, అదానీ గ్రూప్‌ గత ఏడాదిలో కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్‌ కంపెనీ షేర్లు 6 నెలలు, ఏసీసీ 21 నెలల కనిష్ఠాన్ని తాకాయి.

2 సెషన్లలో అదానీ కంపెనీల నష్టం (రూ.కోట్లు)
అదానీ టోటల్‌ గ్యాస్‌ 1,04,580.93
అదానీ ట్రాన్స్‌మిషన్‌ 83,265.95
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 77,588.47
అదానీ గ్రీన్‌ ఎనర్జీ 67,962.91
ఏపీ సెజ్‌ లిమిటెడ్‌ 35,048.25
అదానీ పవర్‌ 10,317.31
అదానీ విల్మర్‌ 7,258.70
అంబుజా సిమెంట్స్‌ 23,311.47
ఏసీసీ లిమిటెడ్‌ 8,490.80
ఎల్‌ఐసీకి రూ.18,000 కోట్ల నష్టం

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకీ ఈ రెండ్రోజుల్లో రూ.18,647 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నెల 24 నాటికి పలు అదానీ కంపెనీల్లోని ఎల్‌ఐసీ పెట్టుబడుల మొత్తం విలువ రూ.81,268 కోట్లు కాగా.. శుక్రవారం నాటికి రూ.62,621 కోట్లకు తగ్గింది. ఏస్‌ ఈక్విటీ డేటా ప్రకారం.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పోర్ట్స్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌ మిషన్‌తో పాటు ఈ గ్రూప్‌ ఈ మధ్యనే కొనుగోలు చేసిన అంబు జా సిమెంట్స్‌, ఏసీసీలో ఎల్‌ఐసీకి 1-9 శాతం స్థాయిల్లో వాటాలు న్నాయి. గడిచిన రెండు ట్రేడింగ్‌ సెషన్లలో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు 19-27 శాతం మేర క్షీణించాయి.

ప్రపంచ కుబేరుల్లో 4 నుంచి 7వ స్థానానికి
10,000 కోట్ల డాలర్ల దిగువకు తగ్గిన ఆయన వ్యక్తిగత సంపద
– ఒక్కరోజే రూ.1.84 లక్షల కోట్లు డౌన్‌

షేర్ల భారీ పతనంతో అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ వ్యక్తిగత సంపద కూడా అదే స్థాయిలో క్షీణించింది. దాంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 4 నుంచి 7వ స్థానానికి జారుకున్నారు. ఫోర్బ్స్‌ బిలియనీర్స్‌ రియల్‌ టైమ్‌ జాబితా ప్రకారం.. ఈ నెల 27 నాటికి అదానీ సంపద 9,680 కోట్ల డాలర్ల (రూ.7.89 లక్షల కోట్లు)కు పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే ఏకంగా 2,250 కోట్ల డాలర్లు (18.98 శాతం) తగ్గింది. మన కరెన్సీలో ఈ క్షీణత రూ.1.84 లక్షల కోట్లు. వచ్చే వారంలో గ్రూప్‌ కంపెనీల షేర్లు మరింత పతనమైతే ఆయన టాప్‌-10 నుంచి బయటికి వచ్చే అవకాశాలున్నాయి. గ్రూప్‌ షేర్లలో కొనసాగిన దీర్ఘకాలిక బుల్‌ ర్యాలీతో గత ఏడాది సెప్టెంబరు 16న అదానీ నెట్‌వర్త్‌ ఏకంగా 15,570 కోట్ల డాలర్లకు చేరింది. దాంతో ఆ రోజు ఫోర్బ్స్‌ బిలియనీర్ల రియల్‌టైమ్‌ జాబితాలో ఆయన స్వల్పకాలం పాటు రెండో స్థానానికి ఎగబాకారు. ఆ తర్వాత ఆయన సంపద క్రమంగా తగ్గుతూ రావడంతో లిస్ట్‌లో 3వ స్థానానికి పడిపోయారు. ఈ నెల 24న నాలుగో స్థానానికి జారుకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దిగజారినప్పటికీ, ఆసియాలో ఇప్పటికీ నం.1 ధనవంతుడిగా కొనసాగుతున్నారు. కాగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 8,360 కోట్ల డాలర్ల ఆస్తితో ఆసియా నం.2గా ఉన్నారు. ప్రపంచ జాబితాలో 10 స్థానంలో కొనసాగుతున్నారు.

అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ వాటా నష్టం ఇలా..
కంపెనీ ఎల్‌ఐసీ వాటా పెట్టుబడి విలువ (రూ.కోట్లు)
(శాతం) ఈ నెల 24 ఈ నెల 27 క్షీణత
అదానీ టోటల్‌ గ్యాస్‌ 5.96 25,484 19,247 – 6,237
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 4.23 16,585 13,307 – 3,279
ఏపీ సెజ్‌ లిమిటెడ్‌ 9.14 15,029 11,824 – 3,205
అదానీ ట్రాన్స్‌మిషన్‌ 3.65 11,211 8,175 – 3,036
అదానీ గ్రీన్‌ ఎనర్జీ 1.28 3,886 3,015 – 871
అంబుజా సిమెంట్స్‌ 6.33 6,261 4,787 – 1,474
ఏసీసీ లిమిటెడ్‌ 6.41 2,811 2,267 – 544
పెట్టుబడులు 81,268 62,621 – 18,647

బ్యాంకింగ్‌ షేర్లపైనా ఎఫెక్ట్‌
అదానీ గ్రూప్‌నకు రుణాలిచ్చిన బ్యాంకు ల షేర్లూ భారీ పతనాన్ని చవిచూశాయి. బీఎ్‌సఈలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు 7.36 శాతం క్షీణించగా.. ఎస్‌బీఐ 5.03 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 5.63 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 5.31 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 4.03 శాతం నష్టపోయాయి. అంతేకాదు, అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులు కలిగిన ఎల్‌ఐసీ షేరు కూడా 3.45 శాతం పడిపోయింది.

రంగంలోకి సెబీ !
అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ దందాపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ నివేదిక,.. మార్కెట్‌ రెగ్యులేటరీ సంస్థ సెబీని కూడా కదిలించింది. దీంతో గత ఏడాది కాలంలో విదేశీ పోరుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ద్వారా అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల షేర్లలో జరిగిన లావాదేవీలపై మరిన్ని వివరాలు కోరినట్టు రాయిటర్స్‌ కథనం వెల్లడించింది. అయితే సెబీగానీ, అదానీ గ్రూప్‌ గానీ దీనిపై అధికారికంగా నోరు మెదపడం లేదని పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ నివేదికను తాము కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు పేరు చెప్పేందుకు ఇష్టపడని సెబీ అధికార వర్గాలు చెప్పినట్లు ఆ కథనం తెలిపింది. ముఖ్యంగా గత ఏడాది ఏసీసీ, అంబుజా సిమెంట్‌ కంపెనీల కొనుగోలుకు అవసరమైన నిధులను అదానీ గ్రూప్‌ ఎలా సమీకరించిందనే విషయాన్ని సెబీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

రూ.81,200 కోట్లు
బ్యాంకుల నుంచి అదానీ గ్రూప్‌ తీసుకున్న రుణం
ఇందులో పీఎస్‌బీలదే మెజారిటీ వాటా
ముప్పేమీ లేదన్న సీఎల్‌ఎస్‌ఏ
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకుల నుంచీ అదానీ గ్రూప్‌ పెద్దఎత్తున అప్పులు సేకరించింది. 2022 మార్చి నాటికి గ్రూప్‌ కంపెనీలు చేసిన రూ.2 లక్షల కోట్ల అప్పుల్లో రూ.81,200 కోట్లు (40ు) దేశీయ బ్యాంకుల నుంచే సమీకరించింది. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తన తాజా నివేదికలో ఈ విషయం తెలిపింది. దేశీయ బ్యాంకుల మొత్తం రుణాల్లో ఇది 0.55ు మాత్రమే అయినందున, బ్యాంకింగ్‌ రంగానికి వచ్చిన పెద్ద ముప్పేమీ లేదని పేర్కొంది.

పీఎస్‌బీల నుంచే ఎక్కువ
అదానీ గ్రూప్‌ కంపెనీలకు రుణాలు సమకూర్చడంలో ప్రైవేట్‌ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పీఎస్‌బీ)లే ముందున్నాయి. అయితే 2016 మార్చితో పోలిస్తే పీఎస్‌బీల వాటా తగ్గింది. 2016 మార్చి నాటికి అదానీ గ్రూప్‌ కంపెనీలకు దేశీయ బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో పీఎస్‌బీల వాటా 55 శాతంగా ఉండేది. 2022 మార్చి నాటికి అది 26 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో ప్రైవేట్‌ బ్యాంకుల వాటా కూడా 31 శాతం నుంచి 8 శాతానికి తగ్గిందని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది.

షేర్ల తాకట్టుపై అప్పులు
రుణ సేకరణకు ఉన్న ఏ అవకాశాన్నీ అదానీ గ్రూప్‌ ప్రమోటర్లు వదులుకోలేదు. గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల ఈక్విటీలో తమ వాటాలో కొంత భాగాన్ని తాకట్టు పెట్టి మరీ వేల కోట్లు అప్పులు చేశారు. గ్రూప్‌ కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవడం, ప్రతి గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీ ఈక్విటీలో ప్రమోటర్లకు 50 శాతానికి పైగా వాటా ఉండడం ఈ విషయంలో అదానీలకు బాగా కలిసొచ్చిందని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు.

హిండెన్‌బర్గ్‌ నివేదిక నమ్మదగిందే
హిండెన్‌బర్గ్‌ నివేదికను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చినా.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు మాత్రం నమ్మదగిందే అంటున్నారు. తాజాగా ఈ నివేదికను అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ బిల్‌ అక్‌మ్యాన్‌ సమర్ధించారు. ‘ఈ నివేదిక అత్యంత విశ్వసనీయమైంది. చక్కటి పరిశోధనతో ఈ నివేదిక రూపొందించారు’ అని ట్వీట్‌ చేశారు.

అదానీ ఎఫ్‌పీఓ ప్చ్‌
హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ కంపెనీలపై మదుపరుల నమ్మకం బాగా దెబ్బతింది. శుక్రవారం ప్రారంభమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఎఫ్‌పీఓ సబ్‌స్ర్కిప్షనే ఇందుకు ఉదాహరణ. రిటైల్‌, సంస్థాగత, హైనెట్‌వర్త్‌ ఇన్వెస్టర్ల కోసం రూ.14,908 కోట్ల విలువైన షేర్లను సబ్‌స్ర్కిప్షన్‌ కోసం ఉంచగా తొలి రోజు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి రూ.150 కోట్ల (1%) విలువైన బిడ్స్‌ మాత్రమే వచ్చాయి. ఎఫ్‌పీఓ ప్రైస్‌ బ్యాండ్‌ రూ.3,112-3,276 కంటే ఓపెన్‌ మార్కెట్లో 11 నుంచి 15.5% తక్కువ ధరకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు లభించడమే ఇందుకు కారణం. దీన్ని బట్టి అదానీ గ్రూప్‌పై ఇన్వెస్టర్ల నమ్మకం ఎంతగా దెబ్బతిందో ఊహించుకోవచ్చు.

మార్కెట్లకు బ్లాక్‌ ఫ్రైడే
ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌కు వారాంతం ట్రేడింగ్‌ బ్లాక్‌ ఫ్రైడేగా పరిణమించింది. భారీగా నష్టపోయిన ప్రామాణిక సూచీలు మూడు నెలల కనిష్ఠ స్థాయిలో ముగిశాయి. హిండెన్‌బర్గ్‌ రిపోర్టు ప్రభావంతో శుక్రవారం అదానీ షేర్లతో పాటు బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, యుటిలిటీ స్టాక్స్‌లో అమ్మకాలు పోటెత్తడం ఇందుకు కారణమైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచింది. ఒక దశలో 1,230 పాయింట్ల పతనంతో 59,000 స్థాయిని సైతం కోల్పోయిన సెన్సెక్స్‌.. చివరికి 874.16 పాయింట్ల (1.45%) నష్టంతో 59,330.90 వద్ద ముగిసింది. గడిచిన నెల రోజులకు పైగా కాలంలో సూచీకిదే అతిపెద్ద నష్టం. అంతేకాదు, 2022 అక్టోబరు తర్వాత కనిష్ఠ ముగింపు స్థాయిదే. నిఫ్టీ విషయానికొస్తే, 287.60 పాయింట్ల (1.61%) నష్టంతో 17,604.35 స్థాయికి పడిపోయింది.

గత ఏడాది డిసెంబరు 23 తర్వాత సూచీకిదే అతిపెద్ద నష్టం. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 23 నష్టాల్లో పయనించాయి. ఎస్‌బీఐ 5 శాతానికి పైగా క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ 4.41%, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ 3.43ు తగ్గాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు రెండు శాతానికి పైగా మార్కెట్‌ విలువను కోల్పోయాయి. రెండేళ్ల తర్వాత త్రైమాసిక లాభాలు ప్రకటించిన టాటా మోటార్స్‌ షేరు 6.34% ఎగబాకి సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బ్లూచి్‌పలతోపాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లోనూ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 1.29%, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.89% నష్టపోయాయి. బీఎ్‌సఈలోని యుటిలిటీస్‌ రంగ సూచీ అత్యధికంగా 7.34% జారుకోగా.. పవర్‌ 6.79ు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 5.75%, ఎనర్జీ 5.22%, టెలికాం 3.79%, కమోడిటీస్‌ 3.27%, బ్యాంకెక్స్‌ 3.06%, ఆర్థిక సేవల సూచీ 2.48%క్షీణించాయి. కాగా రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 1,647.85 పాయింట్లు కోల్పోగా.. స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద ఏకంగా రూ.10.73 లక్షల కోట్లకు పైగా తరిగిపోయింది.

Leave a Reply