జోహార్.. అభయ్ ఫ్లావియన్ జాజా

0
221

కోల్ కతా: ఛత్తీస్ గఢ్ ఆదివాసీ విముక్తి యోధుడు, మధ్య భారత ఆదివాసుల భూమి హక్కులకోసం, వారి జీవనశైలి పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా పోరాడిన అభయ్ ఫ్లావియన్ జాజా(37) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లా బాగ్ డోగ్రాలో కాఫీ తోటలను పరిశీలించేందుకు ఆయన వెళ్లారు. బిషప్ విన్సెంట్ అయిండ్, సిస్టర్ లలిత, ఫ్రాన్స్ నికోలస్ బార్లాతో కలిసి కాఫీ తోటలను పరిశీలించారు. జల్ పాయ్ గుడిలో వర్క్ షాప్ నిర్వహిస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో అభయ్ ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరిక్షీంచేలోపే ఆయన ప్రాణాలు వదిలారు. మార్చి 13న ఆయనకు 37వ సంవత్సరాలు నిండగా తర్వాతి రోజు (శనివారం) గుండెపోటుతో మరణించడం విషాదం. పోస్ట్ మార్టం పూర్తి తర్వాత సోమవారం ఆయన భౌతిక కాయాన్ని ఛత్తీస్ గఢ్ కు తరలించారు.

ఆదివాసీ మేధావి, యాక్టివిష్టు అయిన అభయ్ జాజా.. ఢిల్లీలోని జవహర్ లాన్ నెహ్రు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ చేశారు. బ్రిటన్ లోని ససెక్స్ యూనివర్సిటీ నుంచి సోషల్ ఆంత్రోపాలజీలో డిగ్రీ పట్టా సాధించారు. విదేశాల్లో చదవటానికి ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్‌ సాధించిన మొదటి ఆదివాసీగా ఆయన ఘనత సాధించారు. ఆదివాసుల భూమి హక్కుల కోసం అనేక క్షేత్ర స్థాయి సంస్థలతో కలిసి పని చేశారు. పరిశోధనా సంస్థలలో తన ఆదివాసీలకు సంబంధించిన పేపర్స్ సమర్పించారు. దళిత్ ఆదివాసీ బడ్జెట్ హక్కుల కోసం, వెట్టి చాకిరీ, వలసలకు వ్యతిరేకంగా, ఆదివాసీలకు స్థానిక స్వపరిపాలన కోసం ఆయన పోరాడారు. ఆదివాసీల గురించి ఆయన రాసిన అనేక వ్యాసాలు ఫస్ట్ పోస్ట్, వైర్, సబ్ రంగ్, రౌండ్ టేబుల్ ఇండియా, సిజేపీ లాంటి వెబ్ పత్రికల్లో వచ్చాయి. ఆదివాసీల హక్కులను హరించడాన్ని నిరసిస్తూ కవితలు కూడా రాశారు.

తన జీవితాన్ని ఆదివాసీ హక్కుల సాధన కోసం ధారపోసిన అభయ్ జాజా చిన్న వయసులోనే అమరుడు కావడం పట్ల హక్కుల కార్యకర్తలు, తోటి విద్యార్థులు అశ్రునయనాలతో నివాళి అర్పిస్తున్నారు. అభయ్ జాజా మరణం భారత ఆదివాసీ లోకానికి, పీడిత విముక్తి పోరాటాలకు, సామాజికశాస్త్రానికి ఇది తీరని లోటు అంటూ సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ‘జోహార్ అభయ్ జాజా’ అంటూ శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.

Leave a Reply